నత్తనడకన ‘వంజంగి హిల్స్’ రోడ్డు
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:54 PM
ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం అభివృద్ధికి రూ.2.5 కోట్లు మంజూరై రెండేళ్లు దాటినా నేటికీ రోడ్డు నిర్మాణం పూర్తికాలేదు.
రూ.2.5 కోట్లు మంజూరై రెండేళ్లయినా ఇప్పటికీ పూర్తికాని రోడ్డు నిర్మాణం
పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం
మరో నెలలో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్‌కు వెళ్లే మార్గం అభివృద్ధికి రూ.2.5 కోట్లు మంజూరై రెండేళ్లు దాటినా నేటికీ రోడ్డు నిర్మాణం పూర్తికాలేదు. మరో నెలలో పర్యాటక సీజన్ ప్రారంభకానున్న నేపథ్యంలో రోడ్డంతా అసంపూర్తిగా ఉండడంతో పర్యాటకులు, స్థానికులకు అవస్థలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి వంజంగి హిల్స్ వెళ్లే రోడ్డు నిర్మాణంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే రెండేళ్లయినా నిర్మాణం పూర్తికాలేదని తెలుస్తున్నది. పాడేరు నుంచి వంజంగి హిల్స్‌కు చేరుకునేందుకు ఆరు కిలోమీటర్ల వరకు అంటే వంజంగి హిల్స్ కూడలి వరకు అధ్వానమైన తారురోడ్డు ఉంది. కాని అక్కడి నుంచి ప్రధాన కొండ వైపు వెళ్లేందుకు ఉన్న రెండు కిలోమీటర్లు ఘాట్‌మార్గంలో పక్కా రోడ్దు సదుపాయం లేదు. జంక్షన్ వరకు వచ్చే పర్యాటకులకు ఆ ఘాట్ మార్గం నుంచి సన్‌రైజ్ పాయింట్‌కు వెళ్లే కొండ ప్రదేశం ముందు వరకు మట్టి రోడ్డు ఉంది. అయితే ఆ మార్గం సక్రమంగా లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర అవస్థలు పడడంతోపాటు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యను అధిమించాలనే లక్ష్యంతో గత జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ వంజంగి హిల్ రోడ్డు నిర్మాణానికి 2024 జూలైలో నిధులు మంజూరు చేశారు.
రెండేళ్లుగా కొనసా..గుతున్న రోడ్డు నిర్మాణం
వంజంగి హిల్స్ కూడలి నుంచి ప్రధాన కొండ ప్రవేశ మార్గానికి చేరుకునేందుకు రెండు కిలోమీటర్ల ఘాట్ మార్గాన్ని పక్కా రోడ్డుగా అభివృద్ధికి చేసేందుకు 2024 జూలై నెలలోనే రూ.2.5 కోట్లు మంజూరయ్యాయి. దీంతో రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తి కాలేదు. రోడ్డును వెడల్పు చేయడం, అవసరమైన చోట్ల మట్టి పూడ్చివేత, పలు చోట్ల కల్వర్టుల నిర్మాణం, చదును పనులు చేపట్టారు. సుమారుగా 70 శాతం పనులు చేసినప్పటికీ మిగిలిన పనులు నేటికీ పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వేసిన మట్టిరోడ్డు కోతకు గురై వాహనాల రాకపోకలకు మరింతగా ఇబ్బందికరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ మొదలు కానుంది. వాస్తవానికి ఇప్పటికే ఈరోడ్డు నిర్మాణం పూర్తయితే సీజన్‌లో వచ్చే పర్యాటకుల రాకపోకలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కాని ఈ రోడ్డు నిర్మాణంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్లే నేటికీ పనులు పూర్తికాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంజంగి హిల్స్ రోడ్డును పూర్తి చేయాలని పర్యాటకులు, స్థానికులు వేడుకుంటున్నారు.