Share News

పెద్దిరెడ్డికి షాక్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:38 AM

వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దేవదాయ చట్టం కింద అధికారులు చేపట్టిన చర్యలను సవాల్‌ చేస్తూ,...

పెద్దిరెడ్డికి షాక్‌

  • బుగ్గమఠం భూముల వ్యవహారంలో చుక్కెదురు

  • హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

  • ట్రైబ్యునల్‌లోనే తేల్చుకోవాలని స్పష్టీకరణ

  • పెద్దఎత్తున దేవదాయ భూముల అన్యాక్రాంతం

  • రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు

న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బుగ్గమఠం భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దేవదాయ చట్టం కింద అధికారులు చేపట్టిన చర్యలను సవాల్‌ చేస్తూ, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పిటిషనర్‌ లేవనెత్తిన టైటిల్‌, న్యాయ పరిధికి సంబంధించిన అంశాలపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌నే ఆశ్రయించాలని తేల్చిచెప్పింది. తిరుపతి అర్బన్‌, ఎమ్‌.ఆర్‌.పల్లి పరిధిలోని సర్వే నంబర్లు 261/1, 261/2లోని భూమి శ్రీ బుగ్గమఠం దేవాదాయ ఆస్తిగా అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ అనుమతితో ఆ భూమిని పొందిన వారివద్ద నుంచి తాము రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని పెద్దిరెడ్డి వాదిస్తున్నారు. ఈ వివాదంలో 1987 నాటి దేవదాయ చట్టం సెక్షన్‌ 83(2) కింద తనకు ఎవిక్షన్‌ (తొలగింపు) నోటీసులు ఇవ్వడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు, ఆయనను ఆక్రమణదారుగా తేల్చారు.

ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ బెంచ్‌ తోసిపుచ్చి, ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించింది. తీర్పును డివిజన్‌ బెంచ్‌ సైతం సమర్థించింది. దీనిని గత నెల 18న పెద్దిరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌, జస్టిస్‌ అరుణ్‌ పల్లితో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పెద్దిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీధర్‌ పోతరాజు, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కుమార్‌ హాజరయ్యారు.


ఆక్రమణ చట్టాలు వర్తించవు...

పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ భూ వివాదానికి సంబంధించి దేవదాయ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం అధికారులకు లేదని తెలిపారు. తుమ్మల కృష్ణారావు అంశంపై గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, టైటిల్‌ వివాదాలు ఉన్నప్పుడు ఆక్రమణ చట్టాలు వర్తించవని, తమ వద్ద ఉన్న రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్లకూ, ఎవిక్షన్‌ నోటీసుల్లో పేర్కొన్న షెడ్యూల్‌ ప్రాపర్టీకీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్న 3.88 ఎకరాల దేవదాయ భూమితో తమకు సంబంధం లేదని, తమకున్న రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్ల ద్వారా 0.88 ఎకరాల భూమిపై స్పష్టమైన హక్కులు ఉన్నాయని, ఇది పూర్తిగా యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదమని తెలిపారు. ఇలాంటి టైటిల్‌ వివాదాలను సమ్మరీ ప్రొసీడింగ్స్‌ ద్వారా తేల్చే అధికార పరిధి దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు లేదని వాదనలు వినిపించారు. 2021 జూలై 23న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పత్రాలను అందజేయాలని ఆదేశించినా వారు ఇవ్వడం లేదని, 2009 నాటి అడంగల్స్‌ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.

దేవదాయ భూముల అన్యాక్రాంతం..

ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే అసిస్టెంట్‌ కమిషనర్‌ నివేదిక ఆధారంగా సెక్షన్‌ 83 కింద ఆక్రమణల నిరోధ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ‘‘పెద్దిరెడ్డి తన సొంత నివాసం కోసం ఓ బంగ్లాను నిర్మించుకోవడమే కాకుండా, దానికి ఆనుకుని ఉన్న మఠానికి సంబంధించిన భూమి సైతం తనదేనంటూ కంచె వేసి ఆక్రమించుకున్నారు. సెక్షన్‌ 234 ప్రకారం జారీ చేసిన నోటీసులో ఈ ఉల్లంఘనలను అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి చూపుతున్న సేల్‌ డీడ్లు, క్లెయిమ్‌ చేస్తున్న భూమి విస్తీర్ణం క్షేత్రస్థాయిలోని సర్వే నంబర్లతో సరిపోలడం లేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ, దేవదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు.


ట్రైబ్యునల్‌ ముందు లేవనెత్తండి: సుప్రీం

టైటిల్‌ వివాదాలు లేదా పరిధికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే వాటిని చట్టబద్దమైన అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ముందే లేవనెత్తాలని సుప్రీం తేల్చిచెప్పింది. ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు హైకోర్టు ముందే సమయం ఇచ్చినా ఎందుకు వెళ్లలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. పరిమితులకు లోబడి ముందుగా ట్రైబ్యునల్‌లోనే తేల్చుకోవాలని చెబుతూ,హైకోర్టు తీర్పునే సమర్థించింది. అయితే, ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ ద్వారా ఒకవేళ పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఏదైనా ఉత్తర్వు వెలువడితే, ఆ ఉత్తర్వు వెలువడిన తేదీ నుండి 15 రోజుల పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా, మళ్లీ హైకోర్టునే ఆశ్రయించవచ్చని తెలిపింది. హైకోర్టు గతంలో ఇచ్చిన గడువును పరిగణనలోకి తీసుకుంటూ, పిటిషనర్‌ తగిన అప్పీల్‌ను సకాలంలో లేదా నవంబరు రెండో తేదీలోపు ట్రైబ్యునల్‌లో దాఖలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. పెద్దిరెడ్డి పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 04:38 AM