టీటీడీ కీలక నిర్ణయం.. ఆలయాల పునరుద్ధరణకు నిధులు విడుదల
ABN , Publish Date - Jun 23 , 2026 | 08:32 PM
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల పునరుద్ధరణకు భారీ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ భారీ నిధులను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి, జూన్ 23: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక వైభవానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆరు ప్రముఖ దేవాలయాల పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధికి భారీగా నిధులను మంజూరు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయాల పురోభివృద్ధికి కోట్లాది రూపాయలను కేటాయించి భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు సిద్ధమైంది.
తెలంగాణ ప్రాంతంలోని ఆలయాల విషయానికి వస్తే.. సిద్దిపేట జిల్లా దొమ్మాటలోని శ్రీమహాకాళేశ్వర ఆలయానికి అత్యధికంగా రూ.4.60 కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లా కించన్‌పల్లిలోని శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.09 కోట్లు, సికింద్రాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ఆధునీకరణ కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో పాటు సిద్దయ్యగుట్ట ధర్మవరంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.50.85 లక్షల నిధులు అందనున్నాయి.
ఈ కేటాయింపుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పటిష్టం కానుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిధిలోని దేవాలయాలకు కూడా శ్రీవాణి ట్రస్ట్ పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసింది. అనకాపల్లి జిల్లా మునగపాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.1.75 కోట్లు కేటాయించగా, కర్నూలు జిల్లా హుస్సేనాపురంలోని శ్రీసుంకులమ్మ, మారెమ్మ ఆలయాల అభివృద్ధి పనుల కోసం రూ.1.10 కోట్ల మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పరవాడ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా
ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. రిటైర్మెంట్ వయసు పెంపు, 11 వేల మందికి OPS
Read Latest AP News And Telugu News