సెప్టెంబరులోనూ సమ్మర్ షాక్!
ABN , Publish Date - Sep 07 , 2026 | 04:11 AM
వర్షాలు కురిసి చల్లగా ఉండాల్సిన సెప్టెంబరు నెలలో కూడా పగటి పూట వాతావరణం వేసవిని తలపిస్తోంది. సాధారణంగా ఈ నెలలో ఎడతెరపిలేని వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎండలు వేసవి తీవ్రతను తలపిస్తున్నాయి.
సుదీర్ఘంగా కొనసాగుతున్న వేసవి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
మేఘావృతమైనా చినుకు రాలని వైనం
ఎల్‌నినో తీవ్రతే కారణమంటున్న నిపుణులు
రాష్ట్రంలో 653 మండలాల్లో లోటు వర్షపాతం
22 జిల్లాల్లో తీవ్ర లోటు.. 6 జిల్లాల్లో అతి తీవ్రం
వచ్చే వేసవి తర్వాత వరకు చినుకు కష్టమే
గత కొన్నేళ్లలో సెప్టెంబరులో సాధారణంగా 33 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదు కాలేదు. కానీ, ఇప్పుడు 39 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోతోంది. ఈ తరహా వాతావరణానికి తీవ్రమైన ఎల్‌నినో పరిస్థితే కారణం. తుఫాన్లు వచ్చినా.. అల్పపీడనాలు ఏర్పడినా రాష్ట్రంపై ప్రభావం చూపలేదు. ఇది కూడా ఎల్‌నినో ప్రభావమే. - వాతావరణ నిపుణులు
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): వర్షాలు కురిసి చల్లగా ఉండాల్సిన సెప్టెంబరు నెలలో కూడా పగటి పూట వాతావరణం వేసవిని తలపిస్తోంది. సాధారణంగా ఈ నెలలో ఎడతెరపిలేని వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎండలు వేసవి తీవ్రతను తలపిస్తున్నాయి. శని, ఆదివారాల్లో భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ప్రకాశం జిల్లా పొన్నలూరులో 39.6, చీమకుర్తిలో 39.1, నెల్లూరు జిల్లా కావలిలో 38.8, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, ప్రకాశం జిల్లా బల్లికురవలో 38, బాపట్ల జిల్లా చీరాలలో 37.9, భట్టిప్రోలులో 37.7, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో 37.2, విజయనగరం జిల్లా వంగరలో 37.1 మెంటాడలో 37డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లోనూ మధ్యాహ్నం సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 473 ప్రాంతాల్లో 30 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ మండిపోయింది. సాయంత్రం వరకు వేడి వాతావరణం కొనసాగింది. దీనికితోడు ఉక్కపోత నెలకుంది. సోమ, మంగళవారాల్లోనూ ఇదే తరహా ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని వాతావారణశాఖ తెలిపింది. ఎండ తీవ్రత కొనసాగడానికి ఎల్‌నినో పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా కొనసాగుతోందని, సెప్టెంబరు మొదటి వారంలోనూ ఎండ తీవ్రత ఉందని తెలిపారు. ఈ ఏడాది వేసవిలో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.3 డిగ్రీలు నమోదైంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌లో నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.4, జూలైలో కావలిలో 42.6, ఆగస్టులో అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అతిభారీ లోటు
ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబరు 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 20.39 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దీనిని బట్టి రాష్ట్రవ్యాప్తంగా 55.1 శాతం లోటు నెలకొంది. అలాగే, 22 జిల్లాల్లో తీవ్ర వర్షపాతం లోటు ఉండగా, ఆరు జిల్లాల్లో అతి తీవ్రంగా ఉంది. అన్నమయ్య 77.5 శాతం, ప్రకాశం 71.4 శాతం, చిత్తూరు 64.2 శాతం, మార్కాపురం 61.6 శాతం, శ్రీసత్యసాయి 60.9 శాతం, విశాఖ 60.4 శాతం మేరకు లోటు వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో 43-56 శాతం వర్షపాతం లోటు కొనసాగుతోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 688 మండలాలకు 407 మండలాల్లో తీవ్ర లోటు, 246 మండలాల్లో అతి తీవ్రలోటు(మొత్తం 653 మండలాల్లో వర్షపాత లోటు) నెలకొంది. కేవలం రెండు మండలాల్లో అధిక వర్షం కురవగా, 33 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో 23 మండలాల చొప్పున అతితీవ్ర వర్షపాత లోటులో ఉన్నాయి. నెల్లూరు 26, కడప 25, విజయనగరం 24, కృష్ణాజిల్లాలోని 22 మండలాలు తీవ్రలోటులో కొనసాగుతున్నాయి. కేవలం తిరుపతి జిల్లాల్లోని 2 మండలాల్లోనే సాధారణం కన్నా అధిక వర్షం కురిసింది.
గత మూడు దశాబ్దాల్లో..
వివిధ జిల్లాల్లోని మొత్తం మండలాల్లో గరిష్ఠంగా కడప 40, నెల్లూరు, శ్రీసత్యసాయి 31, నంద్యాల 30, విజయనగరం, ప్రకాశం, చిత్తూరు 28, అనంతపురం, తిరుపతి 27, ఏలూరు, శ్రీకాకుళం, పల్నాడు, కర్నూలు 26, అనకాపల్లి 24, కృష్ణా, అన్నమయ్య 25 చొప్పున వర్షపాతం లోటు కొనసాగుతోంది. గత మూడు దశాబ్దాల్లో 1997, 2002, 2009, 2015, 2023 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావం చూపింది. కానీ, ఈ ఏడాది వచ్చినంత తీవ్రంగా గతంలో లేదని నిపుణులు చెబుతున్నారు. అతి తీవ్ర వర్షాభావం, దుర్భిక్ష పరిస్థితులు గతంలో లేవని తెలిపారు. ముఖ్యంగా ఏపీపై ఎల్‌నినో ప్రభావం అతితీవ్రంగా ఉందని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపకపోగా, జూన్ నుంచి ఇప్పటి వరకు బంగాళాఖాతంలో ఏడెనిమిది అల్పపీడనాలు, ఓ సారి తీవ్ర వాయుగుండం ఏర్పడినా ఓ మోస్తరు వర్షాలే పడ్డాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆకాశం మేఘావృతమైనా.. చినుకు రాలట్లేదు. ఆకాశం నిర్మలంగా ఉన్నా.. ఊహించని రీతిలో కొద్ది ప్రదేశంలో ఆకస్మికంగా వాన జల్లులు పడుతున్నాయి. కానీ ఎక్కడా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి లేదు.
ఈ వార్తలను కూడా చదవండి
ధారకొండ ఘాట్ రోడ్డులో ప్రమాదం
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్