Share News

పానకాల స్వామి కొండపై పునుగు పిల్లి!

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:25 AM

అంతరించిపోతున్న అరుదైన జంతు జాతుల్లో ఒకటైన పునుగు పిల్లి మంగళగిరి పానకాల స్వామి కొండపై ప్రత్యక్షమైంది. ఇటీవల భక్తులు ఘాట్‌ రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళుతుండగా రాళ్ల మధ్యన పునుగు పిల్లి నక్కి వుండడాన్ని గమనించారు.

పానకాల స్వామి కొండపై పునుగు పిల్లి!

  • ఏ జాతికి చెందినదో ధ్రువీకరించాల్సిన అటవీ శాఖ అధికారులు

  • గతంలోనూ నాలుగైదింటిని పట్టుకొని కొండ ప్రాంతాలకు తరలింపు

మంగళగిరి సిటీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): అంతరించిపోతున్న అరుదైన జంతు జాతుల్లో ఒకటైన పునుగు పిల్లి మంగళగిరి పానకాల స్వామి కొండపై ప్రత్యక్షమైంది. ఇటీవల భక్తులు ఘాట్‌ రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళుతుండగా రాళ్ల మధ్యన పునుగు పిల్లి నక్కి వుండడాన్ని గమనించారు. ఫొటోలు, వీడియోలను చిత్రీకరించగా సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌ అయ్యాయి. నిత్యం జనసంచారం ఎక్కువగా వుండే మంగళగిరి కొండపై పునుగు పిల్లి దర్శనమివ్వడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. శేషాచలం, నల్లమల అడవుల్లో ఎక్కువగా కనిపించే దీనికి ఎన్నో విశిష్టతలు వున్నాయి. పునుగు పిల్లలు సాధారణంగా రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తుంటాయి. వివిధ రకాల పండ్లు, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పునుగు పిల్లి తన శరీరం నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి ఒక విధమైన ద్రవాన్ని విసర్జిస్తుంది. జిగురులాంటి ఆ పదార్థం గట్టిపడిన తరువాత దానిని సేకరిస్తారు. ఈ సుంగంధ పరిమళ భరితమైన తైలాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత అద్దుతారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన మంగళాద్రి పర్వతంపై ఇప్పుడు పునుగు పిల్లి దర్శనమివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పునుగు పిల్లుల్లో దాదాపు 38 జాతులు వున్నట్టు చెబుతున్నారు. మంగళగిరిలో ప్రత్యక్షమైన పునుగు పిల్లి ఏ జాతికి చెందినదో అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించవలసి వుంది.

ఈ వార్తలనూ చదవండి

లచ్చప్ప మాస్టారు..

స్పృహ తప్పిన వృద్ధుడికి ఏఎస్‌ఐ సేవలు

Updated Date - Sep 08 , 2026 | 05:25 AM