Share News

అభివృద్ధికి జిల్లాలే చోదక శక్తులు!

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:08 AM

జీఎ్‌సడీపీ లక్ష్యాన్ని చేరుకునేలా జిల్లాల్లో ఉన్న అవకాశాలను వెలికితీయాలని, స్థానిక వనరులను సమర్థవంతంగా మార్కెటింగ్‌ చేసుకుని సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధికి జిల్లాలే చోదక శక్తులు!
CM Review meeting

  • వృద్ధికి ఉన్న అవకాశాలను వెలికితీయండి..

  • స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని సంపద సృష్టించాలి

  • ఈ ఏడాది వృద్ధిరేటు అంచనా 13.44 శాతం..

  • ఆక్వాలో 31.77 శాతం వృద్ధి నమోదు..

  • కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

  • ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించండి..

  • రెవెన్యూ శాఖకు ఆదేశం..

  • బుడగ జంగాలకు వెంటనే ఎస్సీ ప్రయోజనాలు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖకు నిర్దేశం

అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జీఎ్‌సడీపీ లక్ష్యాన్ని చేరుకునేలా జిల్లాల్లో ఉన్న అవకాశాలను వెలికితీయాలని, స్థానిక వనరులను సమర్థవంతంగా మార్కెటింగ్‌ చేసుకుని సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలవారీగా వృద్ధి సమాచారాన్ని మంత్రులు, కలెక్టర్లకు అందించేలా ఆర్టీజీఎస్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పెట్టుబడుల అమలు, జీఎ్‌సడీపీ సహా వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.


ధరల సూచీ సహా వివిధ అంశాలను పరిగణించేందుకు 2022-23ను బేస్‌ ఏడాదిగా కేంద్రం నిర్ధారించిందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుత ధరల మేరకు 2026-27 వృద్ధిరేటు అంచనా 13.44 శాతమని వెల్లడించారు. 2026-27 తొలి త్రైమాసికంలో వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏ వృద్ధిరేటు 14.19 శాతానికి పెరిగిందని, పరిశ్రమల రంగంలో 14.81 శాతం, సేవల రంగంలో 12.7 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. ఆక్వా రంగంలో 6.61 లక్షల టన్నుల ఉత్పత్తితో 31.77 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు.


సీసీఎల్‌ఏలో ల్యాండ్‌ బ్యాంక్‌ పోర్టల్‌

రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూముల వివరాలను తెలిపేలా భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పరిధిలో ల్యాండ్‌ బ్యాంక్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి, వాటి వివరాలను సమగ్రంగా ల్యాండ్‌ బ్యాంక్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. భూముల రీసర్వే పూర్తయ్యాక.. ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి? ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉన్నాయో స్పష్టత తీసుకురావాలని సీసీఎల్‌ఏను సీఎం ఆదేశించారు. ఇందులో ప్రభుత్వ శాఖలకు జిల్లాల వారీగా ఉన్న భూముల వివరాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.


రెండేళ్లు దాటినా ఏం చేస్తున్నారు?

రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల వారికి కల్పిస్తోన్న ప్రయోజనాలను బుడగ జంగాలకు కూడా వర్తింపచేయాలని సీఎం చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖను ఆదేశించారు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కేంద్రం పరిధిలో ఉందని, దానిపై నిర్ణయం వచ్చే వరకు వారికి కూడా ఎస్సీల ప్రయోజనాలు వర్తింపచేయాలని చెప్పినా.. ఇప్పటి దాకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఈడబ్ల్యుఎస్‌ విభాగం కార్యదర్శి సునీతను సీఎం ప్రశ్నించారు. ఈ విషయంలో మాటిచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటిదాకా అమలు చేయలేకపోయామని, ఎందుకీ పరిస్థితిని తీసుకొస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.


సంబంధిత ఫైలును సాంఘిక సంక్షేమ శాఖకు పంపించామని, వారికి మార్క్‌ చేసి పంపించడం మినహా తనకు మరో ఛాయిస్‌ లేదని అధికారి సునీత చెప్పారు. వెంటనే సీఎం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నాయక్‌తో మాట్లాడి ఫైలు ఎందుకు ఆగిందని ఆరా తీశారు. ఆ ఫైలు న్యాయ శాఖ పరిశీలనకు వెళ్లివ చ్చిందని, రెండు రోజుల్లో ఆదేశాలు ఇస్తామని చెప్పారు. సీఎం జోక్యం చేసుకొని.. రెండు రోజులంటే కుదరదని, వెంటనే ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.


పెరిగిన విద్యుత్‌ వినియోగం

విద్యుత్‌ ఉత్పత్తి 24,248 మిలియన్‌ యూనిట్ల నుంచి 28,664 మిలియన్‌ యూనిట్లకు పెరిగిందని.. ఇదే సమయంలో విద్యుత్‌ వినియోగం 14.28 శాతం పెరిగిందని అధికారులు చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తిలో 2026-27 తొలి త్రైమాసికంలో రూ.1,13,638 కోట్లు, సేవల రంగంలో రూ.1,60,107 కోట్ల జీవీఏ నమోదైందని వివరించారు. జీఎస్టీ ఆదాయంలోనూ 18 శాతం పెరుగుదల నమోదైందన్నారు. ఏఐ టాస్క్‌ఫోర్స్‌ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని తెలిపారు.


‘వాటర్‌మ్యాన్‌’ బిరుదు వెనుక అందరి కృషి!

రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ.. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ ఆయనకు వాటర్‌మ్యాన్‌ అనే బిరుదు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించగా.. వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు, మంత్రులందరూ లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. తనకు ఈ బిరుదు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని.. దీని వెనుక అందరి కృషీ ఉందని సీఎం అన్నారు. ‘గతంలో రాష్ట్రానికి బిల్‌గేట్స్‌ వచ్చినప్పుడు.. ఏపీకి నన్ను సీఈవోగా పేర్కొన్నప్పుడు.. గ్లోబల్‌ డ్రీమ్‌ క్యాబినెట్‌లో నా పేరు చేర్చినప్పుడు కూడా ఇంతలా ఆనందపడలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయడం, ప్రజలకు తాగు, సాగునీరివ్వడంలో మంత్రులు, అధికారుల కృషి కూడా ఉంది. ఇదంతా టీమ్‌వర్క్‌తో జరిగింది’ అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే మార్చికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..
సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం!
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 04:08 AM