Share News

మత్స్య సాగరమాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్

ABN , Publish Date - May 01 , 2026 | 08:59 PM

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాంలో 'మత్స్య సాగరమాల' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార తీర ప్రాంత గ్రామాల్లోని కీలక సమస్యలపై దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

మత్స్య సాగరమాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్
Union Minister Rammohan Naidu

శ్రీకాకుళం: సోంపేట మండలం ఎర్రముక్కాంలో 'మత్స్య సాగరమాల' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార తీర ప్రాంత గ్రామాల్లోని కీలక సమస్యలపై దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కోల్ ఇండియా సంస్థ రూ.4 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ నిధులతో మత్స్యకార గ్రామాల్లో 1,600 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాత్రి వేళల్లో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి రావడంతో సోలార్ లైట్లు పెట్టినట్లు పేర్కొన్నారు.


మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో 100 మత్స్యకార గ్రామాలకు బీచ్ రోడ్లు వేయనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఆ గ్రామాల్లోని బీచ్ రహదారుల్లో మరో 1,400 సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికీ సీసీ రోడ్లు కూడా వేస్తామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. అర్హులైన మత్స్యకారులు అందరికీ మత్స్యకార భృతి అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో తీర ప్రాంతాల అభివృద్ధి ద్వారా పర్యాటకులను ఆకర్షించే చర్యలు చేపడతామని రామ్మోహన్ పేర్కొన్నారు. బారువా బీచ్‌ను బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.


త్వరలో మూలపేట పోర్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఈ పోర్టుకు అనుబంధంగా పెద్దఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఉపాధి కోసం జిల్లా నుంచి యువత వలసలు వెళ్లకూడదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రజా రాజధానిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంఏ షరీఫ్

అలర్ట్.. రేపు ఫోన్లలో బీప్ సౌండ్ వస్తే కంగారు పడకండి.. ఎందుకంటే?

Updated Date - May 01 , 2026 | 09:10 PM