శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:31 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే విదేశీ భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
తిరుపతి, ఆగస్టు 12: తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో ఈ - వీసా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం విదేశీ భక్తులు రావాలంటే.. ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చేది. అక్కడ ఈ -వీసా ప్రక్రియ పూర్తి చేసుకుని ఆ తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి చేరుకునే వారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలో ఈ వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై ప్రయాణికులు విదేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయం చేరుకొని ఈ - వీసా ప్రక్రియ ముగించుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి కనీసం పది రోజులు ముందే ఆన్‌లైన్‌లో ఈ - వీసాను ప్రయాణికులు అందుకోవాల్సి ఉంటుంది.
అయితే తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు లేనప్పటికీ ముందస్తుగానే ఈ - వీసా కౌంటరును కేంద్ర పౌర విమానయాన శాఖ మంజూరు చేసింది. త్వరలోనే ఈ విమానాశ్రయం నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.