Share News

వదలని శానిటైజర్ మత్తు

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:52 AM

కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దొరక్క.. మత్తు కోసం ‘శానిటైజర్‌’ రుచి మరిగిన మందుబాబులు ఇప్పటికీ దానిని వదలడం లేదు! లిక్కర్‌ బ్రాండ్‌ల కంటే తక్కువ ధరకే వస్తుండడంతో దీన్ని తెగ తాగేస్తున్నారు!! దీంతో మెడికల్‌ షాపుల్లోని శానిటైజర్‌ బాటిళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

వదలని శానిటైజర్ మత్తు

  • తెగ తాగేస్తున్న మందుబాబులు

  • విజయవాడలోని మూడు దుకాణాల్లో గత

  • మూడేళ్లలో 75 వేల బాటిళ్ల విక్రయం

  • లిక్కర్‌ బ్రాండ్‌ల కంటే తక్కువ ధర

  • శానిటైజర్‌లో 70 శాతం ఇథైల్‌ ఆల్కాహాల్‌

  • ఈ మత్తుకు బానిసైన చాలా మంది

విజయవాడ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దొరక్క.. మత్తు కోసం ‘శానిటైజర్‌’ రుచి మరిగిన మందుబాబులు ఇప్పటికీ దానిని వదలడం లేదు! లిక్కర్‌ బ్రాండ్‌ల కంటే తక్కువ ధరకే వస్తుండడంతో దీన్ని తెగ తాగేస్తున్నారు!! దీంతో మెడికల్‌ షాపుల్లోని శానిటైజర్‌ బాటిళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దుకాణాదారులు బిల్లులు లేకుండా వీటి అమ్మకాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. విజయవాడలో ఓ వ్యక్తికి చెందిన మూడు దుకాణాల్లో గత మూడేళ్లలో సుమారు 75 వేల బాటిళ్లు అమ్ముడుపోయినట్లు ఔషధ నియంత్రణ విభాగం అధికారులు గుర్తించారు. అతనికి చెందిన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని పలు మెడికల్‌ షాపులపైనా డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. తయారీ కంపెనీల నుంచి శానిటైజర్‌ కొనుగోలు బిల్లులను తనిఖీ చేస్తున్నారు.


ఒకే షాపునకు రోజుకు 30 మంది

విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి పటమట హైస్కూల్‌ సమీపంతో పాటు మరో రెండు చోట్ల మెడికల్‌ షాపులు ఉండేవి. ఈ మూడింటిలో కలిపి గత మూడేళ్లలో దాదాపు 75 వేల శానిటైజర్‌ బాటిళ్లు అమ్ముడుపోయాయి. బిల్లులు లేకుండానే వీటి విక్రయాలు సాగించారు. శానిటైజర్‌ కొనుగోలు కోసం రోజుకు 30 మంది వరకు తన దుకాణానికి వచ్చేవారని అధికారుల విచారణలో ఆ షాపు యజమాని చెప్పడం గమనార్హం. వీటిల్లో రెండు షాపులు రెండేళ్లే నడిచాయి. నగరంలోని మరో రెండు మెడికల్‌ దుకాణాల్లోనూ ఒక్కో షాపు నుంచి 3-5 వేల బాటిళ్ల విక్రయాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై షాపుల యజమానులను అధికారులు ప్రశ్నించగా.. మద్యానికి బానిసైన వ్యక్తులు శానిటైజర్‌ను తాగుతున్నారని వారు చెప్పారు. రూ.50కే 100 మిల్లీలీటర్ల శానిటైజర్‌ బాటిల్‌ దొరుకుతుండడం దీనికి కారణమని అంటున్నారు. శానిటైజర్‌లో 70 శాతం ఇథనాల్‌ (ఇథైల్‌ ఆల్కాహాల్‌) ఉంటుంది.

కొవిడ్‌ తర్వాత కొరవడిన పర్యవేక్షణ

కొవిడ్‌ సమయంలో శానిటైజర్ల విక్రయాలకు లైసెన్స్‌ అవసరం లేదని, ఎవరైనా విక్రయించుకోవచ్చని అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత ఆ అనుమతులను వెనక్కి తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. శానిటైజర్ల విక్రయాలపై ఔషధ నియంత్రణ విభాగం పర్యవేక్షణ కొరవడింది. గతంలోనూ పలుమార్లు మెడికల్‌ షాపుల్లో తనిఖీలు చేసిన అధికారులు.. ఔషదాలు, సర్జికల్‌ వస్తువుల విక్రయాల గురించి మాత్రమే ఆరా తీసేవారు. ఇదే అదనుగా భావించిన మెడికల్‌ షాపుల యజమానులు ఇష్టారాజ్యంగా శానిటైజర్‌ అమ్మకాలు సాగించారు. అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించిన మెడికల్‌ షాపుల్లో కంపెనీల నుంచి శానిటైజర్‌ కొనుగోలు బిల్లులున్నాయి కానీ.. అమ్మినట్టు బిల్లులు లేకపోవడం గమనార్హం.


ఎక్కువగా లిక్విడ్‌ శానిటైజర్‌

మందుబాబులు ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న శానిటైజర్‌ను తాగుతున్నట్టు షాపుల యజమానులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. జెల్‌ రూపంలో ఉండే శానిటైజర్లు తాగడానికి వీలుపడదు. దీంతో ద్రవ రూప శానిటైజర్‌ బాటిళ్లు అధికంగా అమ్ముడుపోతున్నట్టు అధికారులు తెలిపారు. అధికారుల తనిఖీల్లో మరో కీలక విషయం బయటపడింది. తనిఖీలు నిర్వహించిన అన్ని మెడికల్‌ షాపుల్లో శానిటైజర్‌ బాటిళ్లు ఒకే కంపెనీకి చెందినవి కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని జి.కొండూరులో ఒక కంపెనీ శానిటైజర్‌ బాటిళ్లను తయారు చేస్తోంది. విజయవాడలోని వన్‌టౌన్‌కు చెందిన హోల్‌సేల్‌ షాపు నుంచే నగరంలోని మెడికల్‌ దుకాణాలకు ఈ శానిటైజర్లు సరఫరా అవుతున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ వార్తలను కూడా చదవండి


2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 05:52 AM