YSRCP: ఆలయ భూమిపై వైసీపీ గద్దలు..!
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:03 AM
మండలంలోని జనార్ధనపల్లిలోగల పాండురంగస్వామి, రామస్వామి ఆలయ భూమిని రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్లు రికార్డులు మార్చి వైసీపీ నాయకులకు ధారాదత్తం చేశారు. దీనిపై జనార్ధనపల్లి వాసులు ఏకమై గ్రామ వీధుల్లో 'ఉరవకొండ నియోజక వర్గం వైసీపీ ముఠాకోరుల..
రూ.5 కోట్ల భూమి కబ్జా.. దానంగా ఇచ్చిన దానిపై కన్ను.
మిగులు భూమిగా మార్పు.
ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీదకు బదిలీ.
అదే పేరుతో ఉన్న మరొకరికి రిజిస్ట్రేషన్.
ఆయన కూడా చనిపోయాడంటూ కొడుకుల పేరున బదిలీ.
వారి నుంచి కొనుగోలు చేసిన వైసీపీ నాయకుడు.
అడుగడుగునా రెవెన్యూ అధికారుల సహకారం
విడపనకల్లు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని జనార్ధనపల్లిలోగల పాండురంగస్వామి, రామస్వామి ఆలయ భూమిని రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్లు రికార్డులు మార్చి వైసీపీ నాయకులకు ధారాదత్తం చేశారు. దీనిపై జనార్ధనపల్లి వాసులు ఏకమై గ్రామ వీధుల్లో 'ఉరవకొండ నియోజక వర్గం వైసీపీ ముఠాకోరుల నుంచి దేవాలయ భూములను కాపాడాలం'టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేల్పుమడుగు రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 141లో మొత్తం 42.21 ఎకరాల పొలం ఉంది. ఇందులో కాశీబొట్ల గుండూరావుకు 21.10 ఎకరాలు ఉండగా.. అందులో అదే గ్రామానికి చెందిన కోనంకి వెంకటనాయుడుకు 10.55, వడ్డే బాలకొండన్నకు 10.55 ఎకరాలు చొప్పున విక్రయించి, 1954లో ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ రికార్డుల్లో తన భూమికి హద్దులు రాయించే సమయంలోనే పడమర దిక్కున ఇదే సర్వే నంబరుపైకి ఉరవకొండ(నివృత్తి) చంద్రశేఖరయ్య పొలం ఉన్నట్లు పొందుపరిచారు. కాశీబొట్ల గుండూరావు తన ఆస్తి మొత్తం విక్రయించారు.
మిగిలింది నివృత్తి కుటుంబ సభ్యుల భూమి మాత్రమే. ఇదే సర్వే నంబరులోని 21.10 ఎకరాలు మొత్తం నివృత్తి వెంకటరమణప్ప పేరున రికార్డుల్లో ఉంది. కొన్నేళ్లకు ఆయన కోడలు నివృత్తి శేషమ్మ, వీరి కుటుంబికులైన నివృత్తి పాండురంగారావు, నివృత్తి దక్షిణామూర్తి, నివృత్తి సదర్శనరావు పేర్లపైనే మండలంలోని వన్బీ అడంగల్ 2018వ సంవత్సరం వరకూ వచ్చింది. సంతానం లేకపోవడంతో పాండురంగస్వామి, రామస్వామి ఆలయాలకు ఈనాము ఇచ్చినట్లు గ్రామ పెద్దలు తెలుపుతున్నారు. దీంతో డైక్లాట్లో ఈనామ్ భూమిగా రికార్డు చేశారు. ఏ దేవాలయానికి ఇచ్చారు అనేది డైక్లాట్లో పొందుపరచలేదు. దీనిని దేవాలయ భూమి కాదంటూ వైసీపీ నేతలు వాదిస్తున్నారు. రెవెన్యూ అధికారులు.. కాసులకు కక్కుర్తిపడి 2018 లో ఈ భూమిని మిగులు భూమిగా రికార్డుల్లో నమోదు చేశారు. నివృత్తి కుటుంబ సభ్యుల పేర్లను తొలగించి. కరూరు గుండూరావు కుమారుల పేర్లను ఎక్కించారు.
వైసీపీ నాయకులు చెప్పినట్లే..
రెవెన్యూ చట్టం ప్రకారం ఏదైనా భూమికి సంబంధించి వన్బీలో పేర్ల మార్పులు చేయాలన్నా, ఆన్లైన్లో ఎక్కించాలన్నా.. ముందుగా అన్నదమ్ముల భాగ పరిష్కారాలు, దస్తావేజులు, రిజిస్ట్రేషన్ పత్రాలు చేయించుకుని ఉండాలి. వాటి ఆధారంగా రికార్డులను పరిశీలించి, వన్బీలో పేర్లను ఎక్కిస్తారు. ఇక్కడ అలాంటివేమీ లేకుండానే రెవెన్యూ అధికారులు కరూర్ గుండూరావు కుమారుల పేర్లను వన్బీల్లో 2019 జనవరి 10న ఎక్కించారు. ఏడు నెలల తరువాత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది, దస్తావేజులను 2019 జూలై 27న రాసుకుని, పట్టాదారు పాసుపుస్తకాలను పొంది, విక్రయించారు. రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించకుండా, కనీసం విచారించకుండా లక్షల రూపాయలు దండుకుని దేవాలయ భూమికి గుండూరావు కుమారులకు బోగస్ పాసుపుస్తకాలు ఇచ్చారు.
152 ఏళ్లు బతికాడంట..!
కాశీభొట్ల గుండూరావు తండ్రి రామక్రిష్ణ బొట్లకి 1861లోనే 45 సంవత్సరాలు, 1862లో కాశీబొట్ల గుండూరావు జన్మించాడనుకున్నా. 2014వ సంవత్సరానికి 152 సంవత్సరాల వయసు ఉండాలి. అలా... కాశీ బొట్ల (కరూర్) గుండూరావు 2014 జూన్ 25న మృతిచెందినట్లు సర్టిఫికెట్ తీసుకొచ్చారు. కాశీభొట్ల గుండూరావు పురోహితుడు. ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చిన కరూర్ గుండూరావు ప్రొద్దుటూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో టీచర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందారు. ఉపాధ్యాయుడిగా 1965లో విధుల్లో చేరి, 1989లో రిటైరయ్యారు. ఈయనకు 2008 నాటికి 93 సంవత్సరాలు, 2014లో మృతి చెందాడనుకున్నా 102 సంవత్సరాలు జీవించినట్లు.
సంతకాలు ఫోర్జరీ..
గుండూరావుల సంతకాలు కూడా ఫోర్టరీ చేసేశారని తెలుస్తోంది. కాశీబొట్ల, కరూర్ గుండూరావుల సంతకాలను పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుంది. 2018 వరకూ వన్బీలో నివృత్తి శేషమ్మ కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయి. ఉన్నఫలంగా ఆ పేర్లు మాయమవడం, మిగులు భూమిగా చూపించడం, ఇతరుల పేర్ల పైకి మార్చడం చకచకా జరిగిపోయాయి. కాశీబొట్ల గుండూరావు 1954లో తన భూమిని విక్రయించిన సమయంలో హద్దులు రాయిస్తూ పడమర దిక్కున ఇదే సర్వే నంబరుపైకి ఉరవకొండ చండ్ర శంకరయ్య చేను అని నమోదు చేశారు. ఇది కూడా ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్పష్టంగా ఉంది.
అది ఆలయ భూమే: కావేటి, జనార్దనపల్లి
నాకు 45 ఏళ్లు. ఊహ తెలిసినప్పట్నుంచి సర్వే నంబరు 141లోని 215 ఎకరాలు పాండురంగస్వామి ఆలయానికి చెందినదనే తెలుసు. దీనిని నివృత్తి కుటుంబికులు. ఆలయానికి ఇనాము ఇచ్చారనే విన్నా.. 21 ఎకరాలు ఇనాముగా ఇవ్వడంతో వారి ఫొటోలు కూడా పాండురంగ స్వామి ఆలయంలో ఉన్నాయి. ఈ భూమి ఆలయానిదే.
వైసీపీ నాయకుల పన్నాగం: మాధవ, జనార్దనపల్లి రైతు
కాశీబొట్ల గుండూరావు తనకున్న 21 ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. మిగిలిన భూమి మొత్తం నివృత్తి శేషమ్మ కుటుంబ సభ్యులదే. గుర్తుతెలియని గుండూరావును తీసుకొచ్చి బోగస్ రిజిస్ట్రేషన్ చేయించి, రూ.5 కోట్లకు పైగా విలువ చేసే భూమిని కాజేయాలని వైసీపీ నాయకులు పన్నాగం పన్నారు. ఏ ఆధారాలు లేకుండా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఎలా చేశారో వారే చెప్పాలి.
నివేదికలు పంపాం: చంద్రశేఖర్ రావు, డిప్యూటీ తహసీల్దార్, విడపనకల్లు
వేల్పుమడుగు రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబరు 141లోని 21.5 ఎకరాల భూమి వివాదంపై విచారణ చేపట్టాం. నివేదికలు ఉన్నతాధికారులకు పంపాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
Also Read:
షాకింగ్.. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
జిమ్‌లో కష్టపడటం కంటే.. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమే మేలు: పీవీ సింధు
అమ్మో.. వీధి కుక్కలు.. కాలనీల్లో గుంపులుగా సంచారం