Share News

వి‘నాయకులు’ వస్తున్నారు

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:35 PM

పట్నం నుంచి పల్లె వరకు వినాయక చతుర్థి నవరాత్రుల మహోత్సవాల సందడి మొదలైంది.

వి‘నాయకులు’ వస్తున్నారు

పట్నం, పల్లెసీమల్లో కొలువైన గణనాథులు

స్థానిక ఎన్నికల వేళ భక్తి పేరిట ‘పట్టు’ కోసం నాయకుల పోటీ

గణేశ్‌ మండపాల వద్ద రాజకీయ సందడి

కర్నూలు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్నం నుంచి పల్లె వరకు వినాయక చతుర్థి నవరాత్రుల మహోత్సవాల సందడి మొదలైంది. నేడు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై.. 22న జరిగే నిమజ్జన మహోత్సవంతో ముగుస్తాయి. కర్నూలు నగరంలో తొమిదో రోజున నిమజ్జనం చేస్తే, పలు ప్రాంతాల్లో మూడు, ఐదు, ఏడు రోజుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలు దేదీప్యమానంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఐదారు రోజులుగా వినాయక విగ్రహాలు ఏర్పాటు, మండపాల అలంకరణ, విద్యుదీపాలు ఏర్పాట్లలో యువత, భక్తులు తలమునకలై ఉన్నారు. గణనాథుడి ఆగమన మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మము బ్రోవు రావయ్య..! పార్వతీపుత్రా..! స్తుతిస్తూ విఘ్నేశ్వరుడికి హారతులతో స్వాగతం పలికారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఓటర్లు అయిన భక్తుల మనసు దోచుకోవడానికి వి‘నాయకుల’ రాకతో గణేశ్‌ మండపాల వద్ద రాజకీయ సందడి మొదలయ్యింది. విగ్రహాలు కొనుగోలు, మండపాల ఏర్పాటుకు విరాళాలు అందించడం, ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపే ఆశావహువులు పోటీపడుతున్నారు. భక్తి కార్యక్రమం కాస్తా రాజకీయ ‘పట్టు’కు వేదికగా మారుతోందన్న చర్చ జోరందుకుంది. భక్తుల పూజల అందుకోవడానికి వినాయకుడు వస్తున్నారు. ఆయనతో పాటుగా ఓట్ల వేటలో వి..’నాయకులు’ కూడా వస్తున్నారు..!

ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరం, నందాల్య, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్‌, ఆత్మకూరు, నందికొట్కురు ప్రధాన పట్టణాలు సహా తాలుకా, మండల కేంద్రా లతో పాటుగా గ్రామాల్లోనూ పెద్ద సంఖ్యలో వివిధ ప్రతిమల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఒక్క కర్నూలు నగరంలో దాదాపు 2,500లకు పైగా గణేశ్‌ విగ్రహాలు కొలువుదీరుతాయని అంచనా. ఉమ్మడి జిల్లాలో పట్టణాలు, పల్లెసీమల్లో దాదాపు 12-15 వేల విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అంత్యంత భారీస్తాయిలో లంబోదరుడి విగ్రహాలు ఏర్పాటు, కేంద్రీకృత శోభాయాత్ర, నిమజ్జన వేడుకలు జరిగే నగరాల్లో కర్నూలు నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ గణేశ్‌ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవా లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక పూజలు అందుకోవడానికి ఇప్పటికే అందంగా అలంకరించిన మండపాలకు భారీ విగ్రహాలు చేరుకున్నాయి. మల్లె పూల మండపం.. బంగారు మండపం.. పార్వతి పుత్రుడు కొలువైన అందాల మండపం..! అంటూ భక్తగణం పాటలతో.. భక్తిశ్రద్ధలతో పూజించేందుకు వివిధ వినాయక యువక మండళ్ల సభ్యులు, నిర్వాహకులు సన్నద్ధం అయ్యారు.

స్థానిక ఎన్నికల సందడి

కర్నూలు నగరపాలక సంస్థ సహా పురపాలక సంఘాలు, జడ్పీ, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కూడా ఇప్పటికే మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తుంది. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. నగర, మున్సిపల్‌ వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గుర్తింపు సర్వే దాదాపుగా పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు, 25 జడ్పీటీసీలు, 427 ఎంపీటీసీ స్థానాలు, 408 గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నంద్యాల జిల్లాలో నంద్యాల సహా ఐదు మున్సిపాలిటీలు, 28 జడ్పీటీసీలు, 381 ఎంపీటీసీ స్థానాలు, 489 గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరున లేదంటే అక్టోబరు మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ జారీ చేసే అవకాశం ఉందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. దీంతో పట్టణం, పల్లెసీమల్లో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. వినాయక మండపాల వద్ద వేలాది మందిని కలుసుకునే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపే ఆశావహులు వినాయక మండపాల వద్ద వాలిపోతున్నారు.

మా విరాళం.. మీ ఆశీర్వాదం

వినాయక చవితి వచ్చిందంటే పల్లె పట్నాల్లో సందడి మొదలవుతుంది. పట్టణాల్లో ఒక్కో వీధిలో ఒక్కో మండపం వెలుస్తుంది. విగ్రహాల ఏర్పాటు నుంచి మండపాల అలంకరణ వరకు యువత ఉత్సాహంగా పాల్గొంటుంది. ఇదే సమయంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల చూపు వినాయక యువక మండళ్లపై పడింది. ‘ముందు మా విరాళం.. ఆ తర్వాత మీ ఆశీర్వాదం’..! అంటూ వినాయక మండపాల నిర్వహకులకు విరాళాలు ఇవ్వడం, ఏర్పాట్లలో రాజకీయ నేతలు పోటీ పడుతున్నారు. ఒక పార్టీ నాయకుడు విగ్రహాలు కొనుగోలుకు నగదు రూపంలో విరాళం ఇస్తే.. ఒక్కో పార్టీ నాయకుడు మండపాల ఏర్పాటుకు సామగ్రిని సమకూరుస్తున్నారు. ఇంకొందరు లైటింగ్‌, తాగునీరు, కుర్చీలు, భోజన ఏర్పాట్ల బాధ్యత తమదే అంటూ ముందుకు వస్తున్నారు. ఎవరు ఎక్కువగా సహకరిస్తే వారిపేరు అంతగా ప్రచారంలోకి వస్తుందన్న భావనతో నాయకులు పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల ఉండడంతో బడాబడా నాయకులే కాదు చోటా నాయకుల సందడి పెరిగిందని అశోక్‌ నగర్‌కు చెందని ఓ భక్తుడు పేర్కొనడం కొసమెరుపు.

భక్తి మాటున రాజకీయ లెక్కలు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాలు, వార్డుల్లో తమకున్న పట్టు ఎంత..? అన్నది అంచనా వేసుకునే పనిలో అధికార కూటమి పార్టీలు సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకులు నిమగ్నమయ్యారు. ఏ వీధిలో పార్టీకి ప్రభావం ఉంది..? ఏ వినాయక యువక మండలి వెనుక ఎవరు ఉన్నారు? ఆ మండలి సభ్యులు ఎవరికి మద్దతు ఇస్తున్నారు..? వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు. భక్తులను ప్రసన్నం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకోవడానికి ఇదే మంచి తరుణం అంటూ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నాయకులు మండపాల వద్ద తమ రాజకీయ బలం చాటుకోవడానికి వేస్తున్న ఎత్తులు, మండపాల వద్ద కనిపించే నాయకుల సందడి, విరాళాల విషయంలో పోటీ, నిర్వాహకులతో పెరుగుతున్న సన్నిహితం.. ఇవన్నీ కూడా రాజకీయ లెక్కల్లో భాగమే అన్న చర్చ జరుగుతోంది.

వినాయకుడి కోసం భక్తులు.. భక్తుల కోసం నాయకులు

‘విఘ్నమ్ములన్నిటిని వేగమే తొలగించి.. విద్యా బుద్ధుల మాకు విరివిగా నొసగించి.. విఘ్నేశ్వరా నిను వేడుకొందుము దేవా..! ముల్లోక పూజ్యుడా మూషిక వాహనదారి మము బ్రోవు రావయ్యా..! అంటూ వినాయకుడిని భక్తగణం స్తుతిస్తే.. ఓట్ల కోసం వి‘నాయకులు’ మము కరుణించండి..! అంటూ భక్తులను స్తుతిస్తున్నారు. భక్తులు గణనాథుడి దర్శనం కోసం మండపాలకు వస్తుంటే.. రాజకీయ నాయకులు మాత్రం తమ భవిష్యత్తు రాజకీయ ‘దర్శనం’ కోసం అదే మండపాలను వేదికలుగా చేసుకుంటున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:35 PM