Share News

ధరల దరువు

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:18 AM

నిన్నటిదాకా ‘యుద్ధం’ భయపెట్టింది. దానికి ఇప్పుడు ఎల్‌నినో ఎఫెక్ట్‌ తోడయింది. ఇంకేముంది..! ధరల పులి జూలు విదిలించి సామాన్య, మధ్య తరగతి వర్గాలపై పంజా విసురుతోంది.

ధరల దరువు

  • అటు యుద్ధం.. ఇటు ‘ఎల్‌నినో’ పేరిట సామాన్యుడిపై బాదుడు

  • యుద్ధంతో ఇప్పటికే పెరిగిన ధరలు

  • ఎల్‌నినో పేరిట మరింతగా భారం

  • బడ్జెట్‌లో వొదగని నెల వెచ్చాలు

  • 4 నెలల్లోనే బియ్యం ధరల్లో 300 తేడా

  • చేదెక్కిన పంచదార, బెల్లం..

  • యుద్ధానికి ముందరి ధరలతో పోలిస్తే చాలా సరుకుల రేట్లు రెట్టింపైన వైనం

  • కూరలు, నూనెలు, ఇతర సరుకులు భగ్గు

  • కొందరు వ్యాపారుల తీరుతో తీవ్ర కష్టాలు

  • ఇంకా మార్కెట్‌కు రాని సీజనల్‌ పంటలు

  • అయినా..‘ఎల్‌నినో’ బూచితో ధరల మంట

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : నిన్నటిదాకా ‘యుద్ధం’ భయపెట్టింది. దానికి ఇప్పుడు ఎల్‌నినో ఎఫెక్ట్‌ తోడయింది. ఇంకేముంది..! ధరల పులి జూలు విదిలించి సామాన్య, మధ్య తరగతి వర్గాలపై పంజా విసురుతోంది. రోజుకు రూ.500 నుంచి రూ.1000 తెచ్చుకునే కూలీ నుంచి; నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య జీతాలు తీసుకునే మధ్యతరగతి ఉద్యోగుల వరకు.. ధరల దరువుకు హడలిపోతున్నారు. పప్పుల నుంచి నూనెల వరకు అన్నీ పెరిగిపోవడంతో నెలకు వేసిన బడ్జెట్‌ పక్షం రోజులకు కూడా రాక కలవరపడుతున్నారు. యుద్ధ ప్రభావంతో గల్ఫ్‌ నుంచి రావాల్సిన ముడి చమురు భగ్గుమంటుండటంతో దూర ప్రాంతాల నుంచి కూరగాయలు, సరుకులు, నూనెలను తెచ్చే రవాణా వ్యయాలు అమాంతం పెరిగాయి.


దానికితోడు.. ‘యుద్ధం’ పేరిట నిన్న, ఎల్‌నినో పేరిట ఇప్పుడు మార్కెట్‌లో కొందరు వ్యాపారులు ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. నిజానికి, రాష్ట్రంలో ఎల్‌నినో ఇంకా పూర్తిస్థాయిలో ప్రభావం చూపించలేదు. ఈ సీజన్‌ పంటలు మార్కెట్‌కు వస్తేనే ధరలపై దాని దెబ్బను అంచనా వేయగలం. కానీ, ఎల్‌నినో బూచిని చూపించి కొందరు వ్యాపారులు విపరీతంగా దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన విజయవాడ గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌పై యుద్ధం, ఎల్‌నినో ప్రభావం జమిలిగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు రూ.1350 ఉన్న మంచి బియ్యం ఆ తర్వాత రూ. 1560కు చేరుకుంది. ‘ఎల్‌నినో’తో దాని రేటిప్పుడు రూ. 1742 పలుకుతోంది. విదేశాలకు ఎగుమతులకు తోడు కృత్రిమ కొరత కొంత, నిల్వలు లేక మరికొంత బియ్యం ధరల పెంపునకు కారణమైంది. పంట దిగుబడులు రాకపోతే.. ఈ కొరత మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇక. పంచదార, బెల్లం వంటి ఉత్పత్తులు కూడా రూ.45 నుంచి రూ.55 కు పెరిగాయి. పంచదార కేజీ రూ.50 నుంచి రూ.73 లకు, బెల్లం కేజీ ధర రూ. 55 నుంచి రూ.80కు చేరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ20 ఆయిల్‌ దిశగా అడుగులు వేస్తుండటంతో ఇథనాల్‌కు డిమాండ్‌ పెరిగింది. చెరుకు పంట గతంలో మాదిరిగా షుగర్‌ ఫ్యాక్టరీల కంటే ఇథనాల్‌ ఫ్యాక్టరీలకు ఎక్కువగా తరలుతుండటంతో పంచదార, బెల్లంకు కూడా కొరత ఏర్పడుతోంది.


బెల్లం, పంచదార ధరలు పెరగటంతో కేంద్ర ప్రభుత్వం దిగుబడి సుంకాలను తగ్గించింది. దీంతో రూ. 8 - 10 వరకు ధర తగ్గింది. లేదంటే ఇంకా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతానికి పప్పులపై ఇంకా ప్రభావం చూపలేదు.

కూర..గాయాలే!

కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. టమాటా రూ.16 నుంచి రూ.24, వంకాయ (గుండ్రం) రూ. 20 నుంచి రూ. 24, పచ్చిమిర్చి కేజీ రూ. 22 నుంచి రూ.35, కాకర రూ. 20 నుంచి రూ 30, క్యారెట్‌ కేజీ రూ. 16 నుంచి రూ. 24, ఊటీ క్యారెట్‌ రూ 24 నుంచి రూ. 44, బంగాళదుంప రూ. 21 నుంచి రూ. 23, ఉల్లిపాయలు రూ. 20 నుంచి రూ. 47, క్యాలీఫ్లవర్‌ రూ. 20 నుంచి రూ. 35, కీరదోస రూ. 34 నుంచి రూ. 50, చిక్కుడు రూ. 30 నుంచి రూ. 34, బీన్స్‌ రూ. 75 నుంచి రూ. 100 లకు ధరలు పెరిగాయి.

కాగుతున్న నూనెలు..

వంట నూనెలు సహా ఇతర నిత్యావసరాలపై డాలర్‌ పెరుగుదల తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మనకు వంట నూనెలన్నీ మలేసియా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. యుద్ధ నేపథ్యంలో రూ. 170 పలికిన లీడరు సన్‌ఫ్లవర్‌ను ఎల్‌నినో పేరిట రూ.180కు అమ్ముతున్నారు. అలాగే.. పామాయిల్‌ రూ.130 నుంచి రూ.145కు, వేరుశనగనూనె రూ. 170 నుంచి రూ. 180లకు చేరింది. పురుగు మందుల ముడి సరుకులు పెరగటం కూడా వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని పెంచేసింది. సబ్బులు, పేస్టులు, ఇతర ప్యాకింగ్‌ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. సర్ప్‌ ఎక్స్‌ ఎల్‌ 250 గ్రాముల బార్‌ సోప్‌ రూ. 32 ల నుంచి రూ. 40 కి పెరిగింది. వీల్‌ పౌడర్‌ అరకేజీ రూ. 37ల నుంచి రూ. 43 లకు పెరిగింది. అందరూ ఎక్కువుగా ఉపయోగించే సంతూర్‌ సోప్‌ ధర ఒకటి రూ. 35 నుంచి రూ. 40 లకు చేరింది.


మార్కెట్‌ మంటలు..

ఏపీతో పాటు, తెలంగాణ రాష్ర్టానికి నిత్యావసరాలను ఎగుమతి చేసే ప్రధానమైనవాటిలో గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ ఒకటి. అటు యుద్ధ భయాలు.. ఇటు ఎల్‌ నినో, డాలరు పెరుగుదల ప్రభావంతో ఈ మార్కెట్‌ పది శాతం మేర ఎగుమతులను కోల్పోయింది. ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గిందని, ఈ ప్రభావం తమ ఎగుమతుల మీద చూపుతోందని మార్కెట్‌ వ్యాపారులు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. హోల్‌సేల్‌ మార్కెట్‌కు బియ్యం దేశీయంగా దిగుమతి అవుతుంటాయి. పప్పు దినుసుల్లో మినుములు, పచ్చ బఠానీలు దక్షిణాఫ్రికా నుంచి, కందులు బర్మా నుంచి దిగుమతి అవుతుంటాయి. డ్రై ఫ్రూట్స్‌ యూరప్‌ దేశాలనుంచి, ఖర్జూరం గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి అవుతాయి. ఇవి కాకుండా దేశీయంగా పండిన మిర్చి, కాటన్‌, ఫ్యాన్సీ ఐటమ్స్‌ వంటివి కూడా దిగుమతి చేసుకుని రెండు తెలుగు రాష్ర్టాల ప్రీ హోల్‌సేల్‌ వ్యాపారులు, రీటెయిల్‌ మార్కెట్లకు ఎగుమతులు చేస్తున్నారు. యుద్ధం నుంచి నేటి ఎల్‌ నినో పరిస్థితుల వరకు చూస్తే.. ప్రతి రోజూ సగటున రూ.3 కోట్ల వ్యాపారాన్ని గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ కోల్పోతోంది. ఇదే పరిస్థితి హైదరాబాద్‌, వరంగల్‌ హోల్‌సేల్‌ మార్కెట్లకు కూడా ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్

నా సెంచరీకి శ్రీలంక ప్లేయర్ కూడా కారణం: జురెల్

Updated Date - Aug 27 , 2026 | 04:18 AM