గ్రేటర్ కమిషనర్‌కు అధికారం విస్తృతం
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:02 AM
జీవీఎంసీ కమిషనర్‌కు ప్రస్తుతం ఉన్న నిధులు కేటాయింపు పరిమితిని పెంచే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నిధుల కేటాయింపు విషయంలో పరిమితి పెంపు?
ప్రస్తుతం రూ.20 లక్షల వరకు మాత్రమే వెసులుబాటు
ఆ తరువాత రూ.రెండు కోట్ల వరకు కౌన్సిల్,
అంతకుమించితే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
ఈ కారణంగా నగరంలో అభివృద్ధి పనులకు అనుమతుల జారీలో
జాప్యం చోటుచేసుకుంటుందనే భావన
కమిషనర్‌కు పరిమితి రూ.2 కోట్లు వరకు పెంచాలని ఆలోచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ కమిషనర్‌కు ప్రస్తుతం ఉన్న నిధులు కేటాయింపు పరిమితిని పెంచే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రూ.20 లక్షలలోపు విలువైన పనులు మంజూరుకు జీవీఎంసీ కమిషనర్‌కు అధికారం ఉంది. దానిని రూ.రెండు కోట్లు వరకు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి సత్వర నిర్ణయం తీసుకోవడానికి వీలు కలుగుతుందనే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలోనే అతిపెద్ద మునిసిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీకి గుర్తింపు ఉంది. రూ.4,400 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్‌తో ఆర్థిక రాజధానిగా కొనసాగుతోంది. అభివృద్ధి పనులు కూడా అదేస్థాయిలో చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు నగరం నుంచి రాకపోకలు సాగించేందుకు అనువుగా తగిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా జీవీఎంసీపైనే పడింది. భవిష్యత్తులో నగర విస్తరణ మరింత వేగంగా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీరు, భూగర్భ మురుగునీరు వ్యవస్థ అందుబాటులోకి తేవడం, రవాణావ్యవస్థను మెరుగుపరచడం, పారిశుధ్య నిర్వహణకు తగిన ఏర్పాట్లుచేయడం వంటి బాధ్యతలు జీవీఎంసీయే చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల ఎంపిక, వాటి అమలుచేసేందుకు అవసరమైన అనుమతులు, నిధులు వ్యయం వంటి ప్రక్రియలను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్‌కు రూ.20 లక్షలలోపు విలువైన పనులకు ఆమోదం తెలపడం, నిధులను ఖర్చు పెట్టడం వరకే అధికారం ఉంది. అంతకుమించితే రూ.రెండు కోట్లు వరకు కౌన్సిల్/ప్రత్యేక అధికారి అనుమతి తీసుకోవాలి. రూ.రెండు కోట్లు పైబడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. దీనివల్ల నగరంలో అత్యవసరంగా చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ఆమోదం తీసుకోవడం, వాటికి నిధులను మంజూరుచేయడం వంటి ప్రక్రియల్లో జాప్యం జరుగుతోంది. ఇది నగర అభివృద్ధిపై పరోక్షంగా ప్రభావం చూపుతోంది. అలాకాకుండా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో మాదిరిగా జీవీఎంసీ పరిధిలో అవసరమైన ప్రాజెక్టుల ఎంపిక, నిధులు మంజూరు వంటి అధికారాలను కమిషనర్‌కే అప్పగించినట్టయితే సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలిగి, అభివృద్ధి కూడా అదేస్థాయిలో జరుగుతుందని ప్రభుత్వంలోని కీలక అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. జీహెచ్‌ఎంసీ స్థాయిలో కాకపోయినా కనీసం రూ.రెండు కోట్లు వరకు అయినా కమిషనర్‌కు అధికారం ఇస్తే విశాఖ నగర అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వంలోని పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టడం జరిగిందని, సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని...త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని జీవీఎంసీ అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
నియోజకవర్గానికొక హెలి పోర్టు
రుషికొండలో 5 ఎకరాలు కేటాయింపు
ఒక్కో దానికి రూ.20 కోట్ల నిధులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకుగాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హెలిపోర్టు నిర్మించాలని నిర్ణయించాయి. ఒక్కో హెలిపోర్టు నిర్మాణానికి ఐదు నుంచి పదిహేను ఎకరాల భూమి సేకరించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం రూ.20 కోట్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు నేరుగా ఆయా ప్రాంతాలకు హెలికాప్టర్లలో వెళ్లడానికి కూడా ఈ హెలిపోర్టులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే వాటికి 5 నుంచి 15 ఎకరాల భూమి ఎందుకు అనే దానిపై అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు.
విశాఖపట్నంలో ఇప్పటికే అనేక హెలిప్యాడ్‌లు ఉన్నాయి. విమానాశ్రయంలో హెలిపోర్టు ఉంది. రుషికొండ బీచ్‌లో హెలిప్యాడ్ ఉంది. అక్కడే ఐదు ఎకరాలు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి తెలియజేశారు. ఇవి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైసీపీ హయాంలో రెండు హెలిప్యాడ్లు నిర్మించారు. వీఎంఆర్‌డీఏ పార్కు వెనుక ఒక హెలిప్యాడ్ ఉంది. ఇక్కడి నుంచి హెలీ టూరిజం అప్పట్లో కొద్దిరోజులు నిర్వహించారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో కూడా ఒక హెలిప్యాడ్ నిర్మించారు. రుషికొండ ఐటీ పార్కులో ఒక హెలిప్యాడ్ ఉంది. అగనంపూడి మెడ్‌టెక్ జోన్‌లో ఒకటి, స్టీల్‌ప్లాంటులో ఒక హెలిప్యాడ్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు రంగంలో మెడికవర్ ఆస్పత్రిపైన, ఇసుకతోట జంక్షన్‌లోని లాన్సమ్ టవర్స్‌పైన హెలిప్యాడ్లు ఉన్నాయి.
హెలిప్యాడ్‌కు హెలిపోర్టుకు తేడా
హెలికాప్టర్ వచ్చి ల్యాండింగ్ అయి, తిరిగి వెళ్లిపోవడానికి వీలుగా ఉండేది హెలిప్యాడ్. అలా కాకుండా హెలికాప్టర్లు వచ్చి, వెళ్లడంతో పాటు ఐదు నుంచి పది వరకూ పార్కింగ్ చేసుకునేలా సౌకర్యాలు, అదేవిధంగా అక్కడ పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్ వంటివి ఏర్పాటుచేసే దానిని హెలిపోర్టు అంటారు.
విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ సిటీలో విశాఖ నుంచి అరకులోయకు విశాఖ ఉత్సవ్ సందర్భంగా హెలీ టూరిజం నిర్వహిస్తే పెద్దగా ఆదరణ లభించలేదు. దాంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. అటువంటిది ఇప్పుడు నియోజక వర్గానికి ఒక హెలిపోర్టు ఏర్పాటు, దానికి ఎకరాల కొద్దీ భూమి కేటాయింపు ఏ మేరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.
మార్చి నాటికి యూనిటీ మాల్ నిర్మాణం పూర్తి
విమెన్స్ హాస్టళ్లు కూడా...
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వర్కింగ్ విమెన్ కోసం మధురవాడ, ముడసర్లోవ, గాజువాకల్లో నిర్మిస్తున్న హాస్టళ్లు, తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియో వద్ద యూనిటీ మాల్ నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఆయన శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, సీఎం సమావేశం వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చిన జిల్లాల్లో నెల్లూరు మొదటి స్థానంలో, విశాఖపట్నం రెండో స్థానంలో ఉన్నాయన్నారు. వచ్చే సమావేశం నాటికి విశాఖను మొదటి స్థానానికి తీసుకువెళతామని చెప్పారు. విశాఖ జిల్లాకు 53 సంస్థలు పెట్టుబడులతో ముందుకురాగా వాటిలో 28 గ్రౌండింగ్ చేశామన్నారు. అదే విధంగా పెట్టుబడిదారుల సదస్సులో చేసుకున్న ఎంఓయూలను ప్రాజెక్టులుగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ముసురు
మహారాణిపేటలో 17.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటిసారి అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు నగరంలో ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు మహారాణిపేటలో 17.3 మిల్లీమీటర్లు, పెదగంట్యాడలో 11.8 మి.మీ., పెందుర్తిలో 10.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 8.1 మి.మీ. వర్షపాతం రికార్డు అయ్యింది. శనివారం ఉదయం ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత వర్షం లేకపోయినా నగరంపై మేఘాలు ఆవరించడంతో ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగింది. ఈ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పెద్దాస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు
కేజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మాణం
విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్ మరికొన్ని కీలక సేవలు అందించేందుకు సిద్ధమైంది. రూ.23.75 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ శనివారం ప్రారంభమైంది. ఈ బ్లాక్ కోసం రూ.7.5 కోట్లతో సుమారు 400 రకాల పరికరాలను కొనుగోలు చేశారు. రోడ్డు ప్రమాదాలు, పాము కాటు, బ్రెయిన్ స్ర్టోక్, హార్ట్ స్ర్టోక్ వంటి కేసుల్లో బాధితులకు ఈ కేంద్రంలో అత్యవసర వైద్య సేవలు అందించనున్నారు. ఎమర్జన్సీ డిపార్జుమెంట్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్స్, గైనిక్ వంటి విభాగాలకు చెందిన వైద్యులతో కూడిన బృందాలు 24 గంటలు సేవలు అందించనున్నాయి.