PM Modi: పవన్ కల్యాణ్‌ను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:01 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పురాతన జపనీస్ సమురాయ్ యుద్ధ కళ అయిన 'కెంజుట్సు' (Kenjutsu)లో అధికారికంగా ప్రవేశం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రీడలో ఉన్నతస్థాయిని సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ మరోవైపు సినిమా కెరీర్ కొనసాగిస్తూ క్రమశిక్షణ, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. పవన్ సాధించిన విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతకు ఇచ్చారన్నారు. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందని చెప్పుకొచ్చారు. ఫిట్‌నెస్ పట్ల తనకున్న క్రమశిక్షణ, నిబద్ధత ఎంతో మందికి ప్రేరణ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పవన్ చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ.
ప్రధాని మోదీ ప్రశంసలపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ‘మోదీజీ పంపిన ఆత్మీయ అభినందన సందేశం నాకు గొప్ప గౌరవం. ప్రేమపూర్వకమైన మీ సందేశం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. యుద్ధకళలు శారీరక శ్రమ, ఏకాగ్రతతోపాటు ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తాయి. మీ నాయకత్వంలో బలమైన, దృఢమైన భారతదేశం నిర్మితమవుతుంది. స్వామి వివేకానంద ఆకాంక్షించిన బలమైన సమాజం ఆవిష్కృతమవుతుంది. ఈ అభినందన సందేశం పంపించిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి వాయిదా..
కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..
Read Latest AP News And Telugu News