చీరాల టీడీపీదే
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:05 AM
బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి యెరిచెర్ల హనీస్పందన 6,468 ఓట్ల మెజారిటీతో గెలుపు బావుటా ఎగురవేశారు.
6,468 ఓట్ల మెజారిటీతో గెలిచిన హనీ స్పందన
44 వార్డుల్లో కూటమికి 25.. కాంగ్రెస్‌కు 10
8 వార్డులతో మూడో స్థానంలో వైసీపీ..
కూటమి ఖాతాలో 82 మున్సిపాలిటీలు
బాపట్ల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి యెరిచెర్ల హనీస్పందన 6,468 ఓట్ల మెజారిటీతో గెలుపు బావుటా ఎగురవేశారు. ఇక్కడ కౌంటింగ్ ఈ నెల 3నే జరగాల్సి ఉన్నప్పటికీ మురసు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో 6వ తేదీకి ఎస్‌ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కౌంటింగ్ జరగ్గా మొత్తం నాలుగు రౌండ్లలో ఫలితాలు వెల్లడయ్యాయి.
ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానంలో టీడీపీ నుంచి యెరిచర్ల హనీస్పందన, వైసీపీ నుంచి ఇస్తర్ల షెర్లీ, కాంగ్రెస్ నుంచి మేడిత దివ్య సుధాకర్ బరిలో నిలిచారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 69,557 ఓట్లు ఉండగా, 51,113 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1,300 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. టీడీపీ 21,883, వైసీపీ 15,415, కాంగ్రెస్ 11,025 ఓట్లు సాధించాయి. కాగా, చైర్‌పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకున్న టీడీపీ.. వార్డుల్లోనూ సత్తా చాటింది.
మొత్తం 44 వార్డులకు గాను టీడీపీ 22, జనసేన 2, బీజేపీ ఒక వార్డు దక్కించుకున్నాయి. 8 వార్డులతో వైసీపీ మూడో స్థానానికి పడిపోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. చీరాల మున్సిపాలిటీలో విజయంతో రాష్ట్రంలోని మొత్తం 87 పురపాలికల్లో కూటమిలోని మూడు పార్టీలు కలిపి 82 స్థానాలు దక్కించుకున్నట్లయింది. వైసీపీ 3, స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు.
కాంగ్రెస్ ప్రభావంపై చర్చ
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా చీరాలలో కాంగ్రెస్ ఏకంగా పది వార్డులు దక్కించుకోవడంతో పాటు చైర్‌పర్సన్ అభ్యర్థి గణనీయంగా ఓట్లు సాధించడం చర్చనీయాంశమైంది. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యక్తిగత పరిచయాలతో కాంగ్రెస్ సత్తా చాటగలిగింది.
చీరాలలో కాంగ్రెస్ సాధించిన విజయాలపై పీసీపీ చీఫ్ షర్మిల ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. 44 వార్డు స్థానాలకు గాను 42 చోట్ల కాంగ్రెస్ పోటీలో ఉండేలా చూడటంతో పాటు 10 స్థానాలు గెలిపించిన ఆమంచి కృష్ణమోహన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు