Supreme Court: వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి వాయిదా..
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:16 PM
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు..
న్యూఢిల్లీ, జనవరి 13: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (Viveka Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తుపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో పరిమితంగా, పాక్షికంగా సీబీఐ దర్యాప్తునకు ట్రయల్ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ సునీతా రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు పాక్షికంగా మాత్రమే సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఇవ్వడం, కేవలం ఇద్దరి పాత్రలపై మాత్రమే విచారణ జరపాలని ఆదేశించడం వంటి అంశాలను.. సునీత తన అప్లికేషన్‌లో వెల్లడించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రయల్ కోర్టు విచారణ జరపలేదని, తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక ఆదేశాలు ఇచ్చారని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు.
గతంలో సీబీఐ విచారణ కొనసాగించే అంశంపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు.. సుప్రీం ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను పాటించకుండా ట్రయల్ కోర్టు పాక్షిక ఆదేశాలు ఇవ్వడం సరికాదని సునీత తరపు న్యాయవాది సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సునీత దాఖలు చేసిన అప్లికేషన్‌ను సుప్రీం కోర్టు విచారణ జరిపి, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (జనవరి 20) వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..
కైట్ ఫెస్టివల్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
Read Latest AP News And Telugu News