శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:22 AM
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది. సాయంత్రం ఆలయంలో సేనాధిపతి విష్వక్సేనుడిని అలంకరించి విశేష సమర్పణ, అనంతరం తిరుచ్చిలో ఆశీనులను చేస్తారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తారు.
రేపు ధ్వజారోహణం..
రాత్రి పెద్దశేష వాహన సేవ
రేపు తిరుమలకు చంద్రబాబు
తిరుమల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది. సాయంత్రం ఆలయంలో సేనాధిపతి విష్వక్సేనుడిని అలంకరించి విశేష సమర్పణ, అనంతరం తిరుచ్చిలో ఆశీనులను చేస్తారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తారు. మాడవీధుల్లో విష్వక్సేనులవారిని ఊరేగించడంతో బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి. ఇక మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు రేపు తిరుమల శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన 15వ సారి పట్టువస్ర్తాలు సమర్పించనుండటం విశేషం. మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకోనున్న చంద్రబాబు తొలుత బేడి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు అర్చకులు పరివట్టం చుడతారు. ఈవో తలపై వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను ఉంచుతారు. మంగళవాయిద్యాలతో ఆలయంలోకి చేరుకుని వస్త్రాలను బహూకరించి మూలవర్లను దర్శించుకుంటారు. ఆ సమయంలో జీయ్యంగార్లు శేషవస్త్రాన్ని సీఎం మెడలో ధరింపజేస్తారు. అనంతరం 2027 టీటీడీ డైరీ, క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆలయం ముందున్న వాహన మండపానికి చేరుకుని పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి విశాంత్రి భవనానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. బుధవారం ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 17వ కంపార్టుమెంట్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సీఎం ప్రారంభించనున్నారు. భక్తులు తిరుమలలో బసచేసే గదుల్లోని సమస్యలను అధికారులు నేరుగా పరిష్కరించేందుకు రూపొందించిన ‘నందకం’ యాప్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. తిరుమలకు వచ్చే ప్రతీ భక్తుడికీ బీమా కల్పించడానికి సంబంధించి ఎల్‌ఐసీతో ఎంవోయూను కూడా చంద్రబాబు చేతుల మీదుగా చేయించాలని టీటీడీ భావిస్తోంది. అనంతరం గోగర్భం డ్యాం వద్ద ముఖేశ్, అనంత్ అంబానీ టీటీడీకి విరాళంగా ఇచ్చిన 25 ఎలక్ర్టిక్ బస్సులను సీఎం ప్రారంభించి, రింగురోడ్డు ద్వారా ఇటీవల ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియానికి చేరుకుంటారు. మ్యూజియాన్ని ప్రారంభించి తర్వాతఅధికారులతో సమీక్షించి తిరుగు ప్రయాణం కానున్నారు.
ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు లేవు: టీటీడీ
తిరుమలకు రోజుకు 15 వేల వాహనాలు మాత్రమే అనుమతిస్తారని, ఆ తర్వాత వచ్చేవాటిని చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలకు ప్రైవేట్ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆదివారం ప్రకటించింది. ‘తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల సంఖ్యపై టీటీడీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తాం. ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదు. టీటీడీ పేరుతో తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’