మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:56 PM
ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు.
మంత్రాలయం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన గురువారం నూతన సంవత్సరం కావటంతో దేశ నలుమూలలు నుంచి లక్షలాది మంది భక్తులు వరదలా తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. 2026 ప్రారంభం కావడంతో గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం, పరిమళ ప్రసాద క్యూలైన్‌న్లు వద్ద భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీ పెరగడంతో లాడ్జీలకు, పూజా సామగ్రికి డిమాండ్ పెరిగింది. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తుల రద్దీని పరిశీలించి అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లను తనిఖీ చేశారు. స్వామిజీ పాద దర్శనం కోసం భక్తులు బార్లుతీరి స్వామిజీ ఆశీస్సులు పొందారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవ్రేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాఽఽధిపతి పూర్ణ బోధ పూజ మందిరంలో విశాల వెండి మంటపంలో మూలరాములు, జయరాములు, దిగ్విజరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వివిధ రథాల పై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అధిష్ఠించి ఆలయ ప్రాంగణం చుట్టూ అంగరంగా వైభవంగా ఊరేగించారు. ఉత్సవమూర్తికి ఊంజలసేవ నిర్వహించారు.