Gunda Appala Surya Narayana: అధికారిక లాంఛనాలతో మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 09:24 PM
సూర్యనారాయణ మరణ వార్త విని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.
శ్రీకాకుళం, జనవరి 13: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో మంగళవారం నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్ధివదేహాన్ని శ్రీకాకుళం అరసవల్లి పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పుర వీధులన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. కొన్ని గంటల పాటు సాగిన ఆయన అంతిమ యాత్రకు ప్రజలు పోటెత్తారు. అప్పల సూర్యనారాయణ అమరహే అంటూ పార్టీ కేడర్‌తోపాటు ఆయన అభిమానుల నినాదాలతో శ్రీకాకుళం నగర పుర వీధులు హోరెత్తిపోయాయి.
అనంతరం స్థానిక శ్మశానవాటికకు ఆయన పార్టీవ దేహం చేరుకుంది. ఈ సందర్భంగా గుండ అప్పల సూర్యనారాయణకు అంతిమ నివాళిగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆయన చితికి కుమారుడు నిప్పు అంటించారు.

శ్రీకాకుళం అరసవల్లిలో ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లో గుండు అప్పల సూర్యనారాయణ కాలు జారి కింద పడిపోయారు. దాంతో ఆయన తలకు తీవ్ర గాయమయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6.40 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.

సూర్యనారాయణ మరణ వార్త విని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మంత్రిగా ఉన్న ఆయన సాధారణ జీవితం గడిపారని కొనియాడారు. సూర్యనారాయణ చేసిన చక్కని రాజకీయాలు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
వారి కుటుంబంపై తనకు ఎప్పటికీ అత్యున్నత గౌరవం ఉంటుందని చెప్పారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. సూర్యనారాయణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఈ అంత్యక్రియలకు టీడీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరు కావాలని ఆయన సూచించారు.

1948, జనవరి 16వ తేదీన గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళంలో జన్మించారు. 1981లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి కౌన్సిలర్‌గా రాజకీయ ప్రవేశం చేశారు. అనంతరం టీడీపీలో చేరి.. వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985 నుంచి 2004 వరకు వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1987లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి సైతం 2014 -19 మధ్య టీడీపీ ఎమ్మెల్యేగా పని చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నారావారి పల్లెలో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు..
నిధులు పొందిన రాష్ట్రాల్లో ఏపీ మూడోది: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News