Share News

మార్కాపురానికి వెలిగొండ ప్రాజెక్టు వరం: మంత్రులు గొట్టిపాటి, పార్థసారథి..

ABN , Publish Date - Aug 30 , 2026 | 09:16 PM

మార్కాపురం ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం కానుందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కొలుసు పార్థసారథి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి కష్టాలు తీరడంతో పాటు మార్కాపురం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని పేర్కొన్నారు.

మార్కాపురానికి వెలిగొండ ప్రాజెక్టు వరం: మంత్రులు గొట్టిపాటి, పార్థసారథి..
Veligonda Project

అమరావతి: మార్కాపురం ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం కానుందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కొలుసు పార్థసారథి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి కష్టాలు తీరడంతో పాటు మార్కాపురం జిల్లా అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రను తిరగరాయాలన్నా చంద్రబాబుకే సాధ్యమని మంత్రి అన్నారు. వెనుకబడిన మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడం, హార్టికల్చర్‌ హబ్‌లో చేర్చడం, వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడం వంటి నిర్ణయాలు చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.


తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నేతలంతా ఢిల్లీకి వెళ్లి వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు సాధించామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, గుండ్లకమ్మ గేట్లు దెబ్బతినడం ఇందుకు నిదర్శనమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని విమర్శించారు. వెలిగొండ నిర్వాసితులకు కేవలం 48 రోజుల్లో రూ.768 కోట్ల పరిహారం అందించడం రికార్డని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో మార్కాపురం ప్రజల జీవన పరిస్థితులు, ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


మార్కాపురం జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం చారిత్రక రోజని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అందించిన ఆశీస్సులకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాల పట్ల నిరంకుశంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. పనులు పూర్తికాక ముందే, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లించకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని వైసీపీ చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. వేల అడుగుల లోతుకు బోర్లు వేసినా తాగునీరు లభించే పరిస్థితి లేక రైతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా కుదేలయ్యారని పార్థసారథి వివరించారు.


ఇలాంటి పరిస్థితుల్లో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం సంతోషకరమని మంత్రి పార్థసారథి అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అందించడంతో వారు సంతృప్తిగా పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లారని తెలిపారు. కాగా, మార్కాపురం జిల్లా ప్రజలు దాదాపు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రారంభానికి సిద్ధంగా వెలిగొండ ప్రాజెక్టు.. సీఎం కీలక పోస్టు

సెప్టెంబర్ 2న ఘనంగా జనసేన యువజన విభాగం ఆవిష్కరణ..

Updated Date - Aug 30 , 2026 | 09:48 PM