మరో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:02 AM
తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాచపాళెం సమీపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
షార్ట్‌సర్క్యూటే కారణం.. తిరుపతి జిల్లాలో ఘటన
ఓజిలి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాచపాళెం సమీపంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 19 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సకాలంలో ప్రమాదాన్ని పసిగట్టి ఆపేయడంతో పెను ముప్పు తప్పింది.
కామాక్షి ట్రావెల్స్ బస్సు బుధవారం సాయంత్రం 6 గంటలకు రేపల్లె నుంచి బెంగళూరుకు బయల్దేరింది. మార్గమధ్యంలో ఓజిలి మండలం రాచపాళెం హైవే వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి 1.45 గంటలైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో పొగ వాసన వస్తుండటాన్ని సకాలంలో గుర్తించిన డ్రైవరు తిరుపతయ్య.. బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. అప్పటికి ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. క్లీనరు గోపీకృష్ణను అప్రమత్తం చేయడంతో.. అతడు ప్రయాణికులను.. నిద్రలేపి అందరినీ వెనుకా, ముందు డోర్ల నుంచి కిందకు దింపేశారు. ప్రయాణికులంతా కిందకు దిగారో లేదో దట్టమైన పొగలతో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. కొంతసేపటికే డీజల్ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించి చర్యలు తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెగిన రోప్.. దిగిపోయిన 9వ గేటు
ఆత్మీయ సమావేశంలో బొత్స కంటతడి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News