వామ్మో.. వాడకం!
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:18 AM
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. తీవ్ర ఎల్‌నినో ప్రభావంతో వేసవిని మించి డిమాండ్ నెలకొంది. దీంతో ఇంధన సంస్థలు డిమాండ్ మేరకు విద్యుత్‌ను సరఫరా చేయలేక సతమతమవుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచే విద్యుత్ వినియోగం 280 నుంచి 290 మిలియన్ యూనిట్లను తాకుతోంది. ఈ నెల 4న రికార్డు స్థాయిలో 292.22 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఏర్పడింది.
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
ఎల్‌నినో ప్రభావంతో డిమాండ్ పైపైకి
వేసవి కాలాన్ని మించిన పరిస్థితి
గత ఏడాదితో పోలిస్తే సగటున 40-50 మిలియన్ యూనిట్లు అదనం
ఆ మేరకు సరిపోని ఇంధన సరఫరా
పూర్తిస్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి
అయినా డిమాండ్ పెరిగి ఇబ్బంది
బయటి నుంచి కొనుగోలుకు యత్నం
ధర ఎక్కువైనా లభించని వైనం
ఈ నెల 10న 297.85 మిలియన్
యూనిట్ల విద్యుత్ డిమాండ్
రాష్ట్ర విద్యుత్ చరిత్రలో ఇదే తొలిసారి
గతేడాది ఇదే సమయానికి సగటు
వినియోగం 210 మిలియన్ యూనిట్లే
బహిరంగ మార్కెట్ నుంచి తక్కువ ధరకు విద్యుత్ లభించని పరిస్థితి నెలకొంది. తాత్కాలిక కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.10కి పైగా ఉంటోంది. ఒక్కోసారి అంత ధర చెల్లించి కొనుగోలు చేద్దామన్నా లభించడం లేదు. ఫలితంగా డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేయలేక అప్రకటిత కోతలు విధించాల్సి వస్తోంది. - విద్యుత్ శాఖఅధికారులు
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. తీవ్ర ఎల్‌నినో ప్రభావంతో వేసవిని మించి డిమాండ్ నెలకొంది. దీంతో ఇంధన సంస్థలు డిమాండ్ మేరకు విద్యుత్‌ను సరఫరా చేయలేక సతమతమవుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచే విద్యుత్ వినియోగం 280 నుంచి 290 మిలియన్ యూనిట్లను తాకుతోంది. ఈ నెల 4న రికార్డు స్థాయిలో 292.22 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత 9, 10 తేదీల్లో వరుసగా ఆ రికార్డును సైతం అధిగమించి.. 294.48, 297.85 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొంది. 290 మిలియన్ యూనిట్ల డిమాండ్ దాటిన ప్రతిసారీ ఆ స్థాయిలో సరఫరా చేయలేక సంస్థలు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటోంది. సెప్టెంబరు 9న 294.48 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొనగా 283.28 మిలియన్ యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలిగారు. 11.19 మిలియన్ యూనిట్ల లోటు వచ్చింది. సెప్టెంబరు 10న 297.85 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొనగా 284.45 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశారు. 13.39 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. ఇక, రాష్ట్ర విద్యుత్తు రంగ చరిత్రలో సెప్టెంబరు 10న నెలకొన్న డిమాండే రికార్డు అని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సెప్టెంబరు నెలలో సగటు వినియోగం కేవలం 210 మిలియన్ యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ ఏడాది మండువేసవి అయిన మేలోనూ 290 మిలియన్ యూనిట్లు వినియోగం దాటలేదు. మే 21న గరిష్ఠంగా 288.92 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఏర్పడింది.
ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్‌లు..
ఎల్‌నినో పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలో వ్యవసాయ, ఆక్వా రంగాల్లో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. మరోవైపు గృహ వినియోగదారులు కూడా విద్యుత్తును భారీగా వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర విద్యుత్తు సంస్థల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ నెలకొంది. ఆ మేరకు సరఫరా పెంచాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నా.. అంచనాలకు చేరలేకపోతున్నాయి. దీంతో ‘ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్’ పేరుతో అప్రకటిత కోతలు తప్పనిసరి అవుతున్నాయి.
పూర్తిస్థాయిలో పనిచేస్తున్నా..
ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుదుత్పత్తిపై ప్రభావం పడింది. మరోవైపు.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అయినా డిమాండ్‌ను చేరుకోలేకపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో జూలై వరకు సగటున 20 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేసేవారు. ఆగస్టు నుంచి ఇది 30 మిలియన్ యూనిట్లకు చేరింది. కొనుగోలు వ్యయాన్ని వీలైనంత తగ్గించుకోవాలన్న సీఎం ఆదేశాలతో ఎక్కువ ధర పెట్టి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ఇంధనశాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. మరోవైపు.. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి గత ఏడాది కన్నా 50 శాతం పెరగడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని, లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అధికారులు అంటున్నారు. గత ఏడాది ఇదే సమయానికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి 100 మిలియన్ యూనిట్ల లోపే ఉండగా ఈసారి అది 150 మిలియన్ యూనిట్లకు చేరడం గమనార్హం.
ఆక్వారైతుపై అదనపు భారం
ఆక్వారంగంపై విద్యుత్ కోతల ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా వాతావరణం వేసవిని తలపిస్తుండటంతో ఏరేటర్స్‌ను నిరంతరాయంగా నడిపించాల్సి వస్తోంది. గంట సేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోతే జనరేటర్ ద్వారా ఏరేటర్‌ను నడిపించేందుకు 6 లీటర్ల డీజిల్ ఖర్చవుతుందని, దీనికి రూ.600 అదనపు భారం పడుతోందని ఆక్వాసాగుదారులు వాపోతున్నారు. 2 గంటలు కోత విధిస్తే ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు ఖర్చవుతోందని చెబుతున్నారు. అప్రకటిత విద్యుత్తు కోతలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాత్రి 7 గంటల నుంచి కోత పెడుతున్నారు. 3 నుంచి 5 గంటల వరకు సరఫరా ఉండటం లేదని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తింపు పొందిన విజయవాడ జవహర్ ఆటోనగర్‌లో అప్రకటిత విద్యుత్తు కోతలు పారిశ్రామికవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పీక్ టైంలో కోతల వల్ల ఉత్పత్తి, సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని వాపోతున్నారు. గత నెలలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్తును నిలిపివేసేవారని, గత 3 రోజులుగా రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 వరకు నిలిపివేస్తున్నారని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, మెగా ఫుడ్ పార్కుకూ కోతలు తప్పడం లేదు. తొలుత గంటపాటు ఉన్న కోతలు ప్రస్తుతం 4 గంటలకు పెరిగాయి.
తప్పని కోతలు..
ప్రకాశం జిల్లాలో వారం రోజులుగా అనధికార కోతలు అమలు చేస్తున్నారు. రోజూ 2 నుంచి 3 గంటలపాటు సరఫరా నిలిచిపోతోంది. గ్రామాలు, మండల కేంద్రాల్లో కోతలు ఎక్కువగా ఉంటున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మద్యలో కోతలు విధిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అప్రకటిత కోతలు అమలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట 2 గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ కోతల తీవ్రత అడపాదడపా తప్ప పెద్దగా లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
కడప జిల్లాలో కోతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గృహాలకు సాయంత్రం 6 నుంచి 10 గంటలలోపు రెండు గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో అప్రకటిత కోతలు అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 నుంచి 4 గంటల వరకు కోతలు ఉంటున్నాయి.
విజయనగరం జిల్లాలో కోతలు తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ పొలానికి నీరు పెట్టేందుకు విద్యుత్తు మోటార్లు వాడుతుంటారు. వ్యవసాయానికి పగటి వేళ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు 9 గంటలపాటు సరఫరా చేసేవారు. గత వారం రోజులుగా విద్యుత్తు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు పొలాల్లోనే పడిగాపులు పడాల్సి వస్తోంది
అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి పగటి పూట 9 గంటల సరఫరా బదులు 7 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో రాత్రి వేళ గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. 2-4 గంటలపాటు అప్రకటిత కోతలు అమలు చేస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలకు సాయం త్రం 6 నుంచి 10 వరకు విద్యుత్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తిరుపతి జిల్లాలో పవర్ కట్ ప్రభావం కనిపిస్తోంది. ఇళ్లకు గంట నుంచి నాలుగు గంటల పాటు కోత విధిస్తున్నారు. చాలా చోట్ల సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి