ఏపీకి వైసీపీ హానికరం.. జగన్‌పై పయ్యావుల తీవ్ర వ్యాఖ్యలు..
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:54 PM
గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ‘వైసీపీ నెవర్ ఎగైన్.. వన్స్ ఎగైన్ కూటమి’ అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు..
అమరావతి, ఫిబ్రవరి 19: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే.. వైసీపీ గత పాలనపై మంత్రి మండిపడ్డారు. ‘వైసీపీ నెవర్ ఎగైన్.. కూటమి వన్స్ ఎగైన్’ అంటూ అసెంబ్లీ వేదికగా పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి వైసీపీ హానికరం అనే స్టాట్యూటరీ వార్నింగ్ నిరంతరం ఇస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ దేశస్థుల తరహాలో ప్రజలు కూడా మన రాష్ట్రం అనే భావనను పెంపొందించుకోవాలని సూచించారు.
వడ్డీ రేట్లు తగ్గేలా చర్యలు..
అధిక వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు. సుమారు రూ.2 వేల కోట్ల మేర వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు ఆదా అయితే.. చాలా పథకాలు సమర్థవంతంగా అమలు చేయవచ్చన్నారు మంత్రి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మైనింగ్ శాఖలో 33 శాతం, ఎక్సైజ్ శాఖలో 24 శాతం ఆదాయం పెరిగిందని వివరించారు. గత ప్రభుత్వంలో గనులు, ఎక్సైజ్ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిందని వైసీపీపై పయ్యావుల విమర్శలు గుప్పించారు.
భూకేటాయింపుల్లో లాభాలు, నష్టాలు..
కూటమి జరిపిన భూ కేటాయింపుల వల్ల కలిగిన లాభాలను.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిపిన భూ కేటాయింపుల వల్ల కలిగిన నష్టాలను మంత్రి సభలో ఏకరువు పెట్టారు. సీఎం చంద్రబాబు హయాంలో భూములు కేటాయిస్తే... కియా, హెచ్‌సీఎల్, అశోక్ లేలాండ్, హీరో కంపెనీ, టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వంటి సంస్థలు వచ్చాయని తెలిపారు. వైసీపీ హయాంలో ఇచ్చిన భూముల్లో ఒక్క కంపెనీ కూడా రాలేదని గుర్తుచేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, వ్యాన్ పిక్, బ్రాహ్మణి స్టీల్స్‌కు భూములిచ్చినా.. ఒక్క ఎంఎస్ఎంఈ కూడా రాలేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌పై...
రాయలసీమ హార్టికల్చర్ హబ్ అంశంపై సభలో పయ్యావుల ఆసక్తికర కామెంట్లు చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవతో పరిశ్రమల్లోనే కాదు.. పొలాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పొలాలను కొంటున్నారని, దానిమ్మ పండిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు చొరవతో రాయలసీమ ఉత్పత్తులకు అరకు తరహాలో అంతర్జాతీయ బ్రాండింగ్ రాబోతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
జగన్‌పై విమర్శలు..
అలాగే, రాయలసీమ ప్రాజెక్టులకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని మంత్రి పయ్యావుల వివరించారు. 102 రాయలసీమ ప్రాజెక్టులను ఒక్క సంతకంతో రద్దు చేశారని జగన్‌పై ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడం లేదని నాడు కేంద్రానికి అప్పటి ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారంటూ డాక్యుమెంట్లను మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు.
తన బడ్జెట్ రిప్లైలో ‘ఒక్క ఓటు.. వంద లాభాలు’ అంటూ కూటమి ప్రభుత్వం చేసిన పనులను మంత్రి పయ్యావుల ప్రస్తావించారు.
ఒక్క ఓటు – అమరావతికి రూ.12 వేల కోట్లు
ఒక్క ఓటు – పోలవరానికి రూ.15 వేల కోట్లు
ఒక్క ఓటు – విశాఖ స్టీల్ ప్లాంట్ పునరద్ధరణకు రూ.11 వేల కోట్లు
ఒక్క ఓటు – విశాఖకు గూగుల్ డేటా సెంటర్
ఒక్క ఓటు – విశాఖకు రైల్వే జోన్
ఒక్క ఓటు – పూర్వోదయ స్కీం
ఒక్క ఓటు - రాయలసీమ హర్టికల్చర్ హబ్
ఒక్క ఓటు – అమరావతికి క్వాంటమ్ వ్యాలీ
ఒక్క ఓటు – విద్యుత్ ఛార్జీల తగ్గింపు
ఒక్క ఓటు – వేలాది కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే లైన్లు
ఒక్క ఓటు – ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
ఒక్క ఓటు – టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు
ఒక్క ఓటు – కేవలం మూడు రోజుల్లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు 610 ఎంఓయూలు
ఒక్క ఓటు – ఆడబిడ్డలకు భద్రత
ఒక్క ఓటు – రాయలసీమకు హంద్రీ - నీవా కాల్వల ద్వారా కృష్ణా జలాలు
ఒక్క ఓటు – అమరావతికి రాజధానిగా చట్టబద్ధత
ఒక్క ఓటు – రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు
ఒక్క ఓటు – టీచర్ రిక్రూట్‌మెంట్, పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం
ఒక్క ఓటు – లక్షల కోట్ల సంక్షేమం
ఒక్క ఓటు - 20 లక్షల ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్
ఒక్క ఓటు – లక్షల కోట్ల అభివృద్ధి
ఒక్క ఓటు – పోర్టులు, ఎయిర్ పోర్టులు
ఒక్క ఓటు – ఇంటింటికి తాగు నీటి కనెక్షన్లు
ఒక్క ఓటు – గుంతల్లేని రోడ్లు
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. మంత్రుల సమాధానాలు
Read Latest AP News And Telugu News