రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:21 AM
రాయలసీమను దేశంలోనే కీలక ఉద్యాన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికను ప్రకటించింది. రూ.లక్ష కోట్లతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమాన్ని చేపట్టి.. 10 జిల్లాల్లో 201 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 1: రాయలసీమలో ఉద్యాన రంగానికి భారీ ప్రోత్సాహం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రూ.లక్ష కోట్లతో చేపట్టే ఈ కార్యక్రమంలో 10 జిల్లాల్లో 201 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకూ మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.
ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడంతో పాటు 9.6 లక్షల మంది రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్ల పెట్టుబడులు, ప్రైవేటు రంగం నుంచి సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నట్లు తెలిపారు. సాగునీటికి రూ.20,884 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. తొలి దశలో 72 క్లస్టర్లకు రూ.12,066 కోట్లు, రెండో దశలో 67 క్లస్టర్లకు రూ.15,036 కోట్లు, మూడో దశలో 62 క్లస్టర్లకు రూ.13,250 కోట్లు కేటాయించి మొత్తం 201 క్లస్టర్లను ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు.
రాయలసీమలో 9 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు కల్పించడంతో పాటు మరో 4.3 లక్షల ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. 5,721 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయని, డ్రిప్, స్ప్రింక్లర్, ఫర్టిగేషన్ వంటి సూక్ష్మ సాగునీటి విధానాలను విస్తరించనున్నట్లు తెలిపారు. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు అధిక విలువైన పంటలను ప్రోత్సహించి, గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మామిడి పల్ప్, అరటి పౌడర్, చిప్స్, టమాటా ప్యూరీ, మిర్చి ఒలియోరెసిన్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మూడో సంవత్సరం నుంచి రూ.81 వేల కోట్ల అదనపు GVA, సుమారు 19.7 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘కరువు సీమ’ను ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దుతామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ
నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ
Read Latest AP News And Telugu News