పోలీసులకు సవాల్ విసిరి.. హరియాణాలో చిక్కి!
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:09 AM
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలిక (15)ను ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసిన కేసులో మిస్టరీ వీడింది. దాదాపు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి.. ఒకానొక దశలో దమ్ముంటే తనను పట్టకోవాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సవాల్ విసిరిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు హరియాణలో పట్టుకున్నారు.
పోలీసులకు సవాల్ విసిరి.. హరియాణాలో చిక్కి!
గుంటూరు బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
హరియాణాలోని కర్నాల్‌లో ఉన్నట్టు గుర్తించి నిందితుడు అదుపులోకి
హైకోర్టు ఆగ్రహంతో కదిలిన పోలీసులు
గుంటూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలిక (15)ను ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసిన కేసులో మిస్టరీ వీడింది. దాదాపు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి.. ఒకానొక దశలో దమ్ముంటే తనను పట్టకోవాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సవాల్ విసిరిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు హరియాణలో పట్టుకున్నారు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన జాన్ సైదా అలియాస్ రబ్బానీ (28) ఈ ఏడాది జూన్ 9న గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీందర్‌నగర్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి బాలికను మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ హరియాణలోని కర్నాల్ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అక్కడకు వెళ్లి శుక్రవారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం వారిని గుంటూరుకు తీసుకురానున్నారు. గుంటూరుకు చెందిన వ్యాపారి కుమార్తె పదవ తరగతి చదువుతోంది. జూన్ 9న ట్యూషన్‌కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీనిపై తండ్రి పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు 10న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికను పర్చూరుకు చెందిన జాన్ సైదా తీసుకెళ్లినట్లు గుర్తించారు. నిందితుడు ఎప్పటికప్పుడు పోలీసులకు దొరక్కుండా ఫోన్లు, సిమ్‌లు మారుస్తూ తప్పించుకు తిరిగాడు. తమ కుమార్తె కిడ్నాప్‌కు గురై మూడు నెలలు సమీపిస్తున్న నేపథ్యంలో తండ్రి ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. వారు ఎక్కడున్నా సోమవారం నాటికి తమ ముందు హాజరు పరచాలని ఆదేశించింది. హైకోర్టు హెచ్చరికలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సీరియస్‌గా స్పందించారు. తొమ్మిది మందితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఈ జంట హరియాణలోని కర్నాల్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసు బృందం అక్కడికి చేరుకుని ఓ ఇంట్లో అద్డెకు ఉంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ బృందంతోపాటు బాలిక తల్లిదండ్రులు కూడా వెళ్లారు.
రెండు నెలలుగా కర్నాల్‌లోనే మకాం
గుంటూరు నుంచి అదృశ్యమైన జంట తొలుత ఏపీ ఆ తర్వాత తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ర్టాల్లో తిరిగి చివరిగా ఉత్తరభారతదేశం చేరుకుంది. నిందితుడు జాన్ సైదా తన స్నేహితుల ద్వారా కర్నాల్‌లో గది అద్దెకు తీసుకొని బాలికను అక్కడకు తీసుకెళ్లాడు. వారు రెండు నెలలుగా కర్నాల్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలిక ఇంటి నుంచి వెళ్లిన సమయంలో తనతో పాటు తీసుకెళ్లిన డబ్బుతో కొంతకాలం గడిపారు. డబ్బులు అయిపోయిన తర్వాత బంగారం అమ్మి వచ్చిన డబ్బుతో కాలం గడుపుతున్నట్లు తెలిసింది.
ఈ వార్తలను కూడా చదవండి
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా