Share News

క్షేమంగా స్వగృహాలకు

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:58 AM

నడి సముద్రంలో 25 రోజులపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తమ ఇళ్లకు చేరుకున్నారు

క్షేమంగా స్వగృహాలకు

  • ఇళ్లకు చేరిన ఏడుగురు జాలర్లు

  • కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందం

  • ఈనెల 3న గల్లంతైన మత్స్యకారులు

  • సంద్రంలో మొరాయించిన బోటు ఇంజన్‌

  • లంగరు వేసుకుంటూ బెంగాల్‌ తీరానికి

  • 25 రోజులు నరకం.. ప్రభుత్వం సాయంతో సురక్షితంగా కాకినాడకు..

అల్లవరం/సర్పవరంజంక్షన్‌, ఆగస్టు 28(ఆంద్రజ్యోతి): నడి సముద్రంలో 25 రోజులపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. తమ వాళ్లను చూసి వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఈ నెల 3న సముద్రంలో చేపల వేటకు వెళ్లి కనిపించకుండాపోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్‌లోని దిగా పోర్టు నుంచి 25 రోజుల తర్వాత రాష్ట్రానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఓడలరేవు చేరుకున్న మత్స్యకారులకు అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌, మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కొల్లు పెద్దిరాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మత్స్యకారులు క్షేమంగా రాష్ట్రానికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. మత్స్యకారులను ఆదుకున్న వెస్ట్‌ బెంగాల్‌ జాలర్లను, స్వగ్రామాలకు చేరిన మత్స్యకారులను ఎంపీ సన్మానించారు.

అనంతరం.. మత్స్యకారులు కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వారికి స్వాగతం పలికారు. రమణయ్యపేటలోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అల్పాహారం అందించారు. బెంగాల్‌లోని శంకర్‌పూర్‌ జెట్టీ వద్ద ఆశ్రయం కల్పించి, ఆహారం అందించిన పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు మత్స్యకారులను సత్కరించారు. కాగా, వేటకు వెళ్లిన తమ వారి జాడ తెలియకపోవడంతో గత మూడు వారాలుగా కంటిపై కునుకులేకుండా అల్లాడిన మత్స్యకారుల కుటుంబాలు.. తమ వారు తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేశాయి. సురక్షితంగా ఇంటికి చేరిన వారికి మిఠాయిలు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తమకు అన్ని విధాలా సాయం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.


ప్రాణాలతో వస్తామనుకోలేదు!

గత 25 రోజుల్లో తాము ఎదుర్కొన్న సమస్యలను బోటు యజమాని కొపనాతి రామకృష్ణవర్మ వివరించారు. ‘‘మొత్తం ఏడుగురం కలిసి ఈ నెల 3న ఓడలరేవు నుంచి వేటకు వెళ్లాం. అయితే, ఆకస్మికంగా మా బోటు ఇంజన్‌ పాడైంది. పెద్ద పెద్ద చేపలు మా బోటును వెంటాడాయి. చాలా భయపడ్డాం. రాకాసి అలలు ఎగసిపడ్డాయి. ప్రాణాలతో తిరిగి ఇంటికి వస్తామనే నమ్మకం పోయింది. మాకు ఏం చేయాలో అర్థంకాలేదు. సముద్రం మధ్యలో రోజుల తరబడి ఇబ్బందులు పడ్డాం. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. ఏడుగురం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. లంగరు వేసుకుని ముందుకు వెళ్లడం తప్ప వేరే దారిలేదని గుర్తించాం. ఒక్కొక్కరుగా లంగరు వేసుకుంటూ వెస్ట్‌ బెంగాల్‌ జలాల్లోకి వెళ్లిపోయాం. వేరే బోటు మత్స్యకారులు మమ్మల్ని రక్షించారు. 25 రోజుల పాటు మా జాడ ఎవరికీ తెలియదు. మా కుటుంబసభ్యులను కలుసుకుంటామని అనుకోలేదు. గంగమ్మ తల్లి దయతో బతికాం. ఇలా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది.’’ అని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం.

ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Updated Date - Aug 29 , 2026 | 04:58 AM