ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం!
ABN , Publish Date - Sep 11 , 2026 | 03:49 AM
ఎల్‌నినో ప్రభావంతో ముంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు పాలనా యంత్రాంగం సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు నష్టం రాకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అధికారులు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి..
రైతులకు నష్టం రాకుండా చూడటమే లక్ష్యం
సంక్షోభ సమయంలో తాగునీటికి తొలి ప్రాధాన్యం
వచ్చే వారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయికి వెళ్లాలి
మూడేళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తికావాలి...
ఎల్‌నినోపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ముంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు పాలనా యంత్రాంగం సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు నష్టం రాకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నీటి ఎద్దడిని సమర్థంగా ఎదుర్కొందామని పేర్కొన్నారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావంపై వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
వచ్చే వారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామాల్లో పర్యటించాలని పిలుపునిచ్చారు. తానూ స్వయంగా పొలాల్లోకి వచ్చి పనులను ప్రారంభిస్తానని ప్రకటించారు. రైతుల్లో మనోధైర్యాన్ని నింపి, ప్రకృతి వ్యవసాయం, సరికొత్త సాంకేతికత ద్వారా ఈ కరువు పరిస్థితిని సమర్థంగా అధిగమించేలా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెలలోనే గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
ప్రజలపై ధరల భారం పడొద్దు
వర్షాభావం వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు నష్టం కలగడమే కాకుండా, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రుల కమిటీ నిరంతరం పనిచేయాలన్నారు. రైతు బజార్లలో ఉల్లిపాయలను కేజీ రూ.32 చొప్పున విక్రయిస్తున్నామని అధికారులు చెప్పగా, సబ్సిడీపై సరుకులు విక్రయించడమే కాకుండా ఉత్పత్తి దశ నుంచే పకడ్బందీ ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. తక్కువ కాలంలో పండే కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు ప్రభుత్వం ముందస్తుగానే కనీస మద్దతు ధరతో పాటు కొనుగోలు హామీ ఇవ్వాలని, అప్పుడు రైతులు ఉత్సాహంగా పంటలు వేస్తారని, మార్కెట్లో ధరలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయం విధానంలో తక్కువ నీటితో పండే పంటలను, బహుళ పంటల విధానాన్ని పెద్దఎత్తున అమలు చేయాలని ఆదేశించారు. బీడు భూముల్లోనూ డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లిస్తే, కాస్తంత వర్షం పడినా పంట చేతికి వస్తుందని, వర్షం పూర్తిగా రాకపోయినా పశుగ్రాసంగా లేదా నేల సారవంతం కావడానికి పనికొస్తుందన్నారు. ఈ ప్రణాళికపై రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, వ్యవసాయ సహకార శాఖలో ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్ వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశమై రెండు రోజుల్లో సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా కింద రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 16.92 లక్షల హెక్టార్లకు బీమా పూర్తయిందని అధికారులు తెలిపారు. బీమా చేయించినప్పటికీ, వర్షాభావం వల్ల పంట వేయలేని రైతులకు పరిహారం అందుతుందా.. లేదా అని సీఎం ప్రశ్నించగా.. వాతావరణ ఆధారిత బీమాలో వర్షపాతం లోటును బట్టి పంట లేకపోయినా క్లెయిమ్ పొందే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఈ-పంటలో నమోదైన పంటలకు, బీమా దరఖాస్తులకు మధ్య వ్యత్యాసాలకు తక్షణమే సరిచేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ వరకు అవసరమైన 160 నుంచి 212 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు పశుసంవర్థక శాఖ తెలిపింది. శ్రీసత్యసాయి, మార్కాపురం, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లాలోని 222 రైతు సేవా కేంద్రాల పరిధిలో మేత కొరత ఉండే అవకాశం ఉందని గుర్తించారు. ఈ ప్రాంతాలను మేత సమృద్ధిగా ఉన్న ప్రాంతాలతో అనుసంధానం చేయాలని, ఉపాధి హామీ పథకం కింద సామాజిక భూముల్లో పచ్చిమేత సాగును విస్తరించాలని సీఎం ఆదేశించారు.
సమర్థంగా ఎదుర్కొందాం
నీటి ఎద్దడిని సమర్థంగా ఎదుర్కొందామని సీఎం పిలుపునిచ్చారు. నీటి లభ్యత, ఎల్‌నినో ప్రభావం, ప్రాజెక్టుల నిర్వహణపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటి వినియోగంలో మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి, అత్యవసర పరిశ్రమల అవసరాలకు మాత్రమే నీటిని కేటాయించాలని సీఎం అన్నారు. రెండో ప్రాధాన్యంగా పశుగ్రాసం సాగుకు, మూడో ప్రాధాన్యంగా బత్తాయి, నిమ్మ, దానిమ్మ వంటి శాశ్వత ఉద్యాన పంటలను కాపాడేందుకు బిందు సేద్యం ద్వారా నీటిని అందించాలని సూచించారు. ఆ తర్వాతే ఆరుతడి పంటలకు వ్యవసాయ కుంటలు, సూక్ష్మసేద్యం ద్వారా నీరివ్వాలని, నీటి లభ్యత ఉన్న గోదావరి డెల్టాలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో కొత్తగా వరి సాగును అనుమతించొద్దని తేల్చిచెప్పారు.
ఆ విజయాలపై అభినందనలు
తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల బిగింపు, పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ-అనకాపల్లికి నీటి విడుదల, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభంపై రూపొందించిన లఘు చిత్రాలను సదస్సులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ విజయాలపై జలవనరుల శాఖ మంత్రి, అధికారులు, ఇంజనీర్లను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్లు, 33.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ఎంపిక చేసిన 36 ప్రాధాన్య ప్రాజెక్టులను రాబోయే రెండు నుంచి రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించారు. నిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, సమర్థంగా పనిచేసిన అధికారులకు ఉత్తమ అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. జలధార పనులు నిరంతరం కొనసాగాలన్నారు.
ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ప్రభావం
స్పెషల్ సీఎస్ రాజశేఖర్ వెల్లడి
ఎల్‌నినో ప్రభావంపై ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల చెప్పిన విషయాలను వ్యవసాయశాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ప్రజెంటేషనలో వివరించారు. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54.9 శాతం వర్షపాత లోటు నెలకొందని, ఇది జాతీయ సగటుకు 3.5 రెట్లు అధికమన్నారు. ఆరు జిల్లాల్లో అతి తీవ్ర లోటు ఉండగా, 22 జిల్లాల్లో తీవ్ర లోటు ఉందని తెలిపారు. డిసెంబరు వరకూ కూడా ఈ లోటు కొనసాగతుందని గణాంకాలతో వివరించారు.
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు 30.84 లక్షల హెక్టార్లకు ఇప్పటి వరకు 22.82 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలు వేశారని తెలిపారు. వర్షాభావం, సాగునీటి ఇబ్బందుల వల్ల తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మరలడం మేలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలే కీలకమని, పరిస్థితి మరింత తీవ్రమయ్యే దాకా వేచి ఉండొద్దని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘రైతన్నా... మీకోసం’ కార్యక్రమం చేపట్టి, ప్రతి రైతును కలిసి, ప్రతి పంట కమతాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ సాగుకు రాయితీపై విత్తనాలు, పంటల బీమా ద్వారా రైతులకు చేయూత, ఉద్యాన పంటల రక్షణకు సూక్ష్మసేద్యం, పంట కుంటలు వంటి చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. 2027 జూన్ వరకు పశుగ్రాసాల అవసరాలకు తగిన నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని, మత్స్యరంగంలోనూ అధికారులను అప్రమత్తం చేశామని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సర్‌పై ముగిసిన క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ
జనం మెచ్చాలి! ప్రజా సంతృప్తే మనకు కొలమానం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News