Share News

కౌంటింగ్‌కు వేళాయె...

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:53 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్నది.

కౌంటింగ్‌కు వేళాయె...

నేడే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం

తేలనున్న 13 మంది జడ్పీటీసీ, 117 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం

మొత్తం ఓటర్లు 1,62,407, పోలైన్‌ ఓట్లు 1,34,000

అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం

విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్నది. ఆనందపురం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు అక్కడి ఎంపీడీవో కార్యాలయంలో, భీమిలి, పద్మనాభం మండలాల ఓట్ల లెక్కింపు భీమిలి సిడార్‌ ఉన్నత పాఠశాలలో, పెందుర్తి మండల ఓట్ల లెక్కింపు అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేపట్టనున్నారు.

జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ స్థానాలకు 13 మంది, ఎంపీటీసీ స్థానాలకు 117 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 1,62,407 మందికిగాను 1,34,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 64,924 మంది పురుషులు, 69,076 మంది మహిళలు ఉన్నారు. ఆనందపురం మండలంలో 44,030 మంది, భీమిలి మండలంలో 29,912, పద్మనాభంలో 34,709, పెందుర్తి మండలంలో 25,336 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు కోసం ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాలకు 20 వంతున, పెందుర్తి మండలానికి 18...మొత్తం 78 టేబుళ్లు ఏర్పాటుచేశారు. కాగా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. లెక్కింపు ప్రక్రియ కోసం 450 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఫలితాల కోసం జడ్పీ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు.


పారదర్శకంగా ఓట్ల లెక్కింపు

అధికారులకు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశం

విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):

ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కౌంటింగ్‌ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం ఏడు గంటలకు అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో స్ర్టాంగ్‌ రూమ్‌లను తెరిచి, ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఫలితాల సమాచారాన్ని మీడియాకు ఎప్పటికప్పుడు అందించాలని, పోలీస్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సమస్యాత్మక పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవోలు దిలీప్‌ చక్రవర్తి, సంగీత్‌ మాధుర్‌, ఆయా మండలాల రిటర్నింగ్‌ అధికారులు, లైన్‌ ఇన్‌చార్జ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఐదు దశల్లో కౌంటింగ్‌

తొలుత ఎంపీటీసీ, ఆ తరువాత జడ్పీటీసీ స్థానాల ఫలితాలు

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు బ్యాలెట్‌ విధానంలో జరగడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఐదు దశల్లో సాగుతుంది. తొలుత ఎంపీటీసీ, ఆ తరువాత జడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడవుతాయి. ఓట్ల లెక్కింపు సాగుతుందిలా...

మొదటి దశలో తొలుత రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుల సీళ్లను తొలగించి ఆర్‌ఓ సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను సరిచూసి, వాటిని లెక్కిస్తారు.

రెండో దశలో స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను పోలీసుల భద్రత నడుమ ఆర్‌ఓలు కౌంటింగ్‌ హాల్‌లోకి తీసుకువస్తారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీళ్లను పరిశీలించి, బాక్సులను తెరిచి బ్యాలెట్‌ పత్రాలన్నిటినీ బాస్కెట్లు/డ్రమ్ముల్లో పోస్తారు.

మూడో దశలో ఎంపీటీసీలకు కేటాయించిన ఎరుపు రంగు బ్యాలెట్‌లను, జడ్పీటీసీలకు కేటాయించిన తెలుపురంగు బ్యాలెట్‌లను వేరుచేస్తారు.

నాలుగో దశలో ప్రతి 25 బ్యాలెట్‌ పత్రాలను ఒక కట్ట చొప్పున రబ్బర్‌ బ్యాండ్‌లతో కడతారు. అనంతరం ఎంపీటీసీలకు సంబంధించి 40 కట్టల (1,000 ఓట్లు) చొప్పున టేబుళ్లపైకి చేర్చి, ఒక్కో కట్ట చొప్పున తెరుస్తూ...అభ్యర్థుల వారీగా ఏర్పాటుచేసిన ట్రేలలో వేస్తారు. అనంతరం 50 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కింపు మొదలుపెడతారు. ఎంపీటీసీ స్థానంలో పోలైన ఓట్ల మేరకు రెండు లేదా మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఇదే సమయంలో మొదటి రౌండ్‌లో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో జడ్పీటీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కట్టలను ఒక డ్రమ్ములో వేసి, ఒక్కో టేబుల్‌కు 40 చొప్పున కట్టలను చేర్చి లెక్కింపు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఎంపీటీసీలతో పోలిస్తే...జడ్పీటీసీ ఫలితాలు వెలువడడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఎంపీటీసీ స్థానాల ఫలితం రావడానికి గంట నుంచి రెండు గంటలు, జడ్పీటీసీ అయితే మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ముందుగా పెందుర్తి జడ్పీటీసీ ఫలితం రానున్నది.

ఐదో దశలో ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు పోలైన ఓట్లు, చెల్లని ఓట్లు, నోటాకు పడిన ఓట్ల వివరాలను వెల్లడిస్తారు. ఎన్నిలైన అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.

Updated Date - Nov 07 , 2026 | 12:53 AM