ధారకొండ ఘాట్ రోడ్డులో ప్రమాదం
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:29 PM
జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో ఆదివారం ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి లోయలో పడడంతో బాలుడు మృతి చెందగా, ఆ బాలుడి తల్లికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది.
బైక్ అదుపు తప్పి లోయలో పడి బాలుడి మృతి
ఒకరికి తీవ్రంగా, మరొకరికి స్వల్పంగా గాయాలు
సీలేరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో ఆదివారం ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి లోయలో పడడంతో బాలుడు మృతి చెందగా, ఆ బాలుడి తల్లికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సీలేరు ఎస్‌ఐ యాసిన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జీకేవీధి మండలం జెర్రిల పంచాయతీ రాళ్లగెడ్డ గ్రామానికి చెందిన రాజారావు దంపతులు కుమారుడితో కలిసి ఆదివారం ధారాలమ్మ ఘాట్‌రోడ్డులోని ధారాలమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఈ క్రమంలో రెయిన్‌గేజ్ వద్ద ఘాటీ దిగుతుండగా బైక్ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో కుమారుడు శివ(10) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజారావుకు స్వల్ప గాయాలు కాగా, అతని భార్య సన్యాసమ్మకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. ధారకొండ ప్రభుత్వాస్పత్రికి, సీలేరు ఎస్‌ఐకి రాజారావు సమాచారం అందించడంతో వెంటనే వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి అంబులెన్సు పంపించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.