Share News

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:24 AM

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్‌ మిల్లుకు వెంటనే సమ న్లు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులకు సూచించారు.

ఆంధ్రా పేపర్‌ మిల్లుపై చర్యలు తీసుకోండి

  • వెంటనే సమన్లు జారీ చేయండి

  • పీసీబీకి డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు

  • పన్ను కట్టమంటే కోర్టుకెళ్లి తప్పించుకుంటారా?

  • పుష్కరకాలంగా పన్ను ఎగవేత

  • 21.34 కోట్లు స్థానిక సంస్థలకు చెల్లించాలి

  • పేపర్‌ మిల్లు యాజమాన్యంపై ఆగ్రహం

అమరావతి/రాజమహేంద్రవరం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్‌ మిల్లుకు వెంటనే సమ న్లు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులకు సూచించారు. ఈ కంపెనీ యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని, పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతోందని అన్నారు. పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చిన ప్రతి సారీ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తోందని, బాధ్యత నుంచి తప్పించుకు తిరుగుతోందని ఆక్షేపించారు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా స్పందించలేదని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్‌ మిల్లు తీరును శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ‘ఆంధ్రా పేపర్‌ మిల్లు పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం కావస్తోంది. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకి కానీ, రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుం డా మీకు మీరే(పేపర్‌ మిల్లు) పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ.21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించాల్సి ఉంది.


రాజమండ్రి నగర కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్‌ మిల్లు నుంచే వస్తోందని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. రాజమండ్రి నగరంలో మొత్తం 70 మిలియన్‌ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే.. అందులో 35 మిలియన్‌ లీటర్లు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్లు నిర్ధారణైంది. మీరు వ్యర్థాలు విడుదల చేసే లగూన్స్‌ దగ్గర సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్‌ నీటికి 36 మిల్లీ గ్రాముల బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ ఉంది. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికం. ఫాస్పేట్‌ 5.3 మిల్లీగ్రాములు అంటే.. 6 శాతం అధికంగా ఉంది. సల్ఫైడ్స్‌ 3.4 మిల్లీ గ్రాములు ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోల్చితే ఇది 70 శాతం అధికం. దీంతో నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గి జలచరాల మనుగడకు ఇబ్బంది కలుగుతోంది. గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. దుర్గంధాలు వెదజల్లుతూ నీటి నాణ్యత తగ్గి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, భవిష్యత్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి పర్యటనలో నేను సూచనలు చేశాను. వాటిని కూడా మీరు పాటించలేదు’ అని దుయ్యబట్టారు.


లైసెన్సు రద్దు చేయవచ్చు.. అయినా

‘ఆంధ్రా పేపర్‌ మిల్లు ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చు. పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపుదల చేయవచ్చు. పెనాల్టీలు విధించవచ్చు. కంపెనీని సీజ్‌ చేయవచ్చు. ఏకంగా లైసెన్సును రద్దు చేయవచ్చు. అయినా పరిశ్రమ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చి తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. గడిచిన మూడు నెలల్లో పీసీబీ అధికారులు మీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి పరిష్కార మార్గాలు సూచించారు. అయితే మీ నుంచి స్పందన పూర్తిగా కొరవడింది. అందువల్ల పీసీబీ అధికారులు తక్షణమే ఆంధ్రా పేపర్‌ మిల్లుకు సమన్లు జారీ చేసి నిబంధనలకు మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను. ప్రభుత్వం తరఫున ఏజీ, అదనపు ఏజీతో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిళ్లు ఇలాంటి ఉల్లంఘన కేసుల విచారణను త్వరతగతిన పూర్తి చేసే లా, తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను. గోదావరిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పర్యావరణవేత్తలు, పౌర సమాజం నుంచి మద్దతు కోరుతున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

Updated Date - Sep 05 , 2026 | 04:24 AM