Satyakumar: నిధులు పొందిన రాష్ట్రాల్లో ఏపీ మూడోది: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:33 PM
15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తి స్థాయిలో పొందిన రాష్ట్రాల్లో ఏపీ మూడోదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇది హర్షించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.
అమరావతి, జనవరి13: 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి రూ. 567 కోట్ల గ్రాంట్‌ను కేంద్రం విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇవి ఆఖరి విడత నిధులని ఆయన తెలిపారు. గత 19 నెలల్లో ఆరోగ్య రంగానికి 48 శాతం నిధులు తమ శాఖ వెచ్చించిందని వివరించారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఉన్నతాధికారులతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వ్యయంపై మంత్రి సత్యకుమార్ సమీక్షించారు.
అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. మిగిలిన నిధుల విడుదల కోసం కేంద్ర ఆర్థిక శాఖతో తక్షణమే చర్చించాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పూర్తి స్థాయిలో కేంద్ర సాయం సాధించాలని వారికి మంత్రి స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం పెరగడంపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వ కృషిని ఈ సందర్భంగా కేంద్రం గుర్తించిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తి స్థాయిలో పొందిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో రాష్ట్రంగా ఉందన్నారు. దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News