ఇంటి వద్దకే బస్సు.. సరికొత్త ప్రయోగానికి ఆర్టీసీ సన్నాహాలు
ABN , Publish Date - Aug 30 , 2026 | 04:42 AM
ప్రయాణికుల ఆదరణను చూరగొనటానికి విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు కొత్త పంథాను అనుసరించనున్నారు.
అగ్రశ్రేణి బస్సుల్లో 10 మందికిపైగా
బల్క్ బుక్ చేసుకుంటే పిక్‌పకు అవకాశం
తొలుత విజయవాడలో అమలుకు కసరత్తు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల ఆదరణను చూరగొనటానికి విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు కొత్త పంథాను అనుసరించనున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే తమ అగ్రశ్రేణి బస్సుల్లో 10 మందికిపైగా టికెట్లు బల్క్‌గా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకు వచ్చి ఆ ప్రయాణికులను పికప్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి హైయ్యండ్ బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ బుక్ చేసుకున్నాక.. నిర్ణీత సమయం కంటే ముందే బస్టాండ్‌కు చేరుకోవాలి. కొన్ని ప్రాంతాల నుంచి లగేజీతో పాటు సకాలంలో బస్టాండ్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. దీనిని గుర్తించిన ఆర్టీసీ.. బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే ఆ ప్రయాణికుల ఇంటి వద్ద నుంచే వారిని పికప్ చేసుకునే సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. హైయ్యండ్ శ్రేణిలో ఉన్న అన్ని బస్సులను ప్రయాణికుల ఇంటి వద్దకు పంపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా విజయవాడ నగర పరిధిలో ఈ విధానాన్ని అమలు చేయటానికి నిర్ణయించారు. బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆ సమాచారాన్ని ఆర్టీసీ అధికారులకు ముందస్తుగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం త్వరలోనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు