Share News

బరితెగించిన ‘ఎర్ర’ స్మగ్లర్లు

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:23 AM

ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. ‘ఆపరేషన్‌ అరణ్య’లో భాగంగా తమను పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీశాఖ అధికారుల వాహనాలను ఢీకొట్టి వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. అయినా ఇద్దరు స్మగ్లరను సిబ్బంది వెంబడించి పట్టుకోగలిగారు.

బరితెగించిన ‘ఎర్ర’ స్మగ్లర్లు

  • అటవీశాఖ వాహనాలను ఢీకొట్టి ముందుకు

  • ముగ్గురు అధికారులకు గాయాలు

  • వెంటపడి ఇద్దరిని పట్టుకున్న సిబ్బంది

  • అధికారులకు మెరుగైన వైద్యం అందించండి

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశం

పుంగనూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. ‘ఆపరేషన్‌ అరణ్య’లో భాగంగా తమను పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీశాఖ అధికారుల వాహనాలను ఢీకొట్టి వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. అయినా ఇద్దరు స్మగ్లరను సిబ్బంది వెంబడించి పట్టుకోగలిగారు. శనివారం రాత్రి జరిగిందీ ఘటన. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలు తమిళనాడుకు అక్రమంగా రవాణా అవుతున్నట్లు అన్నమయ్య జిల్లా పీలేరు అటవీశాఖ అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే పీలేరు స్క్వాడ్‌ రేంజ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, సిబ్బంది ఒక బృందంగా.. సెక్షన్‌ ఆఫీసర్‌ కె. ప్రకాశ్‌కుమార్‌, ఫారెస్ట్‌ బీటు ఆఫీసర్లు ప్రతాప్‌, రెడ్డిప్రసాద్‌, ప్రొటెక్ట్‌ వాచర్‌ బాలాజీ మరో బృందంగా స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కడపజిల్లా ఫించా ప్రాంతం నుంచి వస్తున్న ఎర్రచందనం కారును పట్టుకోవడానికి రేంజర్‌ చంద్రశేఖర్‌ రొంపిచెర్ల క్రాస్‌ తర్వాత పులిచెర్ల రోడ్డులో కాపుకాశారు. దీంతో స్మగ్లర్లు కారులో అతివేగం గా వచ్చి అడ్డుగా ఉన్న రేంజర్‌ జీపును ఢీకొట్టి వెళ్లారు. ఈ సమాచారాన్ని పులిచెర్ల మార్గంలో కాపుకాసిన ప్రకాశ్‌కుమార్‌ బృందానికి చేరవేయగా.. వారు స్మగ్లర్లను పట్టుకోడానికి ఎదురుగా వచ్చారు. వీరి వాహనాన్ని కూడా స్మగ్లర్లు అతివేగంగా ఢీకొట్టడంతో సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌కుమార్‌ ఎగిరి కిందపడ్డారు. అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌కు గాయాలయ్యాయి. స్మగ్లర్ల కారు లో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో నిందితులు బయటపడ్డారు.


అయినప్పటికీ సిబ్బంది స్మగ్లర్లను వెంబడించి కారులో ఉన్న ఇద్దరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడినవారిని తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన డ్రైవర్‌ బాలకృష్ణ, రాజేంద్రన్‌గా గుర్తించారు. వీరికి కూడా గాయాలయ్యాయి. పరారైన నిందితుల్లో ఒకరిని ప్రొటెక్ట్‌ వాచర్‌ బా లాజీ పట్టుకోబోగా, ఆయన చేతిని కొరికి నిందితుడు పరారయ్యాడు. సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రకాశ్‌కుమార్‌ కాలు విరగడంతో తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. అధికారులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 05:23 AM