Share News

ప్రయోగాల మాస్టర్‌కు పురస్కారం

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:53 PM

పాఠ్యపుస్తకాల్లోని విషయాలను బోధించడమే కాదు విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తూ, వారిలో శాస్త్రీయ ఆలోచన పెంపొందిస్తున్నారు ఉపాధ్యాయుడు చెండా బాలకృష్ణ.

ప్రయోగాల మాస్టర్‌కు పురస్కారం
చెండా బాలకృష్ణ (ఫైల్‌ఫొటో)

సీతగుంట బయాలజీ టీచర్‌ చెండా బాలకృష్ణకు రాష్ట్ర స్థాయి అవార్డు

పెదబయలు, సెప్టెంబరు 4 (ఆంఽధ్రజ్యోతి):

పాఠ్యపుస్తకాల్లోని విషయాలను బోధించడమే కాదు విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తూ, వారిలో శాస్త్రీయ ఆలోచన పెంపొందిస్తున్నారు ఉపాధ్యాయుడు చెండా బాలకృష్ణ. ఆయన వినూత్న బోధన విధానాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ప్రస్తుతం ఈయన మండలంలోని సీతగుంట జీటీడబ్ల్యూఏ బాలుర పాఠశాల-1లో బయాలజీ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. మండలంలోని బొండాపల్లి పంచాయతీ తామరవీధి గ్రామానికి చెందిన బాలకృష్ణ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఈయన 2012లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికై హెచ్‌డబ్ల్యూవో కొన్నాళ్లు విధులు నిర్వర్తించారు. అయితే తనకు ఇష్టమైన బోధన రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని రాజీనామా చేశారు. తర్వాత 2014లో స్కూల్‌ అసిస్టెంట్‌ బయాలజీగా ఎంపికై రూఢకోట జీటీడబ్ల్యూఏ బాలుర పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం సీతగుంటలో సేవలందిస్తున్నారు.

పాఠాలు కాదు ప్రయోగాలు

విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా హ్యాండ్స్‌ ఆన్‌ యాక్టివిటీస్‌ ద్వారా ప్రయోగాత్మకంగా బోధించడం బాలకృష్ణ ప్రత్యేకత. విద్యార్థులు స్వయంగా చేసి నేర్చుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తూ వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నారు. బాలకృష్ణ మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఎన్‌సీఎస్సీలో రాష్ట్ర స్థాయి చాంపియన్లుగా నిలిచారు. రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో విద్యార్థులు రెండుసార్లు విజయం సాధించారు. రాష్ట్ర స్థాయి స్కూల్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రథమ బహుమతి సాధించారు.

వరుసగా అవార్డులు...

బాలకృష్ణ ప్రతిభకు గతంలోనూ పలు గుర్తింపులు లభించాయి. 2022లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2024లో విజ్ఞాన శాస్త్ర విస్తరణకు అబ్దుల్‌ కలాం విజ్ఞాన గురు పురస్కారం అందుకున్నారు. తాజాగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కడం ఆయన బోధనా ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచింది.

తన విద్యార్థులే తన కల...

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు చెండా బాలకృష్ణ

నా విద్యార్థులు భవిష్యత్తులో గ్రూప్‌-1,2 వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి దేశానికి సేవా చేయాలి. వివిధ రంగాల్లో సైంటిస్టులు అవ్వాలి. తాను పనిచేస్తున్న పాఠశాలకు అధికారులుగా, ఉన్నతాధికారులుగా తనిఖీలకు వచ్చి తన బోధనను పరిశీలించే స్థాయికి ఎదగాలి. అదే తన అంతిమ ఆశయం

Updated Date - Sep 04 , 2026 | 11:53 PM