చేతల్లో మహిళా సాధికారత
ABN , Publish Date - May 28 , 2026 | 04:35 AM
మాటల్లో కాకుండా చేతల్లో మహిళా సాధికారత చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ‘స్త్రీ శక్తి’ అంశంపై ఆమె తీర్మానం పెడుతూ సభలో ప్రసంగించారు....
మహిళలను గౌరవించిందీ, అవకాశాలనిచ్చిందీ ఆత్మస్థైర్యం నింపిందీ తెలుగుదేశం పార్టీనే
స్త్రీ అంటే వ్యక్తి కాదు... శక్తి అని నమ్మిన పార్టీ
‘స్త్రీ శక్తి’ పై తీర్మానం ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే గౌతు శిరీష

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): మాటల్లో కాకుండా చేతల్లో మహిళా సాధికారత చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ‘స్త్రీ శక్తి’ అంశంపై ఆమె తీర్మానం పెడుతూ సభలో ప్రసంగించారు. ‘మహిళ బలపడితే కుటుంబం బలపడుతుందని, తద్వారా సమాజం బలపడుతుందని బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో వాటా కల్పిస్తే... నేడు చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేశారు. మహిళా విశ్వవిద్యాలయం, మహిళలకు ఆస్తిలో వాటా, వితంతువులకు పింఛన్లు, స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ టీడీపీ. నాడు కావలి ప్రతిభా భారతిని దేశంలోనే తొలి దళిత మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన ఘనత తెలుగుదేశానికి చెందుతుంది. మహిళలకు శక్తి యాప్, వన్ సెంటర్, శక్తి సదనాలు ద్వారా రక్షణ కల్పిస్తున్నాం. సొంత సోదరిపై భస్మాసుర అస్త్రం ప్రయోగించిన నీచ చరిత్ర వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది’ అని శిరీష అన్నారు.

మహిళలను గౌరవించి, అవకాశాలిచ్చిన పార్టీ
‘మహిళలను గౌరవించి, అవకాశమిచ్చి, ఆత్మస్థైర్యం ఇచ్చిన పార్టీ టీడీపీ. మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి... కుటుంబానికి ధైర్యం... సమాజానికి స్ఫూర్తి... అని నమ్మిన పార్టీ టీడీపీ. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. మహిళా సాధికారతకు నిలువటద్దం మన సీఎం చంద్రబాబు. దానికి నిదర్శనమే సామాన్యురాలినైన నాకు వారు రాజకీయంగా కల్పించిన అవకాశాలు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన నాయకుడు మన చంద్రబాబు.’
- గంట్యాడ శ్రీదేవి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు

మహిళా రిజర్వేషన్ సంక్షేమం కాదు... హక్కు
‘మహిళల అభ్యున్నతికి బాటలు వేసిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా సాధికారతకు నారీ శక్తి వందన్ అధినియం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది కేవలం ఒక సంఖ్యాపరమైన మార్పు కోసం తెచ్చింది కాదు. దేశ విధానాల్లో మహిళల స్వరం బలంగా వినిపించేందుకు రాజకీయ నిర్ణయాల్లో వారికి సమాన భాగస్వామ్యం కల్పించేందుకు తెచ్చిన గొప్ప సంస్కరణ. మహిళల సంక్షేమం కోసం పెట్టే ఖర్చు ఖర్చు కాదు. అది దేశ భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి అని నమ్మిన విజనరీ లీడర్ చంద్రబాబు. పేదలకు ఇచ్చే ఇళ్లు, రేషన్ కార్డులు మహిళల పేరుమీదే ఉండేలా చట్టం తెచ్చారు. ప్రస్తుతం దేశ జనాభాలో సగం ఉన్న మహిళల వాటా జీడీపీలో కేవలం 18 శాతంగానే చూపిస్తున్నారు. అసంఘటిత రంగంలో మహిళలు పడే కష్టాన్ని సరిగ్గా లెక్కించడం లేదు. వారి శ్రమను కూడా లెక్కిస్తే జీడీపీలో మహిళల వాటా 30 శాతానికి పైగా పెరుగుతుంది’
- రెడ్డప్పగారి మాధవి, ప్రభుత్వ విప్

సాధికారతకు అర్థం చెప్పిన పార్టీ
‘మహిళా సాధికారతకు నిజమైన అర్థం చెప్పిన పార్టీ తెలుగుదేశం. స్త్రీ అంటే కేవలం కుటుంబ బాధ్యతలు మోసే వ్యక్తి కాదు. కుటుంబానికి ధైర్యం, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి. 1983లోనే ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి చరిత్ర సృష్టించారు. నేడు జగన్‌రెడ్డి తన చెల్లికే ఆస్తి హక్కు ఇవ్వకుండా గొడ్డలి వేటు వేస్తున్నారు. డ్వాక్రా సంఘాలతో మహిళల ఆర్థిక స్వావలంబనకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రభుత్వం. బ్యాంక్‌కు వెళ్లాలంటే భయపడే మహిళలు, నేడు రూ.కోట్లు టర్నోవర్ చేసే స్థాయికి చేరారు. గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. 2024లో 22 మంది మహిళా ఎమ్మెల్యేలకు అవకాశంమిచ్చి, క్యాబినెట్‌లో మహిళలకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యమిచ్చిన పార్టీ.’
- మీరా నేతాజీ, కార్యకర్త, నగరి.

పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలన్నదే లక్ష్యం
మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా సమాజానికి శక్తిగా గుర్తించి వారిని పారిశ్రామికవేత్తలగా చేయాలన్నదే టీడీపీ లక్ష్యం. 1986లో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, అమ్మాయి అంటే భారం కాదు కుటుంబ వారసత్వమని ఎన్టీఆర్ నిరూపించారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే చంద్రబాబు విజన్-2047 లక్ష్యం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది కేవలం నినాదం కాదు... మన అధినేత చంద్రబాబు లక్ష్యం. సీ ్త్రశక్తి అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది అని మహానాడు స్పష్టం చేస్తోంది.’
- బండారు శ్రావణి, ఎమ్మెల్యే, శింగనమల

మహిళలను చట్ట సభలకు పంపిన పార్టీ టీడీపీ
‘మహిళలను చట్టసభలకు పంపి గౌరవం కల్పించిన పార్టీ టీడీపీ. స్త్రీకి అవకాశాలు కల్పిస్తే శక్తిగా ఎదిగి కుటుంబానికి అండగా నిలుస్తుందని చంద్రబాబు భావించారు. గత ప్రభుత్వం మహిళలను వంచించింది. నేడు మహిళలు చైతన్యవంతంగా వ్యాపారాలు చేసుకునే సౌకర్యం కల్పించిన వ్యక్తి చంద్రబాబు. మహిళల ద్రోహి జగన్మోహన్‌రెడ్డి. నారా భువనేశ్వరి నుంచి అనేక మంది మహిళలను గొడ్డలి పార్టీ అవమానించింది. నెల్లూరులో మహిళా కార్యకర్తగా ఉన్న నాపై 16 కేసులు పెట్టారు. నా భర్తపై 23 కేసులు పెట్టి వేధించారు. నా బాధను చంద్రబాబు గుర్తించి అండగా నిలిచారు’
- కప్పిర రేవతి, కార్యకర్త, నెల్లూరు

మహిళలకు సమాన హక్కులు టీడీపీ సిద్ధాంతం...
మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం. ఈ మహానాడులో స్త్రీశక్తిని ప్రధాన థీమ్‌గా తీసుకోవడం చారిత్రాత్మక అంశం. వైసీపీ పాలనలో 2,000 పైగా మహిళలపై హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. జగన్ ఇంటికి కూతవేటు దూరంలోనే రాణి అనే బాలికపై అత్యాచారం జరిగింది. అమరావతి మహిళలపై 1600కు పైగా తప్పుడు కేసులు పెట్టిన దుర్మార్గపు పాలన జగన్‌ది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు ఆరు శాతం తగ్గాయి.’
- పాలడుగు వినీల, తెలుగు మహిళ, మంగళగిరి

మహిళా భద్రత సామాజిక అవసరం
‘ఈ కాలంలో మహిళా భద్రత సామాజిక అవసరం. నాటి అన్న ఎన్టీఆర్ నుంచి నేటి యువ నాయకులు లోకేశ్ వరకు మహిళల భద్రతకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. అరాచక శక్తులపై రాజీలేని పోరాటం చేస్తూ డిజిటల్ యుగంలో కొత్త తరానికి భరోసానిస్తూ టీడీపీ ముందుకు సాగుతోంది.’
- యనమల దివ్య, ఎమ్మెల్యే, తుని