హిందూ మతంపై పకడ్బందీ కుట్ర!
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:38 AM
తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక.. ఈ విషయంలో సీబీఐ సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమిభాగస్వాములైన టీడీపీ, జనసేన....
కల్తీ నెయ్యి.. కమీషన్ల కక్కుర్తితో చేసింది కాదు: చంద్రబాబు
తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశం
జగన్ హయాంలో 219 గుళ్లపై దాడులు
మొత్తం 10 ఆలయాల్లో నెయ్యి కల్తీ
భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు
నాటి టీటీడీ చైర్మన్, కొనుగోలు కమిటీకి కల్తీ నెయ్యి గురించి తెలుసు
దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటాం
సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ: సీఎం
పామాయిల్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ లాంటి రసాయనాలను లడ్డూ ప్రసాదంలో కలపడం మహాపాపం కాదా? ప్రజల మనోభావాలతోనే కాదు.. వారి ప్రాణాలతోనూ ఆడుకోవడం కాదా?
- సీఎం చంద్రబాబు
చేసిన తప్పునకు క్షమాపణ కోరకుండా.. పైగా మేం సారీ చెప్పాలంటున్నారు. తప్పు చేసిన వారు భగవంతుడికి మోకరిల్లే వరకు ఈ యుద్ధం సాగుతుంది.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రపంచంలో ఎక్కడైనా కేజీ ఆవు నెయ్యి రూ.319కి వస్తుందా? భగవంతుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా ఇష్టారాజ్యంగా కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి వాడారు.
- బీజేపీ నేత మాధవ్
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసింది చాలక.. ఈ విషయంలో సీబీఐ సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంపై కూటమిభాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ అగ్ర నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూమతంపై పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే జగన్ అండ్ కో కుట్ర చేశారని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్ ధ్వజమెత్తారు. భగవంతుడిపైనే పగబట్టారని విమర్శించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ సిట్ రాష్ట్రప్రభుత్వానికి చేసిన సూచనలపై తదుపరి చర్యలకు ఏకసభ్య కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉండవల్లి సీఎం నివాసంలో సీఎం, ఉపముఖ్యమంత్రి, మాధవ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం వారంతా విలేకరులతో మాట్లాడుతూ జగన్ అండ్ కో తీరును ఎండగట్టారు.
219 ఆలయాలపై దాడులు..
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం.. కమీషన్ల కక్కుర్తి కోసం చేసింది కాదని చంద్రబాబు స్పష్టంచేశారు. ఇది పథకం ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను.. ప్రాభవాన్ని దెబ్బతీసే కుట్రగా పేర్కొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే వారి అసలు ఉద్దేశం అర్థమవుతుందన్నారు. ఆ ఐదేళ్లలో 219 ఆలయాలపై దాడులు చేసి,అపవిత్రం చేశారని.. వీటన్నింటినీ పరిశీలిస్తే.. పకడ్బందీగా, పక్కా ప్రణాళిక ప్రకారం హిందూ ఆలయాలపైన.. హిందూ మతంపైన దాడి చేస్తూ వచ్చారని స్పష్టమవుతోందని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలేం ఎంత పవిత్రమైనవో హిందువులకు తిరుమల అంత పవిత్రమైనదన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం అనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ లడ్డూ ప్రసాదం ప్రత్యేకమైనది, దానిని ఇతరులెవరూ తయారుచేయలేరు. అంతటి పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్ల మంది ప్రజలకు ప్రసాదంగా ఇచ్చి గత పాలకులు మహా పాపం చేశారు. ఆ ఐదేళ్లలో లడ్డూ ప్రసాదం తినాలంటేనే భక్తులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది వేంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీయడానికి కావాలనే చేసిన పనిగా మేం భావిస్తున్నాం’ అని తెలిపారు. స్వామి తమ కులదైవమన్నారు. 2003లో టీటీడీలో పవిత్రమైన ‘ప్రాణదానం’ కార్యక్రమాన్ని ప్రారంభించి తిరుమలకు వెళ్తుంటే తనపై 23 క్లైమోర్ మైన్స్‌తో హత్యాయత్నం జరిగితే.. సాక్షాత్తూ స్వామే పునర్జన్మ ఇచ్చాడని గుర్తుచేసుకున్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
హైందవ ధర్మంపై జగన్‌కు విశ్వాసం లేదు..
వైసీపీ పాలనలో హిందూ ఆలయాల విషయంలో ఎన్నో అపచారాలు చోటుచేసుకున్నాయి. రామతీర్థంలో రాముడి తల తొలగించారు. చూడడానికి వెళ్తే నాపై కేసులు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబెట్టి కందిరీగలు కారణమన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం 2022లోనే వెలుగు చూసినా తొక్కిపెటారు. లడ్డూల్లో నాణ్యత తగ్గిపోవడంపై ప్రతిపక్షంగా ఎంతో పోరాడాం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూకు వాడిన నెయ్యిని ఎన్‌డీడీబీకి పంపితే.. చాలా స్పష్టంగా కల్తీ జరిగిందని చెప్పింది. దానిపై నేను మాట్లాడితే నన్ను తప్పుబట్టారు. భగవంతుడంటే లెక్కలేనితనంగా వ్యవహరించారు. హైందవ ధర్మంపై జగన్‌కు విశ్వాసం లేకపోయినంత మాత్రాన ఇలా చేస్తారా? చరిత్రలో వేంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదు. బ్రిటిషర్లు కూడా తిరుమల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించారు.. మెరుగుపరిచారు. వాళ్ల కంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ తరహా విషయాలను ముక్తకంఠంతో ఖండించాలి. మరోసారి ఎవరైనా ఇలాంటి మహాపచారం చేయాలంటే భయపడాలి. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టం. దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటాం.
2022 నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు?
లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిందే కాకుండా మళ్లీ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2022లో వచ్చిన నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు? అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు? గతంలో పనిచేసిన చైర్మన్ పీఏకు రూ.4 కోట్ల పైచిలుకు లంచంగా ఇచ్చారు. అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్‌కు, కొనుగోలు కమిటీకి తెలిసే కల్తీ నెయ్యి సరఫరా నిర్ణయాలు జరిగాయి. ఇప్పుడు వాళ్లే ఎదురుదాడి చేస్తున్నారు. దౌర్జన్యం, రౌడీయిజం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవు. నాడు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి మళ్లీ నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు శ్రీవారి ప్రసాదం కల్తీ చేసి తిరిగి నాపై ఆరోపణలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసంపైనా, నమ్మకంపైనా దాడి చేస్తున్నారు. వైసీపీ హయాంలో తిరుమలతోపాటు పది ఆలయాల్లో నెయ్యి కల్తీకి పాల్పడ్డారు. దేవుడికి అపచారం జరిగినప్పుడు అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. నెయ్యి కల్తీ చేసేందుకు ఎన్నో రకాల రసాయనాలు వాడినా భక్తుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లలేదంటే అది దేవుడి మహిమే.
రెండు కొండలు చాలన్నారు..
‘మానవ సేవే.. మాధవ సేవ’ అంటాం. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే భగవంతుడి ప్రసాదాన్నే కల్తీ చేశారు. ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. స్వామి నిస్సహాయుడని అనుకుంటున్నారా? క్షమించరాని మహాపాపం చేశారు. ఈ మహాపాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. జగన్ కరుడుగట్టిన నేరస్థుడు.. అసత్యాన్ని సత్యమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మహాపచారాన్ని సరిచేసేందుకు దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు.. దీనిని దైవ కార్యక్రమంగా భావిస్తున్నాను.
డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం చేయలేదు?
జగన్‌కు వేంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటే డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం పెట్టలేదు? టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే. సంతకమే చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించిన వ్యక్తులు.. నాపై నిందారోపణలు చేస్తున్నారు.
కల్తీ జరగలేదని దేవుడు వచ్చి చెప్పాడా?
నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని నివేదికలో ఎక్కడుంది?వైసీపీ వాళ్లు ఏమైనా కల గన్నారా? వాళ్లకు దేవుడు వచ్చి చెప్పాడా? ఉద్దేశపూర్వకంగానేస్వామిని అపవిత్రం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సిట్ చేసిన సూచనలపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తాం. కల్తీ నెయ్యి వ్యవహారంపై పీఠాధిపతులతోనూ చర్చించి ముందుకెళ్తాం.