అలర్ట్.. రేపు ఫోన్లలో బీప్ సౌండ్ వస్తే కంగారు పడకండి.. ఎందుకంటే?
ABN , Publish Date - May 01 , 2026 | 07:33 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు రేపు (శనివారం) ఒక ముఖ్యమైన సూచన. ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య మీ మొబైల్ ఫోన్లకు ఒక ప్రత్యేకమైన 'టెస్ట్ అలర్ట్' సందేశం రానుంది. వివరాల్లోకి వెళితే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు రేపు (శనివారం) ఒక ముఖ్యమైన సూచన. ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య మీ మొబైల్ ఫోన్లకు ఒక ప్రత్యేకమైన 'టెస్ట్ అలర్ట్' సందేశం రానుంది. ఈ సందేశం వచ్చే సమయంలో మీ ఫోన్ పెద్దగా బీప్ శబ్దం చేయడంతో పాటు వైబ్రేట్ అవుతుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమన్వయంతో, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఫోన్ స్క్రీన్‌పై వచ్చే సందేశాన్ని చదువుకోవాలని, అయితే దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ ప్రయోగాత్మక పరీక్షను నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, తుపాన్లు) లేదా ఇతర అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు, అతి తక్కువ సమయంలో లక్షలాది మందికి సమాచారాన్ని చేరవేయడం దీని ఉద్దేశం. ఈ వ్యవస్థ ద్వారా నెట్‌వర్క్ జాప్యం లేకుండా నేరుగా వినియోగదారుల మొబైల్ స్క్రీన్‌పైకి హెచ్చరికలను పంపవచ్చు. ఇది కేవలం ఒక సాంకేతిక పరీక్ష మాత్రమే అధికారులు తెలిపారు.
మొబైల్ నుంచి వచ్చే శబ్దాలు లేదా సందేశాలు చూసి భయపడ వద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ అలర్ట్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ అధునాతన హెచ్చరిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు. కాబట్టి శనివారం ఉదయం మీ ఫోన్ మోగితే అది మీ రక్షణ కోసం జరుగుతున్న పరీక్షగా భావించాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ