Nadendla Manohar: ఊహించని విధంగా ధాన్యం కొనుగోళ్లు... ఇది ఓ చరిత్ర: మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:54 PM
క్షేత్రస్థాయిలో రైతులకు ఒక భద్రత ఒక నమ్మకం కూటమి ప్రభుత్వం కలిగించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ధైర్యంగా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోగలం అనే నమ్మకాన్ని కల్పించామని తెలిపారు.
శ్రీకాకుళం, జనవరి 5: ఎవరూ ఊహించని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) అన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అన్నది ఓ చరిత్ర అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటిది ఏనాడూ జరగలేదని తెలిపారు. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఈ ఖరీఫ్‌లో 9 వేల 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోపే జమచేశామని చెప్పారు. ఇది ఎవరు ఊహించిన విధంగా చేశామని మంత్రి అన్నారు.
క్షేత్రస్థాయిలో రైతులకు ఒక భద్రత ఒక నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కలిగించిందన్నారు. రైతులు ధైర్యంగా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోగలం అనే నమ్మకాన్ని కూటమి ప్రభుత్వంలో కల్పించామని తెలిపారు. రైస్ మిల్లర్స్ ఎవరైనా పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా వారి పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఆరు నెలలలోపు రైతాంగానికి డబ్బులు వేశారా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు వదిలేసి వెళ్ళిపోయేవారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన బకాయిలు 16 వందల 74 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం వచ్చాక రైతాంగానికి బకాయిలు తీర్చిందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టిందని ఈరోజుకీ రైతులు చెబుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలని హితవుపలికారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతాంగం సంక్రాంతి, ఉగాది కూడా జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పండగలను రాష్ట్రంలో రైతులు సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. గతంలో 6 నెలలు, 9 నెలల వరకు రైతులకు పేమెంట్లు చేసేవారు కాదని.. రైతుల ప్రభుత్వం మాదని అబద్ధాలు చెప్పుకుంటూ పరిపాలించారని వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేతకాక వ్యవస్థను దుర్మార్గంగా వారి స్వలాభం కోసం ఉపయోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో దారుణం.. పోలీసు స్టేషన్ ఎదురుగానే కాపు కాచి..
ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News