Share News

మండలిలో విజిల్స్ వేస్తూ వైసీపీ హంగామా.. అచ్చెన్నాయుడు ఫైర్

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:07 PM

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘చీజ్‌కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

మండలిలో విజిల్స్ వేస్తూ వైసీపీ హంగామా.. అచ్చెన్నాయుడు ఫైర్
AP Legislative Council

అమరావతి, ఫిబ్రవరి 19: వైసీపీ ఆందోళనతో ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలిలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తు హంగామా చేయడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి సిగ్గులేదంటూ వ్యాఖ్యలు చేశారు. మండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ‘చీజ్‌కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యం’ అని వ్యాఖ్యానించారు. గత మూడు రోజులుగా ప్రభుత్వం తరఫున స్పష్టమైన సమాధానాలు ఇస్తున్నా వైసీపీ సభ్యులు కావాలని సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు.


ఇందాపూర్‌కు హెరిటేజ్‌కు ఏ సంబంధం ఉన్నా ఆధారాలు తీసుకొచ్చి చూపించాలని.. గంటల తరబడి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్ విసిరారు. ఎల్‌వోపీ బొత్స సత్యనారాయణ ప్రెస్‌మీట్‌‌ పెట్టి.. చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘ఒక సీనియర్ సభ్యుడిగా ఉన్న బొత్సకు చీజ్‌కి నెయ్యికి తేడా కూడా తెలియడం లేదు. ఇది మన దౌర్భాగ్యం’ అని అన్నారు. హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చినా వైసీపీ బుద్ధి మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


తిరుమల కల్తీ నెయ్యిని డైవర్ట్ చేసేందుకు హెరిటేజ్ సంస్థపై అభాండాలు మోపుతున్నారని మంత్రి ఆరోపించారు. హెరిటేజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ వ్యాపారం చేయబోమని నిర్ణయం తీసుకుందన్నారు. ‘ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సాక్షి, భారతి సిమెంట్స్ ద్వారా ప్రజల సొమ్ము దోచుకున్న జగన్ మాదిరి హెరిటేజ్ ఎప్పుడూ చేయదు’ అని స్పష్టం చేశారు. వైసీపీ ఫ్యాక్షన్ మనస్తత్వంతో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలని హెరిటేజ్ ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘ఆధారాలతో సభలో చదివి సమాధానం అడగండి... ఎంత సేపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వచ్చి సమాధానం చెప్పాలంటే ఎలా చెప్పాలని ప్రశ్నించారు. చైర్మన్ సభను ఆర్డర్‌లో నడిపించి, ఆటంకం కలిగించే సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. మంత్రుల సమాధానాలు

సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 12:44 PM