Share News

డిపాజిట్‌ 5 వేలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:16 AM

మేయర్‌, కార్పొరేటర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌, వార్డు సభ్యులుగా పోటీచేసే సాధారణ అభ్యర్థి రూ.5 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఈ డిపాజిట్‌ను రూ.2500గా నిర్ణయించారు.

డిపాజిట్‌ 5 వేలు

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2500

  • మున్సిపోల్స్‌లో చెల్లించాల్సిన మొత్తంపై నిర్ణయం

  • ప్రత్యేక ఖాతాలో అభ్యర్థుల రోజువారీ ఖర్చులు

  • పోలింగ్‌ కేంద్రానికి ఒక ఏజెంట్‌, ఇద్దరు రిలీవర్లు

  • స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మేయర్‌, కార్పొరేటర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌, వార్డు సభ్యులుగా పోటీచేసే సాధారణ అభ్యర్థి రూ.5 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఈ డిపాజిట్‌ను రూ.2500గా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. 2026 మున్సిపల్‌ చట్ట సవరణలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(కండక్ట్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ ఆఫ్‌ మేయర్‌ అండ్‌ వార్డు మెంబర్స్‌)రూల్స్‌-2016ను నోటిఫై చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. 2026 చట్ట సవరణలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు కొత్త సమగ్ర నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నిబంధనలు రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లకు తక్షణమే వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. నామినేషన్‌ పత్రంతోపాటు నగదు లేదా ఎస్‌బీఐ/ప్రభుత్వ ట్రెజరీ రసీదు ద్వారా డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్‌తో పాటు నిర్దేశిత డిక్లరేషన్లు సమర్పించాలి. అభ్యర్థి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పోలింగ్‌ ఏజెంట్‌తో పాటు ఇద్దరు రిలీఫ్‌ ఏజెంట్లను నియమించుకునే అవకాశం కల్పించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ ఏజెంట్‌, రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద మరో ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. ఓటరు గుర్తింపును పోలింగ్‌ ఏజెంట్‌ సవాలు చేయవచ్చు. ఇందుకు రూ.10 డిపాజిట్‌ చెల్లించాలి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, రాష్ట్రం వెలుపల విధులు నిర్వహిస్తున్న సాయుధ దళాలు, సాయుధ పోలీసు సిబ్బంది, నిర్బంధంలో ఉన్న అర్హులైన వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే విధానాన్ని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈవీఎంలో ఓటరు ముందుగా కార్పొరేటర్‌ను, అనంతరం మేయర్‌ను ఎంచుకునే విధంగా ప్రక్రియను నిర్దేశించారు.


మున్సిపాలిటీలు.. నగర పంచాయతీల్లో ఇలా..

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు కూడా మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్స్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ నిబంధనలు-2026 పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయి. మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలో పేరు ఉన్న, 21 ఏళ్లు నిండిన వ్యక్తి చైర్‌పర్సన్‌ లేదా వార్డు సభ్యుడిగా పోటీ చేయవచ్చు. వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి పేరు అదే వార్డు ఓటర్ల జాబితాలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ, అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి మాత్రం సంబంధిత వార్డు ఓటరు అయి ఉండాలి. అభ్యర్థి తనను తాను ప్రతిపాదించుకునేందుకు వీల్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు డిప్యూటీ తహసీల్దార్‌ కంటే తక్కువ కాని స్థాయి రెవెన్యూ అధికారి ఇచ్చిన డిక్లరేషన్‌ను నామినేషన్‌కు జతచేయాలి. అభ్యర్థులు నామినేషన్‌తో పాటు ఎన్నికల గుర్తు ఎంపిక, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటిస్తామన్న డిక్లరేషన్‌, క్రిమినల్‌ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలి. ఎన్నికల నోటిఫికేషన్‌ ఆధారంగా ఎన్నికల అధికారి నామినేషన్ల కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఒకే ఒక్క అభ్యర్థి పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయిస్తారు. పోలింగ్‌ కేంద్రంలో చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుడి ఎన్నికలకు వేర్వేరు ఓటరుకు బ్యాలెట్‌ పత్రాలను ఇస్తారు. అభ్యర్థులు ఎన్నికల సమయంలో నిబంధనల మేరకు చేసిన ప్రతి ఖర్చు రోజువారీగా ప్రత్యేక ఖాతా నిర్వహించాలి. ఆ ఖాతాను ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారికి మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా సమర్పించాలి.


  • చేతులెత్తే పద్ధతిలో వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక

  • సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా ఎంపిక

  • తొలి రెండు భేటీల్లో కోరం లేకపోతే... తర్వాత హాజరైన వారితోనే ఎన్నిక

  • పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తే సభ్యత్వం కోల్పోయే ముప్పు

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కోసం ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీస్‌ కండక్ట్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ ఆఫ్‌ వైస్‌చైర్‌పర్సన్‌ రూల్స్‌-2026ను నోటిఫై చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కోసం మున్సిపల్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం జరిగిన 15 రోజుల్లోపు ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల అధికారి అనుమతితో చైర్‌పర్సన్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. తేదీ, సమయం తదితర వివరాలతో సభ్యులకు కనీసం మూడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు ఓటు హక్కు ఉన్న సభ్యులు మాత్రమే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలి. నిర్ణీత సమయానికి గంటలోపు ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణిస్తారు. ఎన్నికలు నిర్వహించినా...వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కాకపోతే మరుసటి రోజే మళ్లీ ఎన్నిక నిర్వహించాలి. ఆ రోజు ప్రభుత్వ సెలవు ఉన్నా.. ఎన్నిక నిర్వహించవచ్చు. రెండోసారి కూడా ఎన్నిక జరగకపోతే తదుపరి తేదీని నిర్ణయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలి.


అదే విధంగా తొలి రెండు ప్రత్యేక సమావేశాలు కోరం లేక వాయిదా పడితే, ఆ తర్వాత నిర్వహించే సమావేశంలో హాజరైన సభ్యులతోనే వైస్‌చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవచ్చు. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదించాలి. ఓటు హక్కు ఉన్న మరో సభ్యుడు ఆ ప్రతిపాదనను బలపరచాలి. అభ్యర్థి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తుంటే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లేదా ఆయన అధికారికంగా నియమించిన వ్యక్తి ఇచ్చిన అధికార పక్షాన్ని ఎన్నిక రోజున ఉదయం 10 గంటల్లోపు ప్రిసైడింగ్‌ అధికారికి సమర్పించాలి. ఒక్క అభ్యర్థి మాత్రమే చెల్లుబాటయ్యేలా ప్రతిపాదనలు ఉంటే.. ఎన్నిక నిర్వహించకుండానే ఆయన్ను వైస్‌చైర్‌పర్సన్‌గా ప్రకటిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వస్తే.. చైర్‌పర్సన్‌, సభ్యులు, అభ్యర్థుల సమక్షంలో లాటరీ తీసి విజేతను ప్రకటిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన మున్సిపల్‌ సభ్యులు వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికలో పార్టీ జారీచేసిన విప్‌ను పాటించాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ ఉల్లంఘించిన సభ్యుడిపై చర్య తీసుకునే అధికారం చైర్‌పర్సన్‌కు ఉంటుంది. ఎన్నిక జరిగిన మూడు రోజుల్లో పార్టీ విప్‌ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, సంబంధిత సభ్యుడికి షోకాజ్‌ నోటీసు జారీచేయాలి. నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లో వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలి. వివరణను పరిశీలించిన అనంతరం చైర్‌పర్సన్‌ కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీచేయాలి. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవిలో ఏదైనా క్యాజువల్‌ ఖాళీ ఏర్పడితే, ఇదే ఎన్నికల విధానం వర్తిస్తుంది. ఏర్పడిన ఖాళీని ఆరు నెలల్లోపు తప్పనిసరిగా భర్తీ చేయాలి. ఎన్నికైన వైస్‌చైర్‌పర్సన్‌ పేరుతో నోటీసును మున్సిపల్‌ కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రచురించడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, కమిషనర్‌ అండ్‌ డైరెక్టరేట్‌, జిల్లా కలెక్టర్‌కు పంపాలి. ఎన్నికైన వైస్‌ చైర్‌పర్సన్‌కు కూడా నోటీసు ప్రతిని అందజేయాలి.


ఈ వార్తలను కూడా చదవండి

విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?

Updated Date - Sep 06 , 2026 | 05:36 AM