ప్రజా రాజధానిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంఏ షరీఫ్
ABN , Publish Date - May 01 , 2026 | 08:16 PM
రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యవేక్షణలో శరవేగంతో సాగుతున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు.
అమరావతి,మే1: రాజధాని అమరావతి నిర్మాణ పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యవేక్షణలో శరవేగంతో సాగుతున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఒక నిర్ణీత కాలపరిమితిలో రాజధానిని పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా.. వైఎస్ఆర్సీపీ నేతలు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తూ విద్వేషాన్ని రగిలిస్తున్నారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం 'మూడు రాజధానుల' పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని పేర్కొన్నారు.
రాజధాని అమరావతిపై ఇప్పటికీ ఒక పక్కా ప్రణాళిక కానీ.. సరైన అభిప్రాయం కానీ వైసీపీ నాయకులకు లేదని ఎంఏ షరీఫ్ అన్నారు. అలాంటి నేతలకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ వ్యయంపై రోజుకో అబద్ధం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని.. ఇది రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కేంద్రమని ఆయన అభివర్ణించారు.
రాజధాని అమరావతి ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే 'గ్రోత్ ఇంజన్' అని ఎంఏ షరీఫ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం వ్యయంపై ప్రతిపక్ష నేత అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. అమరావతి నిర్మాణంలో చదరపు అడుగుకి రూ.6,980 మాత్రమే ఖర్చు అవుతుంటే.. వైఎస్ జగన్ రూ.12,000 నుంచి రూ.14,000 ఖర్చు అవుతుందని తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాధనం రూ.700 కోట్లతో ఋషికొండపై తన సొంత నివాసం కోసం చదరపు అడుగుకి రూ.35,714 ఖర్చు చేసిన జగన్ రెడ్డికి, ప్రజా రాజధానిపై మాట్లాడే అర్హత లేదని ఎంఏ షరీఫ్ కుండబద్ధలు కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్ ఖర్చు (చ.అడుగుకి రూ.6,500) కంటే ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న వ్యయం సహేతుకమని ఆయన తెలిపారు. అమరావతి 175 నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్ర బిందువుగా, పంచాయతీలు, మున్సిపాలిటీల ప్రగతికి నాంది పలుకుతుందని ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ చెప్పారు.
రాజధాని కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల రిజర్వ్ విలువ లక్షల కోట్లలో ఉందని.. వాటి ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంక్ రుణాలతో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తోందని గుర్తు చేశారు. 2028 నాటికి ప్రభుత్వ భవనాలన్నీ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించారు. అమరావతిలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఎంఏ షరీఫ్ వెల్లడించారు.