Share News

పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్‌ పోసి నిప్పంటించి..

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:29 AM

ఉదయాన్నే విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికురాలిపై ఇద్దరు మహిళలు సహా ముగ్గురు దాడి చేసి కళ్లల్లో కారం చల్లారు. ఆపై ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్‌ పోసి నిప్పంటించి..

  • ఇద్దరు మహిళలు సహా ముగ్గురి దాడి

  • 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రి పాలు

  • కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దారుణం

ఆదోని, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉదయాన్నే విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికురాలిపై ఇద్దరు మహిళలు సహా ముగ్గురు దాడి చేసి కళ్లల్లో కారం చల్లారు. ఆపై ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదోని పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన నరసమ్మ (30) మున్సిపాలిటీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితమే భర్త శ్రీనివాసులు చనిపోవడంతో.. ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం 5:30 గంటల సమయంలో ఆదోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా వీధి ఊడుస్తుండగా... ఉన్నట్టుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆమె కళ్లల్లో కారం చల్లారు. కళ్లు తెరవలేని స్థితిలో ఆమె విలవిల్లాడుతుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. మంటలకు తాళలేక నరసమ్మ పెట్టిన కేకలు విని తోటి పారిశుధ్య కార్మికులు పరుగున వచ్చారు. అక్కడే ఉన్న ఓ మహిళ తన చీరను తీసి ఆమెపై కప్పి మంటలు ఆర్పింది. కానీ అప్పటికే ఆమె శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


వ్యక్తిగత కక్షలే కారణం..

పోలీసుల ప్రాథమిక విచారణలో వ్యక్తిగత వివాదమే ఈ దారుణానికి కారణమని తెలిసింది. నరసమ్మతో సన్నిహితంగా ఉండే చిన్న ఈరన్న అనే వ్యక్తి ఈ ఏడాది జూలై 26న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అతని కుటుంబసభ్యులు, నరసమ్మ మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నరసమ్మపై కక్ష పెంచుకున్న చిన్నఈరన్న భార్య శిరీషతోపాటు మరో ఇద్దరు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూడా ‘నా పిల్లలను చూడండి..’ అంటూ ఆమె కన్నీరు పెట్టడం అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. కాగా, తీవ్రంగా గాయపడిన నరసమ్మ వాంగ్మూలాన్ని రెండవ అదనపు న్యాయాధికారి శ్రీవల్లి ఆస్పత్రికి వెళ్లి రికార్డు చేశారు.

ఈ వార్తలను కూడా చదవండి

ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జిగా లంక శ్యామ్‌

విద్యార్థులకు నాణ్యమైన హాస్టళ్ల కొరతపై రాహుల్ గాంధీ ఆందోళన

Updated Date - Sep 07 , 2026 | 04:29 AM