వరాల జల్లు
ABN , Publish Date - May 02 , 2026 | 01:11 AM
నవ్యాంధ్ర నిర్మాత, సీఎం చంద్రబాబు రాకతో వీరంకిలాకు పులకరించింది. ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన అధినేతకు ప్రణమిల్లింది. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి మమేకం అయ్యారు. వారి కష్టాలు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కష్టసుఖాలు తెలుసుకున్నారు. జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపించారు. బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. జల్‌జీవన్ మిషన్ అమలు, ఇండసీ్ట్రయల్ హబ్ ఏర్పాటు, కరకట్ట బలోపేతంపై మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు.
- జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు భరోసా
- బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు వేగవంతం
- జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు
- పామర్రులో ఇండస్ర్టీయల్ హబ్ ఏర్పాటుకు హామీ
- కృష్ణానదిపై రెండు బ్యారేజీల నిర్మాణం, కరకట్ట బలోపేతం దృష్టి
- వీరంకి గ్రామం ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
- భవన నిర్మాణ కార్మికులతో మమేకం
- పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం
- గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన సీఎం
నవ్యాంధ్ర నిర్మాత, సీఎం చంద్రబాబు రాకతో వీరంకిలాకు పులకరించింది. ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన అధినేతకు ప్రణమిల్లింది. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి మమేకం అయ్యారు. వారి కష్టాలు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కష్టసుఖాలు తెలుసుకున్నారు. జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపించారు. బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. జల్‌జీవన్ మిషన్ అమలు, ఇండసీ్ట్రయల్ హబ్ ఏర్పాటు, కరకట్ట బలోపేతంపై మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు.
మచిలీపట్నం/పమిడిముక్కల(ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం వీరంకిలాకులో శుక్రవారం నిర్వహించిన పలు కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఎన్టీఆర్‌కాలనీలో ముగ్గురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా తలసేమియాతో బాధపడుతున్న 13 ఏళ్ల చాగంటిపాటి వివేక్‌ను పరామర్శించారు. వివేక్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. రూ.10 వేల పింఛను వివేక్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అందజేశారు. మే డే వేడుకలను పురస్కరించుకుని పలువురు కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల యజమానులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. గుడ్లవల్లేరులో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. జిల్లాలో వివిధ శాఖల పనితీరును ఐవీఆర్ సర్వేలో వచ్చిన నివేదికలను వివరించి పనితీరు సక్రమంగా ఉన్న శాఖల అధికారులను అభినందించారు. పనితీరులో వెనుకబడిన వివిద శాఖల అధికారులు ఇకనుంచి మెరుగ్గా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీరంకిలాకు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కశాలలల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ల వద్ద సీఎం చంద్రబాబుకు మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశౌరి, శాసన సభ్యులు, కలెక్టర్ బాలాజీ, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గుడ్లవల్లేరులో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడు వల్లభనేని బాబూరావు ఇంటికి వెళ్లి సీఎం పరామర్శించారు.
అందరినీ కలుపుకుని పోవాలి
కపిలేశ్వరపురంలో టీడీపీ పామర్రు నియోజకవర్గ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రతిక ార్యకర్త కష్టపడి పనిచేయాలని, పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చి పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేయని వారిని ఖచ్చితంగా పక్కన పెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ సామాజిక వర్గాలకు అధికంగా అందుతున్నాయి, ఏయే సామాజిక వర్గాలకు అందడం లేదు తదితర అంశాలను పూర్తిస్థాయిలో కార్యకర్తలు, నాయకులు పరిశీలించాలని చెప్పారు. ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలన్నారు. ఏ సామాజిక వర్గం పార్టీకి దూరంగా ఉంటోందనే అంశాన్ని గ్రహించి, వారితో మాట్లాడి పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ అందరితో సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లాపై పట్టు పెంచుకోవాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఏం జరుగుతోంది, ఆయా సామాజిక వర్గాలను ఎలా పార్టీ వైపునకు ఆకర్షించేలా చేయాలనే అంశాలపై పట్టు పెంచుకోవాలని వీరంకి గురుమూర్తికి సీఎం చందబ్రాబు ఆదేశించారు. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు. ఆయా సామాజికవర్గాల వారీగా ఉన్న ఓటర్లు, వారిలో ఎంతమంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారు.. ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అనే అంశంపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని సూచించారు. 2029లో జరిగే ఎన్నికల్లో పార్టీ గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యే కుమార్‌రాజా పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత మెజారిటీతో గెలుపొందేందుకు ప్రజలకు, కార్యకర్తలకు మరింత చేరువ కావాలని సీఎం సూచించారు. సోలార్ విద్యుత పథకం ఉపయోగాలను వివరించిన సీఎం.. పామర్రు నియోజకవర్గంలో ఎన్ని సోలార్ కనెక్షన్లు మంజూరయ్యాయి, ఎన్ని ఇచ్చారనే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
వీరంకిలాకు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణాజిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా జిల్ల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని అందిస్తామన్నారు. మచిలీపట్నం పోర్టు, గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, కృష్ణానది కరకట్టను మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కృష్ణానది నుంచి నీరు సముద్రంలో కలిసి పోకుండా సాగునీటి అవసరాలకు నీటిని వాడుకునేలా తోట్లవల్లూరు, మోపిదేవి మండలాల్లో కృష్ణానదిపై రెండు బ్యారేజీలను నిర్మాణం చేసే అంశంపైనా దృష్టి సారిస్తానని, దీంతో పాటు పామర్రులో ఇండస్ర్టీయల్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.
హైదరాబాద్ - మచిలీపట్నం అనుసంధానం
విశాఖ తర్వాత అభివృద్ధి, ఆదాయంలో కృష్ణాజిల్లా ముందుందని చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం భారత మాల ప్రయోజన-1లో భాగంగా రూ.574 కోట్లతో రోడ్ల విస్తరణ చేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా మచిలీపట్నం బైపాస్ రోడ్డును విజయవాడ నుంచి రెండు లేన్ల నుంచి ఆరు లేన్లు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నుంచి బందరుకు ఎక్స్‌ప్రెస్ రహదారి వచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా జిల్లాకు త్వరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకువస్తామని వివరించారు. చిత్తూరు జిల్లాతో సమాంతరంగా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. 2028లో నిర్వహించబోయే కృష్ణా పుష్కరాల నాటికి శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి దాన్ని కృష్ణా నదికి అనుసంధానం చేస్తామన్నారు.
కార్మికులను అన్ని విధాల ఆదుకుంటాం: మంత్రి వాసంశెట్టి
కార్మికులను అన్ని విధాల ఆదుకుంటామని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి మే డే వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాలను ప్రారంభించి, ప్రతి కార్మికుడికి పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలో డ్రెయిన్‌ల వ్యవస్థ బాగోలేదని, వర్షాకాలంలో గృహాల మధ్యనే మురుగు నిల్వ ఉండిపోతోందని, డ్రెయిన్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉందని, నియోజకవర్గంలో పది ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎంకు ఎంపీ బాలశౌరి వినతులు
మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌కు అనుబంధంగా పామర్రులో శాటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఒప్పించి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై కచ్చితంగా కేంద్రంతో మాట్లాడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు ఎంపీని వెంట తీసుకెళ్తానన్నారు. ప్రతి ఏడాది వరదలకు కృష్ణానది నుంచి వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఈ నీటిని ఒడిసిపట్టడానికి పెనమలూరు మండలం చోడవరం, మోపిదేవి మండలంలో మినీ బ్యారేజ్‌లు నిర్మించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆర్థిక పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. జిల్లాకు చెంతనే కృష్ణా నది ప్రవహిస్తున్నా నీటి ఎద్దడి తీవ్రంగా వేధిస్తోందని, ఈ జిల్లాలో జల్‌జీవన్ పథకాన్ని అమలు చేయాలన్న ఎంపీ వినతిపై స్పందించిన చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. డొంక రహదారుల నిర్మాణానికి ప్రత్యేక నిధిని సమకూర్చుతామన్నారు. బాలశౌరి మాట్లాడుతూ గతంలో జిల్లాలో 18 వేల ఎకరాలకుపైగా షరతులతో పట్టాలు ఇచ్చారని తెలిపారు. వీటిపై ఉన్న నిషేధం ఎత్తివేయడంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవ చూపారని, ఫలితంగా జిల్లాలో వేలాది మంది రైతులకు మేలు జరిగిందన్నారు. కృష్ణా కరకట్ట 15 లక్షల క్యూసెక్కుల వరద సామర్థ్యం తట్టుకునేలా నిర్మాణం చేశారని, ఈ కరకట్టను మరింత బలోపేతం చేయాలని కోరారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కలెక్టర్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.