నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:51 PM
ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి లుబ్బుర్తి జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. కూటమి ప్రభుత్వం సకాలంలో జలాశయం అక్విడెక్టులు, స్లూయిస్‌లు మరమ్మతులు చేయించింది. గట్లు పట్టిష్టం చేయించడంతో వర్షం నీరు వృథా కాకుండా జలాశయంలో నిలిచింది. ఆపై ఆయకట్టు రైతులు పహారా కాసి నీరు వృథా కాకుండా కాపాడుకోవడంతో జలాశయం నీటితో కళకళలాడుతోంది.
సకాలంలో రిజర్వాయర్‌కు మరమ్మతులు
చేయించిన కూటమి ప్రభుత్వం
వర్షపు నీరు బయటకు పోకుండా రైతుల పహారా
ఆయకట్టు పరిధిలోని వంద ఎకరాల్లో వరి సాగు
కొయ్యూరు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలో నాలుగు జలాశయాలున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒక్క లుబ్బుర్తి జలాశయం తప్ప మిగతా ఏ రిజర్వాయర్‌లో కూడా చుక్క నీరు లేదు. లుబ్బుర్తి జలాశయంలో జలకళ సంతరించుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అల్లూరి జిల్లా 11 మండలాల్లో గడిచిన మార్చి నుంచి ఎన్‌లినో ప్రభావంతో నేటికీ అత్యధిక ఉష్ణోగ్రతలు ఒక్క కొయ్యూరు మండలంలోనే నమోదవుతున్నాయి. ఈ ఏడాది మండలంలో కుండపోత వర్షం కురిసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ లుబ్బుర్తి జలాశయం నేటికీ నిండుకుండలా దర్శనమిస్తున్నది. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకున్న ఆయకట్టు రైతులు జలాశయ నీరు వృథాగా పోకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు చేపపిల్లలను వేసి చుక్కనీరు పోకుండా సంరక్షించుకున్నారు. దీనికితోడు జలాశయ పరిధిలోని మూడు పంచాయతీలకు చెందిన రైతులు సాగునీటి సంరక్షణ కమిటీగా ఏర్పడి.. నిత్యం పహారా కాస్తుండడంతో జలాశయం నీరు బయటకు పోకుండా సంరక్షించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొర్లుకట్టు, రిజర్వాయర్ గట్లు పటిష్టం చేయించడంతోపాటు స్లూయిస్‌కు నీరు వెళ్లే అక్విడెక్టులు మరమ్మతులు చేయించింది. వర్షం కురిసిన సమయంలో రిజర్వాయర్‌కు చేరిన వరద నీరు బయటకు పోలేదు. దీంతో ఆయకట్టు పరిధిలోని రైతాంగం 100 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. సకాలంలో ప్రభుత్వం రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టడంతోనే ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు చెబుతున్నారు.