వారిని రెగ్యులరైజ్ చేయాల్సిందే!
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:01 AM
ఆంధ్రప్రదేశ్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో ఏళ్ల తరబడి తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించనుంది.
ఏపీ ఫాస్ట్‌ట్రాక్, ప్రత్యేక కోర్టుల సిబ్బందికి సుప్రీంకోర్టులో భారీ ఊరట!
అనుభవజ్ఞుల తొలగింపు సరికాదన్న బెంచ్
న్యూఢిల్లీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో ఏళ్ల తరబడి తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించనుంది. వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు గానీ, సామర్థ్య లోపంపై ఆరోపణలు గానీ లేకపోతే అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఒకే జీవో కింద నియమితులై, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వెళ్లిన ఉద్యోగులందరూ ఇప్పటికే శాశ్వత ఉద్యోగులుగా మారారని.. అదే సూత్రం ఏపీ ఉద్యోగులకు కూడా వర్తించాలని వ్యాఖ్యానించింది. ఈ వివాదానికి ముగింపు పలుకుతూ తామే ముసాయిదా ఉత్తర్వును సిద్ధం చేస్తామని చెప్పింది. తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం చాలా ఉదారస్వభావం కలదని, ఈ పోస్టుల మంజూరుకు తప్పకుండా అంగీకరిస్తుందని ధర్మాసనం విశ్వాసం వ్యక్తం చేసింది.
ఏపీ జిల్లా కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో స్టెనోలు, టైపిస్టులుగా పనిచేస్తున్న రొక్కం వేణుగోపాల్‌సహా 113 మంది దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అరవింద్‌కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీల ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదని, కేవలం ఏపీ హైకోర్టు మాత్రమే అభ్యంతరం చెబుతోందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోర్టు దృష్టికి తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే నోటిఫికేషన్‌తో వీరందరి నియామకాలు జరిగాయని తెలిపారు. తెలంగాణ హైకోర్టు పరిధిలోని సిబ్బందిని క్రమబద్థీకరించాలని అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు.
దాంతో వారంతా రెగ్యులరైజ్ అయ్యారని తెలిపారు. సరైన నియామక ప్రక్రియ, రిజర్వేషన్ నిబంధనలు పాటించకుండా, రాత పరీక్ష లేకుండా నియమితులైన వారిని రెగ్యులరైజ్ చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని హైకోర్టు తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. వీరి సామర్థ్యం, అర్హతలను పరీక్షించడానికి స్క్రీనింగ్ కమిటీ లేదా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి ఆ తర్వాతే రెగ్యులరైజ్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.
డిక్టేషన్ టైప్ చేస్తే చాలు: ధర్మాసనం
హైకోర్టు వైఖరిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘వీరందరూ గత పదేళ్లుగా కోర్టుల్లో పనిచేస్తున్నారు. ఇన్నేళ్లుగా సేవలు అందిస్తుంటే వారి సామర్థ్యాన్ని ఎలా శంకిస్తారు?. జిల్లా జడ్జీలు, సీజేఎంల ఆధ్వర్యంలో స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారానే వీరి ఎంపిక జరిగింది. ఇప్పుడు కొత్తగా రాత పరీక్ష పెట్టి, జీకే ప్రశ్నలు అడుగుతారా? కోర్టులో జడ్జి చెప్పే డిక్టేషన్‌ను టైప్ చేయగలిగితే చాలు కదా’ అని ప్రశ్నించింది. అంతిమంగా ధర్మాసనం రాష్ట్రప్రభుత్వానికి స్పష్టమైన ప్రతిపాదనలు చేసింది.
‘ఈ ఉద్యోగుల్లో ఎవరిపైనైనా అభియోగాలు ఉంటే.. వారిని పక్కనపెట్టి, సీడీజే నియమించే కమిటీ ద్వారా స్వతంత్రంగా అంచనా వేయాలి. ఏ మచ్చా లేని ఉద్యోగులందరినీ భవిష్యత్ తేదీ నుంచి (ప్రాస్పెక్టివ్‌గా) క్రమబద్ధీకరించాలి. గత కాలానికి సంబంధించిన ఆర్థిక బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం తదుపరి సీనియారిటీ, పెన్షన్ ప్రయోజనాల కోసం మొదటి నియామక తేదీ నుంచి ‘నోషనల్ బెనిఫిట్’ వర్తింపజేయాలి’ అని ప్రతిపాదించింది. మొత్తం ఉద్యోగుల వివరాలతో కూడిన సమగ్ర చార్ట్‌ను సమర్పించాలని హైకోర్టు న్యాయవాదిని ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా