వైసీపీ వేధింపులను గుర్తు చేసుకోండి
ABN , Publish Date - Sep 06 , 2026 | 04:34 AM
‘గత ప్రభుత్వం మిమ్మల్ని ఎలా వేధించిందో.. మీ హక్కులను ఎలా కాలరాసిందో ఓ సారి గుర్తు చేసుకోండి. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు.
ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు
రోడ్డున పడేసినా మీరు నోరు మెదపలేదు
మేలు జరిగిందంటే టీడీపీ హయాంలోనే
బకాయిలన్నీ గత ప్రభుత్వం నాటివే..
వాటిని 50 వేలకోట్ల నుంచి 30 వేలకోట్లకు తగ్గించాం
పరిస్థితి చక్కదిద్ది సమయానికి జీతాలు ఇస్తున్నాం
మా ప్రభుత్వంలో ఒక్క పైసా బకాయి లేదు
ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం చంద్రబాబు
నాడు నోరు మెదపలేదే
చాలా రాష్ట్రాల్లో స్టేట్ ఓన్ రెవెన్యూ (ఎస్‌వోఆర్) నిధుల్లో 40 శాతం వరకే ఉద్యోగుల జీతాలపై ఖర్చు చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో అది 95 శాతంగా ఉందని, అయినా ఉద్యోగులకు మేలు చేసే విషయంలో తాను వెనకడుగు వేయడం లేదని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలపై దుష్ప్రచారం చేస్తూ ఎస్‌వోఆర్‌లో 105 శాతం జీతాలకు పోతోందని, వారికి జీతాలు ఎందుకు పెంచాలంటూ కార్యాలయాల వద్ద హోర్డింగులు పెట్టించిందని గుర్తు చేశారు. వలంటీర్ల ద్వారా కరపత్రాలు పంచిందని, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఉద్యోగులను రోడ్డుకెక్కించిందని అన్నారు. అయినా ఆనాడు ఒక్కరూ మాట్లాడలేదని, వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించలేదని అన్నారు.
అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వం మిమ్మల్ని ఎలా వేధించిందో.. మీ హక్కులను ఎలా కాలరాసిందో ఓ సారి గుర్తు చేసుకోండి. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. సమయానికి జీతాలు ఇస్తే చాలనే పరిస్థితికి మిమ్మల్ని తీసుకొచ్చింది. ఉద్యోగులకు సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు పెట్టింది. ఆ పరిస్థితిని చక్కదిద్ది మీకు సమయానికి జీతాలు ఇస్తున్నాం. బకాయిలను రూ.30 వేల కోట్లకు తగ్గించాను. ఇప్పుడు మీరు పెండింగ్‌లో ఉన్నాయంటున్న బకాయిలన్నీ ఏ ప్రభుత్వ హయాంలోనివో మీకు తెలియదా? కూటమి ప్రభుత్వంలో ఒక్క పైసా బకాయి పెట్టామేమో చెప్పండి’ అని సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రం నుంచి 2025 వరకు రావాల్సిన నిధులన్నింటినీ గత వైసీపీ ప్రభుత్వం ఎలా వాడేసుకుందో, దానివల్ల కూటమి ప్రభుత్వంపై ఎలా భారం పడిందో వివరించారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పారు. 2019-24లో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలా అన్యాయం చేసిందో వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
అన్నీ తీసుకుని నన్నే తిడతారు
ఉద్యోగులకు మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. తమ హక్కుల కోసం ఉద్యోగులు గత ప్రభుత్వంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వారిపై కేసులు పెట్టారని, ఆ కేసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 5 డీఏలు పీఆర్సీలో కలిపేసినా, హెచ్‌ఆర్‌ఏని తగ్గించినా నాడు ఒక్కరూ మాట్లాడలేదన్నారు. చివరకు ఇంట్లో పెళ్లిళ్ల కోసం లోన్ పెట్టుకుంటే దాన్ని కూడా ఇవ్వకపోతే పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి నాడు ఉండేదన్నారు. తన దగ్గర అన్నీ తీసుకుంటూనే తనను తిడుతున్నారని వ్యాఖ్యానించారు.
మంచికి, చెడుకు తేడా గుర్తించండి
‘గత పాలకులు ఉద్యోగులను దగ్గరకే రానివ్వలేదు. రివర్స్ పీఆర్సీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను కూడా పెండింగ్‌లో పెట్టారు. సమస్యల పరిష్కారం కోసం తమ కాళ్లు పట్టుకోవాలని అప్పుడు మంత్రులుగా ఉన్నవారు వ్యాఖ్యలు చేశారు. అవమానించారు. మంచికి, చెడుకు ఉన్న వ్యత్యాసాన్ని ఉద్యోగులందరూ గుర్తించాలి’ అని సీఎం కోరారు.
నాడు పెళ్లిళ్లూ వాయిదా: ఉద్యోగులు
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను, డిమాండ్లను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో పీఎఫ్ లోన్లు కూడా ఇవ్వకుండా వేధించడంతో తమ పిల్లల పెళ్లిళ్లు సైతం వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. రిటైరైన ఉద్యోగులకు మేలు చేసే అడిషనల్ క్వాంటం పెన్షన్‌ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
అడిషనల్ క్వాంటం పెన్షన్ ఇవ్వండి: విద్యాసాగర్
సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ పెన్షన్లరకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ కోసం పట్టుబట్టారు. అడిషనల్ క్వాంటం పెన్షన్ అనేది గతంలో ఎప్పుడూ లేదని, 2017లో టీడీపీ ప్రభుత్వం 70 ఏళ్లు నిండిన వారికి 10 శాతం, 75 ఏళ్లు నిండిన వారికి 15 శాతం మంజూరు చేసిందని సీఎం దృష్టికి తెచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే దీన్ని ఎత్తివేసిందని, తాము ఆందోళన చేయడంతో గతంలో ఉన్న 10, 15 శాతాలను 7, 12 శాతాలకు తగ్గించిందని చెప్పారు. గతంలో ఉన్న మాదిరిగా 10, 15 శాతాలకు పునరుద్ధరిస్తే 4 లక్షల మందికిపైగా పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ఆ పెద్దల ఆశీస్సులన్నీ మీపై ఉంటాయని సీఎంతో అన్నారు. దీనికి సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అడిషనల్ క్వాంటం పెన్షన్‌ను 10, 15 శాతాలకు పునరుద్ధరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వండి: రామకృష్ణ
రాజధానిలో ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ సమావేశంలో సీఎంను కోరారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2019లో జీవో ఇచ్చి వదిలేశారని, గత ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నందున ఉద్యోగులకు, పాత్రికేయులకు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై దృష్టి సారించాలని కోరారు. ఇప్పుడు స్థలాలు ఇచ్చినట్లయితే ఇళ్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని, రాజధాని అభివృద్ధిలో తమను భాగస్వాములను చేసినట్టు ఉంటుందని తెలిపారు. సుమారు 30 వేలమంది ఉద్యోగులు వారితో పాటు పాత్రికేయులు అక్కడికి వస్తే ప్రభుత్వానికి భరోసాగా నిలుస్తామని రామకృష్ణ అన్నారు. సీఎం స్పందిస్తూ.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఈ బాధ్యత అప్పగిస్తానని చెప్పారు. మంత్రుల బృందం(జీవోఎం)తో రెగ్యులర్‌గా ఉద్యోగ సంఘాలు ఇంటరాక్ట్ అయ్యే విధంగా చూడాలని రామకృష్ణ కోరగా సీఎం అంగీకరించారు. సమావేశం అనంతరం 11 ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి సీఎం చంద్రబాబును సన్మానించారు.
బొప్పరాజు.. నీవు ప్రశ్నించే విధానం సరిగా లేదు: సీఎం
సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులందరూ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లును ఉద్దేశించి సీఎం సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్యోగుల సమస్యలపై మీరు ఎంత మాట్లాడినా నేనేమీ అనను. ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్నీ తప్పుపట్టను. కానీ మీరు ప్రశ్నించే విధానమే సరిగా లేదు. ఎవరైతే మీకు మంచి చేస్తున్నారో వారినే మీరు నిలదీస్తున్నారు. ఎంతోమంది ఉద్యోగ సంఘాల నాయకులను చూశాను. ఎవరూ సీఎంను, సీఎం కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించింది లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎంత అన్యాయం జరిగినా నోరు తెరవని వారంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు’ అని సీఎం అన్నారు. అక్కడే ఉన్న ఇతర నాయకులు జోక్యం చేసుకుని.. అప్పుడు మాట్లాడితే కేసులు పెట్టేవారు సర్ అని అన్నారు. తాను కేసులు పెట్టడం లేదనే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు.
సూర్యనారాయణతో ఏపీజేఏసీ వాగ్వాదం
కష్టం అందరిదీ.. క్రెడిట్ మాత్రం నీకా!
సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ బయటకొచ్చి మీడియాతో మాట్లాడటం మొదలు పెట్టారు. ఏపీజేఏసీ నాయకులు నినాదాలు చేసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. తాను మాట్లాడుతుండగా నినాదాలు ఏంటంటూ సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. దీంతో సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేశామని, బయటకు వచ్చి అందరం కలిసి మాట్లాడాలే కానీ నీవు ఒక్కడివే ఎలా మాట్లాడుతావంటూ ఏపీజేఏసీ నాయకులు నిలదీశారు. దీంతో ఇరుపక్షాల నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యాసాగర్ జోక్యం చేసుకుని ఇరుపక్షాలకు సర్ది చెప్పారు.
ఈ వార్తలను కూడా చదవండి
సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు