ఉపాధి పనుల్లో అవకతవకలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:15 AM
మండలంలోని నామవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీల్లో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామసభలో పలు అవకతవకలు వెలుగుచూశాయి.

గ్రామసభలో వెల్లడించిన సోషల్ ఆడిట్ అధికారులు
పాయకరావుపేట రూరల్, జూలై 4: మండలంలోని నామవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీల్లో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామసభలో పలు అవకతవకలు వెలుగుచూశాయి. వీఆర్‌పీ దాసరి రామస్వామి ఉపాధి పనుల్లో బినామీ మస్తర్లతో భారీ అవకతవకలకు పాల్పడినట్టు సోషల్ ఆడిట్ అఽధికారులు వెల్లడించారు. ఉపాధి పనుల్లో వీఆర్‌పీ భారీగా అక్రమాలకు పాల్పడినట్టు గ్రామస్థులు గ్రామసభలో ఆరోపించారు. పనులకు రాని వారికి కూడా మస్తర్లు వేశారని, పనులు చేసిన వారికి కొంతమందికి పేమెంట్లు చెల్లించలేదని ఉపాధి కూలీలు ఆరోపించారు. గ్రామంలో సుమారు 87 పనులకు సంబంధించి చేపట్టిన రూ.54 లక్షల ఉపాధి పనుల్లో సుమారు రూ.21.7 లక్షలు అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు సోషల్ ఆడిట్ అధికారులు తెలిపారు. వీటిలో హౌసింగ్ లబ్ధిదారులకు కాకుండా బయట వాళ్లకు రూ.3 లక్షల 47 వేల 296లు, బినామీ మస్తర్ల ద్వారా రూ.లక్షా 2 వేల 634లు, ఉపాఽధి పనుల కొలతల్లో సుమారు రూ.17 లక్షల 10 వేల 809లు అవతవకలు జరిగాయని వెల్లడించారు. అదే విధంగా పునాది లెవెల్లో ఉన్న ఇళ్లకు రూఫ్ లెవెల్లో బిల్లు చేసినట్టు, ఒకే ఇంట్లో రెండు జాబ్‌కార్డులతో పనులు చేపట్టినట్టు గుర్తించామన్నారు. ఉపాధి పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ అధికారులు చదివి వినిపిస్తుండగా గ్రామస్థులు అవకతవకలపై నిలదీయగా, ఎన్‌ఆర్‌జీఎస్ అధికారులు పిలుస్తున్నా వినిపించుకోకుండా వీఆర్‌పీ రామస్వామి గ్రామసభ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఏపీవో హేమలత, టీఏ అచ్యుత్, డీఆర్‌పీ బి.పోలిరాజు, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునాచార్యులు, టీడీపీ నాయకులు కురందాసు శివ, గ్రామ శాఖ అధ్యక్షుడు గొర్ల లక్ష్మీనారాయణ, గొర్ల బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.