Share News

‘పరిషత్‌’ నిరాశ

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:54 AM

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలతోపాటే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిస్తారని అధికార పార్టీ కాంగ్రెస్‌ నేతలతో పాటు ఇతర పార్టీల్లోని ఆశావహులు హడావుడి చేసినా నిరాశనే మిగిలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీలోని ఆశావహుల్లో నామినేట్‌

‘పరిషత్‌’ నిరాశ

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలతోపాటే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిస్తారని అధికార పార్టీ కాంగ్రెస్‌ నేతలతో పాటు ఇతర పార్టీల్లోని ఆశావహులు హడావుడి చేసినా నిరాశనే మిగిలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీలోని ఆశావహుల్లో నామినేట్‌ పదవులు లేక, పరిషత్‌ ఎన్నికల్లో పదవులు దక్కించుకునే అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో అదే ఉత్సాహంతో పరిషత్‌ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని భావించారు. గతంలో జడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలిపివేయడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. తర్వాత పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే పూర్తి చేశారు. అదే మాదిరిగా పరిషత్‌ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని ఆశావహులు పల్లెల్లో కొద్ది రోజులు హడావుడి చేసి మౌనం దాల్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీలు,123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల నిర్వహణపై తరచూ ప్రభుత్వం పెద్దలు ఎన్నికలు వస్తాయని సంకేతాలు ఇవ్వడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలుకావడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో సద్దుమణగడం, ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏప్రిల్‌ మాసంలో ఓటర్‌ జాబితాల పరిశీలన చేపట్టడంతో ఎన్నికలు వస్తాయని భావించారు. కాంగ్రెస్‌ పార్టీలోని ఆశావహులు పల్లెల్లో మకాం మార్చి జిల్లా పరిషత్‌, ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీ పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామ పెద్దలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలతో సమాలోచన చేస్తూ.. అందర్నీ పలకరిస్తూ ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టుకున్నారు. కానీ ప్రభుత్వం కొద్దిరోజులుగా పరిషత్‌ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. దీంతో మళ్లీ జిల్లాలోని 260 గ్రామాల్లో రాజకీయ స్తబ్ధత ఏర్పడింది. మరోవైపు 2019 రిజర్వేషన్ల ప్రకారం పరిషత్‌ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. దాని ప్రకారం జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాల్లో ఒకటి ఎస్టీ మహిళ, ఒకటి ఎస్సీ మహిళ, రెండు ఎస్సీ జనరల్‌, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్‌, మూడు జనరల్‌ మహిళ, మరో మూడు జనరల్‌లకు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకారం ఆరు మహిళలకు, ఆరు జనరల్‌గా ఉన్నాయి. 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 68 మహిళలకు, 58 జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు ఆరు కేటాయించగా, 5 మహిళలకు, ఒకటి జనరల్‌గా ఉంది. 28 ఎస్సీలకు కేటాయించగా 17 మహిళలకు, 11 జనరల్‌, 25 బీసీలకు కేటాయించగా 14 మహిళలకు, 11 జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. 64జనరల్‌ స్థానాలు ఉండగా 29 మహిళలకు, 25 జనరల్‌గా కేటాయించారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీ డెడికేషన్‌ కమిటీ ఇచ్చే రిపోర్ట్‌ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. పరిషత్‌ రిజర్వేషన్లు జరుగుతాయని భావిస్తున్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 3.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1.70 లక్షలు. మహిళలు 1.82 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేసింది. 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 712 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా సిద్ధంగా ఉన్న ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ మాత్రం ఇవ్వడం లేదు.

రెండేళ్లుగా ఎదురుచూపులే..

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌, 12 మండల పరిషత్‌, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీకాలం 2024 జూలైలో ముగిసి రెండేళ్లు దాటిపోయింది. పరిషత్‌ పదవుల ఆశలతో పంచాయతీ ఎన్నికల్లో ఇతరులకు అవకాశాలు ఇచ్చి ఆవేదన చెందుతున్న వారు ఉన్నారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల్లో ముందుకు వచ్చిన ఆశావహులను ఆయా పార్టీల నేతలు వారిని బుజ్జగించి కొందరికి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. కొందరికి జడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్లు ఇస్తామని హామీలు ఇచ్చారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలో పదవుల ఆశతో ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారు నామినేట్‌ పదవులు దక్కకపోగా, పరిషత్‌ ఎన్నికలు పరిస్థితులు నిరాశ చెందుతున్నారు.

‘సర్‌’ తర్వాత ఎన్ని‘కల’లేనా

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల కోసం ఇప్పటికే జిల్లాలో 3.53 లక్షల ఓటర్లతో జాబితాలు సిద్ధం చేశారు, ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌) ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించింది. తుది ఓటరు జాబితా అక్టోబర్‌ 19 ప్రకటిస్తారు. పరిషత్‌ ఎన్నికలు తుది ఓటర్‌ జాబితా వచ్చిన తర్వాత నిర్వహిస్తారా.. లేక ముందే నిర్వహిస్తారా అనే సందిగ్ధం కూడా ఆశావహుల్లో ఉంది. సర్‌ ఓటర్‌ జాబితా ప్రకారం నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తగ్గిపోతారని ఆశావాహుల్లో ఆందోళన కూడా ఉంది. ఉద్యోగం, వ్యాపారరిత్య పట్టణాల్లో స్థిరపడ్డ వారు ఈసారి ఓటు హక్కు కోసం ఎన్యూమరేషన్‌ పత్రాలు అక్కడే అందించారు. దీంతో వలస ఓటర్ల మద్దతు పోయినట్లుగానే భావిస్తున్నారు.

జిల్లాలో గతంలో సిద్ధం చేసిన పరిషత్‌ ఓటర్లు..

మండలం పురుషులు మహిళలు మొత్తం

బోయిన్‌పల్లి 14,753 1,572 30,505

చందుర్తి 13,445 14,649 28,094

ఇల్లంతకుంట 19,644 20,902 40,546

గంభీరావుపేట 17,811 18,996 36,807

కోనరావుపేట 17,180 18,045 35,225

ముస్తాబాద్‌ 18,658 19,842 38,500

రుద్రంగి 6,454 7,208 13,665

తంగళ్లపల్లి 19,395 20,683 40,079

వీర్నపల్లి 5,769 5,958 11,727

వేములవాడ 8,953 9,523 18,492

వేములవాడరూరల్‌9,020 9,805 18,825

ఎల్లారెడ్డిపేట 19,690 21,196 40,886

మొత్తం 1,70,772 1,82,559 3,53,351

Updated Date - Aug 27 , 2026 | 12:55 AM