మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:50 PM
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబర్ 15: డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధి వెలుపల తొలిసారిగా జాతీయ సరస్ మేళాను నిర్వహిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తోందని తెలిపారు.
ఈ మేళా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 650కి పైగా స్వయం సహాయక సంఘాలు (SHGs) ఏపీకి తరలివచ్చాయని వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు వాటికి విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించుకునేందుకు ఈ మేళా వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు స్థానిక మార్కెట్లకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా.. అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్వయం ఏపీ’ (Swayam AP) కార్యక్రమం ద్వారా ఈ-కామర్స్, గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత ప్రచారం.. మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే వారు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం ఒక ఎంటర్ప్రైజ్ కేంద్రంగా, ప్రతి మహిళ సంపద సృష్టికర్తగా మారాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ, వికసిత్ భారత్ నిర్మాణానికి రాష్ట్రం తన వంతు సహకారం అందిస్తోందని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్లు.. జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
ఎల్నినో కోవిడ్ లాంటి సంక్షోభం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News And Telugu News