Share News

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి పెరగాలి

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:28 AM

విధి నిర్వహణలో సవాళ్లను అధిగమించేందుకు పోలీసు సిబ్బందికి ఫిట్‌నెస్‌ ఎంతో కీలకమని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా అన్నారు. మంగళగిరిలో నాలుగు రోజులపాటు జరిగిన ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ శుక్రవారంతో ముగిసింది.

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి పెరగాలి

  • సవాళ్లను అధిగమించేందుకు ఫిట్‌నెస్‌ కీలకం

  • పోలీసు సిబ్బందికి శారీరక, మానసిక దృఢత్వం ముఖ్యం

  • క్రీడలను ఉద్యోగ జీవితంలో భాగం చేసుకోవాలి

  • ర్యాంకులు వేరైనా మనమంతా పోలీస్‌ టీమ్‌

  • ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు: డీజీపీ గుప్తా

మంగళగిరి సిటీ, అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో సవాళ్లను అధిగమించేందుకు పోలీసు సిబ్బందికి ఫిట్‌నెస్‌ ఎంతో కీలకమని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా అన్నారు. మంగళగిరిలో నాలుగు రోజులపాటు జరిగిన ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ శుక్రవారంతో ముగిసింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ పటాలంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 15 రేంజ్‌ల నుంచి దాదాపు 1900 మంది పోలీసు క్రీడాకారులు నాలుగు రోజులపాటు జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో విశాఖ రేంజ్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘భవిష్యత్తులో ఎదురయ్యే కొత్త తరహా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులు శారీరక, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. క్రీడలను ఉద్యోగ జీవితంలో భాగం చేసుకోవాలి. రాష్ట్ర పోలీసు క్రీడాకారులు ఈ మీట్‌తోనే ఆగిపోకుండా ఆలిండియా పోలీస్‌ గేమ్స్‌లో పతకాలు సాధించి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలి. ఈ మారు పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో మహిళా సిబ్బంది పాల్గొనడం కొత్త అధ్యాయానికి నాంది. పోలీసు శాఖలో హోదాలు, పోస్టింగ్‌లు వేరైనా.. అందరూ ఒకే జట్టులోని సభ్యులే. సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి’ అని పేర్కొన్నారు.


ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు

రాష్ట్ర పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు. దీని కోసం వీఐటీ-ఏపీతో పోలీసు శాఖ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ లోగోను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐజీలు కేవీ మోహనరావు (స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌), ఆకే రవికృష్ణ (ఈగల్‌), బి.రాజకుమారి (ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ), సీహెచ్‌ శ్రీకాంత్‌ (టెక్నికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఆపరేషన్స్‌), సెంథిల్‌ కుమార్‌, ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, డీఐజీలు అన్బురాజన్‌, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పాల్గొన్నారు.

ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణకు 8 పతకాలు

ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌లో ఈగల్‌ చీఫ్‌ ఆకే రవికృష్ణ అద్భుతంగా రాణించి మొత్తం 8 పతకాలను సొంతం చేసుకున్నారు. టేబుల్‌ టెన్నిస్‌ 40+ సింగిల్స్‌లో రజతం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం, 50+ సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌ పురుషుల విభాగంలో కాంస్యం, ఎయిర్‌ పిస్టల్‌ పది మీటర్ల విభాగంలో రజతం, షటిల్‌ బ్యాడ్మింటన్‌ 50+ డబుల్స్‌ పురుషుల విభాగంలో స్వర్ణం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం, స్విమ్మింగ్‌ 25 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఈగల్‌ సిబ్బంది 40 పతకాలను గెలుచుకున్నారని రవికృష్ణ తెలిపారు.

సీఎం సీఎస్‌ఓకు పతకాలు

ఏపీ పోలీస్‌ ఆటల పోటీల్లో సీఎం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కే మధుసూదన్‌ రావు పలు పతకాలు సాధించారు. టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో గోల్డ్‌ మెడల్‌, డబుల్స్‌లో గోల్డ్‌ మెడల్‌, టీమ్‌ ఈవెంట్‌లో సిల్వర్‌, సెట్స్‌ డబుల్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. ఆటల్లో పతకాలు సాధించిన సీఎస్‌ఓ మధుసూదన్‌రావును సీఎం చంద్రబాబు అభినందించారు.


ఈ వార్తలను కూడా చదవండి

నత్తనడకన ‘వంజంగి హిల్స్‌’ రోడ్డు

ప్రయోగాల మాస్టర్‌కు పురస్కారం

Updated Date - Sep 05 , 2026 | 06:28 AM